విమానాలు లేక..  ఇంటికి రాలేక! 

Nearly 3000 People From Telangana Stranded In Qatar Due To No Aeroplanes - Sakshi

సాక్షి,బాల్కొండ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ అమలు వల్ల విదేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను రప్పించడానికి చేపట్టిన వందే భారత్‌ మిషన్‌ మందకొడిగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఖతర్‌ నుంచి తెలంగాణకు చేరుకోవడానికి దాదాపు 3 వేల మంది అక్కడి ఎంబసీలో దరఖాస్తు చేసుకున్నారు. వందే భారత్‌ మిషన్‌ మొదటి విడతలో ఖతర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మే 20న ఒకే ఒక విమానంలో వలస కార్మికులను రప్పించారు. ఇలా వచ్చిన 200 మందిని మాత్రమే ఇళ్లకు చేర్చారు.(మేము క్వారంటైన్‌కు వెళ్లాలా?)

ఇంకా వేల మంది తెలంగాణ వాసులు ఖతర్‌లోనే ఉండిపోయారు.  లాక్‌డౌన్‌ వల్ల ఎన్నో కంపెనీలు మూతపడటంతో అనేకమంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. చేతిలో డబ్బులు లేక, ఇంటి అద్దె చెల్లించలేక పార్కులలో కొందరు, తెలిసిన వారి గదుల్లో మరి కొందరు తలదాచుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న భోజనంతోనే రోజులు గడుపుతున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారు గతంలో కుటుంబ సభ్యులను ఖతర్‌కు రప్పించుకున్నారు. ఇప్పుడు వారిలో చాలామందికి వీసా గడువు ముగిసినా లాక్‌డౌన్‌ వల్ల అక్కడే చిక్కుకు పోయారు. (సుశాంత్‌ ఇంట మరో విషాదం)

ఖతర్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో వైరస్‌ బారిన పడకుండా ఉండటానికి తమ కుటుంబ సభ్యులను ఇళ్లకు పంపించడానికి తెలంగాణ వాసులు సిద్ధంగా ఉన్నారు. అలాగే, అనారోగ్యంతో బాధ పడుతున్న వారు ఇంటికి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.వందే భారత్‌ మిషన్‌ కింద ఖతర్‌లోని భారతీయులను రప్పించడానికి అవసరమైనన్ని విమానాలను కేంద్రం పంపించడం లేదు. ప్రధానంగా తెలంగాణ కార్మికులను ఖతర్‌ నుంచి హైదరాబాద్‌కు చేర్చడానికి ప్రత్యేక విమానాలు అవసరం ఉన్నాయి. వాటి చార్జీలు ఎంతగా ఉన్నా భరించి స్వస్థలాలకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని పలువురు కార్మికులు ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఖతర్‌–హైదరాబాద్‌ మధ్య ఎక్కువ విమానాలు నడిపేలా చూడాలని కార్మికులు కోరుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top