ఎన్నికల రణరంగంలో జాతీయ నేతలు

National Leaders Campaign In Telangana - Sakshi

తెలంగాణలో జాతీయ నాయకుల ఎన్నికల ప్రచారం

రాహుల్‌, అమిత్‌ షా, సుష్మా, మాయావతి పర్యటన

తారాస్థాయికి చేరుకున్న ఎన్నికల  ప్రచారం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రస్థాయి నేతలంతా రాష్ట్రాన్ని చుట్టివస్తుంటే.. మరోవైపు అన్ని పార్టీలు తమ జాతీయ నేతలను రంగంలోకి  దింపాయి. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలి గులాబీ అధినేత కేసీఆర్‌ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేస్తూ రోజుకి ఆరేసి సభల్లో ప్రసంగిస్తున్నారు. ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్‌ సైతం అటు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ప్రచారం చేస్తూనే గ్రేటర్‌లో రోడ్‌షోలతో దూసుకుపోతున్నారు.

జాతీయ నేతలంతా...
ఇదిలావుండగా ఈసారి ఎలాగైనా తెలంగాణ గడ్డపై జెండా పాతాలని కాంగ్రెస్‌, బీజేపీలు ఉవ్విళూరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంతో కీలకంగా భావించే రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లను కాదని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ మేడ్చల్‌ సభలో పాల్గొని ప్రచారశంకాన్ని పూరించారు. సోనియాతో పాటు ఓ విడుత తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్‌ గాంధీ  రెండో విడుత ప్రచారం కోసం నేడు (బుధవారం) రంగంలోకి దిగారు. రేవంత్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ సభలో పాల్గొని, మహాకూటమి నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖమ్మం బహిరంగ సభకి ఆయన హాజరుకానున్నారు. రాహుల్‌తో పాటు మహాకూటమి నేతలంతా ఖమ్మం​ సభ వేదికను పంచుకోనున్నారు. దీంతో ఖమ్మం రాష్ట్ర ప్రజలు దృష్టిని ఆకర్షించింది.

రెండు రోజుల రాహుల్‌ పర్యటనలో రోడ్‌షోలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో మరింత ఉత్సహం నింపుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లతోపాటు పోటాపోటీ సభలతో బీజేపీ దూసుకుపోతోంది. మేమేమీ తక్కువ కాదంటూ ఎన్నికల రణరంగంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఇది వరకే ఓ విడత ప్రచారంతో సవాలు విసరగా.. నేడు ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభ ద్వారా రెండో విడుత ప్రచారానికి సిద్ధమైయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం​ మంగళవారం నిజామాబాద్‌, పాలమూరు సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

చిన్నమ్మ.. మాయా
తెలంగాణ ప్రజలకు చిన్నమ్మగా సుపరిచితురాలైన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. నేడు హైదరాబాద్‌లో జరిగే రోడ్‌షోలో ఆమె పాల్గొని మాట్లాడనున్నారు. ఇదిలావుండగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారం కోసం నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జాతీయ నేతలంతా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడంతో రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. నేతల మాటల తూటలతో తెలంగాణ యుద్ధభూమిని తలపిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top