అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఎంపీ మాగంటి బాబు దౌర్జనం చేసిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు
హైదరాబాద్ : అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఎంపీ మాగంటి బాబు దౌర్జనం చేసిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిసి దాడి ఘటనను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్ ను కోరారు.
కాగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై ఏపీకి చెందిన టీడీపీ కార్యకర్తలు గురువారం దాడి చేసిన విషయం తెలిసిందే. పోలవరం ముంపు మండలాల ఆదివాసీలకు మెరుగైన ప్యాకేజీతో కూడిన నష్టపరిహారాన్ని ఇవ్వాలని వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన ఆయనపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సాక్షిగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. కిందపడేసి కుర్చీలతో దాడి చేశారు. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు.