
ఇబ్రహీంపట్నంరూరల్: కళ్ల ముందే మన చేయి తెగిపోయి పడిపోతే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. ఆ క్షణాలను ఊహించుకుంటేనే ఒళ్లంతా చెమటలు పట్టడం ఖాయం. అంతెందుకు మన కళ్లముందు ఎవరికైనా జరిగితే చూడటానికి కూడా ధైర్యం సరిపోదు. ఇదే పరిస్థితి రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి ఎదురైంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడ గ్రామానికి చెందిన శేఖర్ గురువారం హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు తన సొంత ఆటోలో ఉల్లిగడ్డ లోడుతో వెళ్తున్నాడు.
ఆటోను ఆయనే స్వయంగా నడుపుకుంటూ వెళ్తుండగా ఇబ్రహీంపట్నం అగ్నిమాపక కేంద్రం వద్దకు రాగానే వెనుక టైర్ పగిలిపోయి బండి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి శేఖర్ తప్పించుకునే లోపే ఆటో ఆయన చేతిపై పడిపోయింది. దీంతో కుడి చేయి సగానికి తెగిపోయి వేలాడింది. తోటి ప్రయాణికులు వచ్చి శేఖర్‌ను బయటకు తీసి కాపాడారు. వేలాడుతున్న చేతితోనే నగరంలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయంతో శేఖర్ విలవిలలాడాడు.