కాసుకోం‘ఢీ’

Kodi Pandalu In Khammam - Sakshi

సత్తుపల్లి: కాకిడేగ పందానికి సై అంటే.. నెమలి పుంజు తొడకొడుతోంది. పందెం రాయుళ్లలో హుషారు ఉరకలేస్తోంది. సరదాల సంక్రాంతి పండగ పురస్కరించుకుని ఆంధ్రా సరిహద్దుల్లో పందెం బిర్రులు సిద్ధమవుతున్నాయి. పోలీసులు ఆంక్షలు పెడుతున్నా.. పందెం రాయుళ్లు వెనక్కు తగ్గడంలేదు. భోగి, సంక్రాంతి, కనుమ మూడురోజులు కోడి పందేలు వేసేందుకు రాయుళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఆంధ్ర సరిహద్దులో ఉన్న  సత్తుపల్లి నియోజకవర్గంపై కోడిపందేల ప్రభావం అధికంగానే ఉంది.

పశ్చిమగోదావరిజిల్లా సీతానగరం, పోతునూరు, సీసం, చింతంపల్లి, కృష్ణాజిల్లా కొప్పాక, కొత్తూరు, కాకర్ల, పోళ్లు గ్రామాల్లో కోడిపందేల బిర్రులు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణాజిల్లా చాట్రాయి మండలంలో కోడి పందేల బిర్రులపై పోలీసులు దాడి చేయటంతో ఇద్దరు యువకులు తప్పించుకునే ప్రయత్నంలో బావిలోపడి మృత్యువాత పడ్డారు. దీంతో ఆ జిల్లాలో కోడి పందేలు జరిగే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పందెం రాయుళ్లు చెప్పుకుంటున్నారు. 

ఉత్సాహంగా.. ఉల్లాసంగా..  
సంక్రాంతి పండగ మూడురోజులు పందేలు కాసేందుకు ఉత్సాహం చూపిస్తారు. సంకలో కోడిపుంజు పట్టుకుని పందేలకు వెళ్లేవాళ్లు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కన్పిస్తారు. పందేలను తిలకించేందుకు కూడా పెద్ద సంఖ్యలో తరలి వెళ్తారు. పట్టణాలు, నగరాల  నుంచి పండగలకు వచ్చిన అతిథులు, బంధువులు పందేలను చూసేందుకు ఆసక్తి కనబర్చుతారు. పల్లెల్లో ఖరీదైన కార్లలో పందెం రాయుళ్లు హల్‌చల్‌ చేస్తుంటారు.

పందెం కోసం ప్రత్యేక శిక్షణ 
పందేల కోసం కోడి పుంజులను ప్రత్యేక శిక్షణ ఇచ్చి పెంచుతారు. సాధారణ కోళ్ల కంటే పందెం కోళ్లు చూడటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.  పసిబిడ్డను పెంచినట్టు పందెం కోళ్ల ఆలనాపాలనా చూస్తారు. పందెం కోళ్ల ఆకారం.. కూత గంభీరంగా ఉంటుంది. పందేలకు మూడు నెలల ముందు నుంచే పందెం పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏడాదిన్నర వయసు ఉన్న పుంజును ఎంచుకుని ప్రత్యేక బోనులో ఉంచి సకల సౌకర్యాలతో పెంచుతారు. పందెం కోళ్లు మిగతా కోళ్లతో జతకట్టనివ్వరు. బ్రహ్మచర్యం వల్ల పుంజులకు శక్తి పెరుగుతుందని విశ్వాసం.

కోడి పుంజులకు సజ్జలు, సోళ్లు, మటన్‌ కీమా, బాదం, పిస్తా, పప్పు, పచ్చసొన తీసిని కోడిగుడ్డు, రెవిటాల్‌ టాబ్లెట్, 18 రకాల దినుసులు కలిపిన లేహ్యం తినిపిస్తారు. కొవ్వు పట్టకుండా వేడి నీళ్లల్లో వేప, జామ, వెదురు ఆకులు, పసుపు కలిపి మరగబెట్టిన గోరువెచ్చని నీటితో పందెం పుంజులకు ప్రత్యేకంగా స్నానం చేపిస్తారు. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా పుంజును పందేనికి సిద్ధం చేస్తారు. పందెం కోళ్లల్లో సుమారు 50 రకాలు ఉంటాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సీతువ, పూల, పింగళి, కౌజు, ఎర్రబోర, నెమలి పుంజులు ఉంటాయి.

లక్షల్లో కోడి కోసాట.. 
కోడి పందేల మాటున అదే ప్రాంతంలో లక్షల రూపాయల్లో  కోసాట(లోన, బయట) పేకాట నిర్వహిస్తుంటారు. ఓ వైపు కోడి పందేలు నడుస్తుండగానే కోసాట(పేకాట) నడుస్తుంటుంది. రాత్రి వేళ్లల్లో సైతం ఫ్లడ్‌లైట్ల వెలుగులో లక్షల రూపాయల కోసాట(లోన, బయట) జరుగుతుందని సమాచారం. పందెం రాయుళ్లు ఉదయం నుంచి మద్యం మత్తులో ఉండటంతో లోనబయట పేకాటలో సర్వం పోగొట్టుకున్న సందర్భాలు అనేకం వినిపిస్తున్నాయి. పందెం జరిగే తోటల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కోడిపందేలు జరుగుతుండగానే కోసాట, గుండుపట్టాలు, పులిమేక జూదం నడుస్తున్నట్లు సమాచారం. జూదరులకు అందుబాటులో మద్యం, మాంసం విక్రయాలు, బిరియాని ప్యాకెట్లు లభిస్తుంటాయి.

పోలీస్‌ నిఘా ఉన్నా..  
కోడిపందేలు నియంత్రించేందుకు పోలీసులు నిఘా ముమ్మరం చేసి హెచ్చరికలు జారీచేసినప్పటికీ పందెం రాయుళ్లు ఖాతరు చేయటం లేదు. గతేడాది పండగ మూడురోజులు పోలీసులు పందేలను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పోలీసులు సరిహద్దుల్లో గస్తీకాస్తున్నా పందెంరాయుళ్లు కోడిపుంజులను వేరే దారిన పంపించి పందేల స్థావరాలను చేరుకుంటారు. ఒక్కోసారి పోలీసులకు పందేలు ఓచోట నడుస్తున్నాయని సమాచారం అందించి, వారిని బురిడి కొట్టించి వేరేచోట దర్జాగా పందేలు వేస్తుంటారు. పండగ మూడురోజులు కోడిపందేలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ పందెం రాయుళ్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిమాండ్‌ చేయటం విశేషం.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top