మాకంటే మాకు..!

Khammam Politics MLA Tickets For Competitions - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లా రాజకీయం మరింత వేడెక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం షెడ్యూల్‌ను ప్రకటించడంతో మహాకూటమిలో టికెట్లు దక్కించుకునే వారి మధ్య పోటాపోటీ నెలకొంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ప్రచార పర్వం ప్రారంభించగా.. కాంగ్రెస్‌లోని ఆశావహులు టికెట్ల కోసం ఢిల్లీ స్థాయిలో తమవంతు ప్రయత్నాలు వేగవంతం చేశారు. మహాకూటమి భాగస్వామ్య పక్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పట్టుండడం.. కాంగ్రెస్, కూటమి పక్షాలు అనేక చోట్ల స్థానాలు కోరుతుండడంతో సీట్ల మధ్య మడతపేచీ నెలకొంది. టీడీపీ, సీపీఐ జిల్లాలో తమకు గల బలాబలాల ఆధారంగా సీట్లు కోరుతుండటం.. వాటిలోనే సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందన్న కారణంతో కాంగ్రెస్‌ గట్టిపట్టు పడుతుండడంతో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

ఒక్కో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడును తలపిస్తోంది. ఈనెల 20వ తేదీలోపు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా శనివారం ప్రకటించడంతో ఆశావహులు తమ ప్రయత్నాలకు మరింత పదును పెట్టారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు కూటమి భాగస్వామ్య పక్షాలైన సీపీఐ మూడు, టీడీపీ మరో మూడు స్థానాలను కోరుతుండగా.. కాంగ్రెస్‌కు కేవలం నాలుగు స్థానాలు మాత్రమే మిగిలే పరిస్థితి ఉంది. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క స్థానానికి మాత్రమే పోటీ లేని పరిస్థితి నెలకొంది. ఆయన ఇప్పటికే మధిరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 

భారీగానే ఆశావహులు.. 
ఇక మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. ఇల్లెందు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య 29 నుంచి 30కి చేరింది. తాజాగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నేత ఊకే అబ్బయ్య కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన సైతం టికెట్‌ ఆశిస్తున్నారు. ఇదే స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన హరిప్రియ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తుండగా.. భూక్యా దళ్‌సింగ్, డాక్టర్‌ రవి, 2009 ఎన్నికల్లో వైరా నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్రనాయక్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చీమల వెంకటేశ్వర్లు అధిష్టానం వద్ద టికెట్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం స్థానాల కోసం కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ తమకంటే తమకంటూ పట్టుపడుతున్నాయి. ఖమ్మం నుంచి మహాకూటమి తరఫున టీడీపీకి చెందిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా.. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ప్రముఖ పారిశ్రామిక వేత్త వద్దిరాజు రవిచంద్ర, మానుకొండ రాధాకిషోర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు టికెట్‌ ఆశిస్తూ తమతమ స్థాయిల్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

పాలేరు నుంచి కాంగ్రెస్‌ తరఫున కందాల ఉపేందర్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది ఈడా శేషగిరిరావు, మరో న్యాయవాది మద్ది శ్రీనివాస్‌రెడ్డి ప్రయత్నిస్తుండగా.. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి పేరు సైతం టికెట్‌ ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈడా శేషగిరిరావు నియోజకవర్గంలోని గాంధీ కుటుంబ సభ్యుల విగ్రహాలను ఆధునికీకరించే పనికి శ్రీకారం చుట్టారు. కందాల ఉపేందర్‌రెడ్డి ఎన్నికల కార్యాలయాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కూటమి పొత్తుల వల్ల సత్తుపల్లి సీటును సిట్టింగ్‌ అభ్యర్థి, టీడీపీకి చెందిన వెంకటవీరయ్యకు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ను పార్టీ ఏ విధంగా సర్దుబాటు చేస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది.
 
కొత్తగూడెంపై ఉత్కంఠ 
కొత్తగూడెం సీటు విషయంలో భాగస్వామ్య పక్షాలన్నీ గట్టి పట్టు పడుతుండడంతో ఈ స్థానం ఎవరికి దక్కుతుందనే అంశం సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్‌ చేస్తుండగా.. మాజీ మంత్రి రేణుకాచౌదరి ఆశీస్సులతో కాంగ్రెస్‌ నాయకుడు ఎడవల్లి కృష్ణ సైతం తనకు సీటు ఇవ్వాలని అధిష్టానం వద్ద పట్టుపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు 2009 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కూనంనేని సాంబశివరావు.. 2014లోనూ కాంగ్రెస్‌ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి సైతం కూనంనేని పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

దీంతో కొత్తగూడెం స్థానం సీపీఐకే లభిస్తుందన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. ఇక గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోనేరు సత్యనారాయణ(చిన్ని) మహాకూటమి తరఫున తనకు అవకాశం ఇవ్వాలని పార్టీపరంగా ఒత్తిడి తేవడంతోపాటు సినీ నటుడు బాలకృష్ణ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అశ్వారావుపేట నుంచి కూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ పోటీ చేసేందుకు తహతహలాడుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన మెచ్చా నాగేశ్వరరావును మరోసారి పోటీ చేయించేందుకు టీడీపీ సమాయత్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కాంగ్రెస్‌ నుంచి అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు సున్నం నాగమణి, కారం శ్రీరాములు, దంజునాయక్, కొడెం లక్ష్మీనారాయణ తదితరులు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

దీటైన అభ్యర్థి కోసం ప్రయత్నం.. 
ఇక కీలకమైన భద్రాచలం నియోజకవర్గం నుంచి ఇప్పటికే టీఆర్‌ఎస్, బీఎల్‌ఎఫ్‌ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్‌ సైతం ఈ స్థానంలో విజయం సాధించడం కోసం ధీటైన అభ్యర్థి కోసం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న వారిలో పీర్ల కృష్ణబాబు, కారం కృష్ణమోహన్‌తోపాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను ఇక్కడి నుంచి పోటీ చేయించే అంశాన్ని సైతం కాంగ్రెస్‌ పరిశీలిస్తున్నట్లు ప్రచారమవుతోంది. ఇక పినపాక నుంచి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు టికెట్‌ దాదాపు ఖరారు అయినట్లేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా.. ఇదే స్థానం నుంచి కూటమి తరఫున పోటీ చేసేందుకు సీపీఐ ఆసక్తి ప్రదర్శిస్తోంది. దీంతో సీట్ల సర్దుబాటులో ఈ స్థానం ఎవరికి దక్కుతుందనే అంశం కొంత ఉత్కంఠ రేపుతోంది.

వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న మాజీ పోలీస్‌ అధికారి రాములునాయక్, టీడీపీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రాందాస్‌నాయక్, లకావత్‌ గిరిబాబునాయక్‌ తీవ్రస్థాయిలో టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే స్థానాన్ని మహాకూటమి తరఫున ఆశిస్తున్న సీపీఐ.. ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఓ పోలీస్‌ ఉన్నతాధికారి సతీమణిని పోటీ చేయించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల ప్రకటనకు పట్టుమని పది రోజులైనా సమయం లేకపోవడంతో ఆయా నియోజకవర్గాల ఆశావహులు తమతమ నేతల ద్వారా టికెట్‌ కోసం ఇటు హైదరాబాద్‌లోనూ.. అటు ఢిల్లీలోనూ మకాం వేసి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తుండడంతో కాంగ్రెస్‌లో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top