
టీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్తున్నట్టు ఉంది: రేవంత్
శాసనసభలో ఎథిక్స్ కమిటీ ఆదేశాలకు నడుచుకుంటానని, టీఆర్ఎస్ సన్నాసులు చెబితే వినేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్: శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు కనుసన్నల్లో తెలంగాణ అసెంబ్లీ నడుస్తోందని టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలోకి వచ్చినట్టు లేదని, టీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్తున్నట్టు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఒక సంస్థకు లబ్ది చేకూర్చారని ఆధారాలతో మీడియా ముందు పెట్టానన్నారు.
మైహోం రామేశ్వరరావుకు స్వయంగా కేసీఆర్ ఐఎస్ఐ సర్టిఫికెట్ ఇస్తున్నారన్నారు. దీనిపై సభలో చర్చించాలనే తమను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారని ఆరోపించారు. రాజకీయంగా తమను లొంగదీసుకోవాలని చూస్తున్నారని అన్నారు. బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే పారిపోతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలన్నీ కలిసి పట్టుకోవాలని పిలుపునిచ్చారు.
ఆపరేషన్ బ్లూస్టార్ అంటూ సభలో తనను బెదిరించారని వాపోయారు. తాను నోరు తెరిస్తే బండారం బయటపడుతుందని క్షమాపణ చెప్పాలంటూ అడ్డుకుంటున్నారని వాపోయారు. శాసనసభలో ఎథిక్స్ కమిటీ ఆదేశాలకు నడుచుకుంటానని, టీఆర్ఎస్ సన్నాసులు చెబితే వినేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.