టీబీజీకేఎస్‌ను వీడిన కనకరాజు

Kanakraju leave The TBJKS Party And Join In Congress In Khammam - Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌  సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక 

 ఎన్నికల సమయంలో  టీఆర్‌ఎస్‌కు షాక్‌ 

సాక్షి, కొత్తగూడెం: టీబీజీకేఎస్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆ సంఘం మాజీ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు ఆ యూనియన్‌కు గుడ్‌బై చెప్పారు. మరో రెండు వారాల్లో సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్, టీబీజీకేఎస్‌కు రాజీనామా చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కనకరాజుతోపాటు టీబీజీకేఎస్‌ మణుగూరు బ్రాంచి ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ఓదెల ఉమామహేశ్వరరావు, బ్రాంచి సెక్రటరీ మేకల ఈశ్వర్, నాయకులు ఓ.రాములు, బి.వెంకటరత్నంలతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తాను టీబీజీకేఎస్, టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడానికి, కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ ఐఎన్‌టీయూసీలో చేరడానికి గల కారణాలను తెలియజేస్తూ కనకరాజు ప్రకటన విడుదల చేశారు.

అటు తెలంగాణ ఉద్యమంలోనూ, ఇటు సింగరేణిలో టీబీజీకేఎస్‌ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేశానన్నారు. 2014లో టీబీజీకేఎస్‌లో సంస్థాగత ఎన్నికల్లో తనను ఓడించేందుకు మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌ తీవ్ర ప్రయత్నం చేశారని తెలిపారు. అయినప్పటికీ నీతి, నిజాయితీగా ఉన్న తాను విజయం సాధించానని, ప్రస్తుతం టీబీజీకేఎస్‌ అవినీతిపరుల, ఉద్యమద్రోహుల, పైరవీకారుల యూనియన్‌గా మారిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. కులతత్వంతో టీబీజీకేఎస్‌ నిండిపోయిందని, నాయకత్వ మార్పు కోసం ఇన్నాళ్లు ఎదురుచూసి ఓపిక నశించి ఆ పార్టీకి, సంఘానికి రాజీనామా చేసినట్లు వివరించారు

కాంగ్రెస్‌ పార్టీ, ఐఎన్‌టీయూసీలో దళితులు, గిరిజనులు, పీడిత కార్మిక వర్గానికి ప్రాధాన్యత ఉందని, జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరానని తెలిపారు. ఐఎన్‌టీయూసీ, కాం గ్రెస్‌ బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తానని, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వ మార్గదర్శకత్వంలో సింగరేణిలో పనిచేస్తూ వచ్చే ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా ఐఎన్‌టీయూసీ గెలుపు కోసం కృషి చేస్తానని కనకరాజు పేర్కొన్నారు. కాగా తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ తరుపున గోదావరీ పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల్లో కనకరాజు అత్యంత క్రియాశీలకంగా పనిచేశారనే పేరుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top