
సాక్షి, జనగామ: సినీ తారలకు పెద్దసంఖ్యలో అభిమానులు ఉంటారు. తమ అభిమాన తారను చూసేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాను. కానీ, అభిమానం ముదిరి.. వెర్రీగా మారితేనే చిక్కు! అలాంటి ఘటన జనగామలో చోటుచేసుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఓ యువకుడు ఏకంగా సెల్ టవర్ ఎక్కాడు. అత్యంత ప్రమాదకరంగా సెల్ టవర్ అంచు మీద నిలబడి.. ప్రభాస్ వస్తేనే టవర్ దిగుతానని, లేకపోతే దూకి చస్తానని బెదిరిస్తున్నాడు.
జనగామ జిల్లా యశ్వంత్‌పుర పెట్రోల్ బంక్ పక్కన ఉన్న సెల్ టవర్‌పైకి గుగులోతు వెంకన్న అనే యువకుడు ఎక్కాడు. గుగులోతు వెంకన్నది మహబూబాబాద్. అతడు ప్రభాస్ అభిమాని అని తెలుస్తోంది. ప్రభాస్ అంటే ఇష్టమని, ప్రభాస్‌ను చూడాలని ఉందని సెల్ టవర్‌పైకి ఎక్కిన వెంకన్న డిమాండ్ చేస్తున్నాడు. తనను చూసేందుకు, కలిసేందుకు ప్రభాస్ రాకపోతే సెల్ టవర్ పై నుంచి దూకేస్తానని అతను బెదిరించాడు. ఇదేమీ విడ్డూరమని విస్తుపోతున్న స్థానికులు.. యువకుడిని బతిమాలి కిందికి దించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.