నెలాఖరులో జేఏసీ పార్టీ రిజిస్ట్రేషన్‌! | Sakshi
Sakshi News home page

నెలాఖరులో జేఏసీ పార్టీ రిజిస్ట్రేషన్‌!

Published Fri, Jan 5 2018 1:36 AM

JAC Party Registration on month end - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:   తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో రాజకీయ పార్టీని రిజిస్ట్రేషన్‌ చేయడానికి ఈ నెలాఖరులో జేఏసీ బృందం ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలిసింది. పార్టీకి ‘తెలంగాణ జన సమితి’(టీజేఎస్‌) అనే పేరును దాదాపుగా ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పేరుతో ఇప్పటికే ఒక రాజకీయపార్టీ రిజిస్టర్‌ అయినట్టు తెలియడంతో ప్రత్యామ్నాయ పేర్లపై చర్చలు జరుగుతున్నాయి. మరో పక్క తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) పేరును ఎవరు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారో ఆరా తీస్తున్నారు.

చాలాకాలం క్రితమే ఈ పేరును రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టుగా తేలడంతో, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తి నుంచి ఈ పేరును తీసుకోవడం సాధ్యమేనా అనే కోణంలోనూ జేఏసీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. తెలంగాణ జేఏసీ పేరుకు సామీప్యత ఉండేవిధంగా, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండే పేరుకోసం చర్చలు జరుపుతున్నారు. ఈ నెలాఖరులోగా పేరుపై స్పష్టత వస్తుందని జేఏసీ నేతలు వెల్లడించారు. ఇదిలా ఉండగా రైతుల సమస్యలపై ఈ నెలలో పలు పోరాట కార్యక్రమాలను నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.

ఈ కార్యాచరణకు సమాంతరంగా రాజకీయ కార్యకలాపాలను, అంతర్గత వ్యవహారాలను పూర్తి చేసుకునే దిశలో పనిచేస్తున్నారు. వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యల నివారణకోసం ఈ నెల రెండోవారంలో జేఏసీ ముఖ్యులు సమావేశం కానున్నారు. ఈ సమావేశం ముగిసిన మరునాడే జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం, విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీ నమోదుకు సంబంధించిన ప్రక్రియపై స్పష్టత వస్తుందని జేఏసీ నేతలు చెబుతున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement