‘ఇందిరమ్మ’లో అవినీతి బహిర్గతం | indiramma housing Construction in Heavy corruption | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’లో అవినీతి బహిర్గతం

Jan 6 2015 5:00 AM | Updated on Sep 2 2017 7:15 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగినట్లు సీబీసీఐడీ విచారణలో తెలిసింది.

ఖమ్మం వైరారోడ్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగినట్లు సీబీసీఐడీ  విచారణలో తెలిసింది. ఈ అక్రమాల్లో 177 మంది భాగస్వామ్యం ఉందని విచారణలో నిర్ధారణయింది. గృహనిర్మాణ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు అవినీతిలో భాగస్వాములైనట్లు తెలిసింది. ఇందులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు తేలింది. ఇందిరమ్మ పథకం కింద జిల్లాకు మూడు దశల్లో 4.10 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి.

వీటిలో ఇప్పటి వరకు 2.80 లక్షల ఇళ్లు పూర్తి కాగా, మరో 64 వేల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. మంజూరైన ఇళ్లలో చాలా వరకు నిధులు దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం గుర్తించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. మొత్తంగా రూ.14 కోట్లు స్వాహా అయినట్లు గృహ నిర్మాణశాఖ అధికారుల విచారణలోనే తేలింది. జిల్లాలో 2004 నుంచి 2014 వరకు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో బోగస్ లబ్ధిదారులతోపాటు అసలు ఇళ్లే నిర్మించకుండా నిధులు స్వాహా చేసిన వారిని కనుగొనేందుకు  సీబీసీఐడీ బృందం నియోజకవర్గాల వారీగా విచారణ చేపట్టింది.
 
మూడు నెలల పాటు విచారణ...
ప్రభుత్వ ఆదేశాలతో సీబీసీఐడీ డీఎస్పీ బాలుజాదవ్ తన బృందంతో గత ఏడాది ఆగస్టు 8న జిల్లాలో విచారణ ప్రారంభించారు. తొలుత జిల్లా గృహ నిర్మాణ కార్యాలయంలో సంబంధిత ఫైళ్లను పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా అధికారులను ప్రశ్నించారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో కూడా విచారణ చేపట్టారు.

పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం, కూసుమంచి మండ లం లోక్యాతండా, నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పట్వారిగూడెం, ముల్కలపల్లి మండలం కూసుగూడెంలో విచారణ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు నిర్మించిన గృహాలు, నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల వివరాలను పరిశీలించి ఉన్నతాధికారులకు గత నవంబర్‌లో నివేదిక అందజేశారు.
 
అవినీతిలో 177 మంది హస్తం!
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో విచారణ చేపట్టిన సీబీసీఐడీ బృందం 177 మందికి అవినీతిలో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించిందని ఆ శాఖ  ఉన్నతాధికారి ద్వారా తెలిసింది. మూడు నెలల పాటు సాగిన విచారణలో దీనికి సంబంధించిన వారిని గుర్తించి నివేదికలో పొందుపరిచారు. దీనిలో గృహ నిర్మాణ శాఖకు చెందిన వారు 37 మంది ఉన్నట్లు తెలిసింది. ఈ జాబితాలో వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, ఏఈలు, డీఈలు, ఈఈలు ఉన్నట్లు సమాచారం.

రాజకీయ నాయకులు 8 మంది, మహిళా సమాఖ్యకు చెందిన వారు 15 మంది, అలాగే ఒక ఆర్‌డీఓ,  ఇద్దరు ఎమ్మార్వోలు, ఒక ఎంపీడీవో, ముగ్గురు మద్యవర్తులు, 110 మంది లబ్ధిదారులు అవినీతిలో పాలుపంచుకున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ చేసిన అధికారులు నవంబర్‌లో నివేదికను సీబీసీఐడీ డీజీకి అందజేశారు.
 
త్వరలో దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎక్కడ అరెస్ట్‌లకు ఆదేశిస్తుందోనని అవినీతిపరుల్లో వణుకు మొదలైంది. సస్పెండ్ అయ్యి విధుల్లో చేరిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆదేశాలు రాగానే అరెస్ట్‌ల పర్వం మొదలవుతుందని ఆ శాఖ అధికారులు ద్వారా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement