breaking news
indiramma housing Construction
-
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి
* రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్ * హైకోర్టును ఆశ్రయించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వాల హయాంలో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మొదట పూర్తి చేసి, ఆ తరువాతనే తాజాగా ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత 4.67 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయని పద్మనాభరెడ్డి తన పిటిషన్లో వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అక్రమాలు నిజమేనని నిర్ధారిస్తూ 1150 మంది అక్రమాలకు పాల్పడ్డారని, అందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారని తెలిపారన్నారు. ఈ వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల పనులను కొనసాగించేందుకు బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించలేదని పద్మనాభరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఇళ్ల కోసం లబ్ధిదారులు తమ వాటా కింద ఇప్పటికే రూ.1000 కోట్లు ఖర్చు చేశారని, నిర్మాణం ఆగిపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి, అక్రమార్కులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. -
‘ఇందిరమ్మ’లో అవినీతి బహిర్గతం
ఖమ్మం వైరారోడ్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగినట్లు సీబీసీఐడీ విచారణలో తెలిసింది. ఈ అక్రమాల్లో 177 మంది భాగస్వామ్యం ఉందని విచారణలో నిర్ధారణయింది. గృహనిర్మాణ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు అవినీతిలో భాగస్వాములైనట్లు తెలిసింది. ఇందులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు తేలింది. ఇందిరమ్మ పథకం కింద జిల్లాకు మూడు దశల్లో 4.10 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 2.80 లక్షల ఇళ్లు పూర్తి కాగా, మరో 64 వేల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. మంజూరైన ఇళ్లలో చాలా వరకు నిధులు దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం గుర్తించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. మొత్తంగా రూ.14 కోట్లు స్వాహా అయినట్లు గృహ నిర్మాణశాఖ అధికారుల విచారణలోనే తేలింది. జిల్లాలో 2004 నుంచి 2014 వరకు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో బోగస్ లబ్ధిదారులతోపాటు అసలు ఇళ్లే నిర్మించకుండా నిధులు స్వాహా చేసిన వారిని కనుగొనేందుకు సీబీసీఐడీ బృందం నియోజకవర్గాల వారీగా విచారణ చేపట్టింది. మూడు నెలల పాటు విచారణ... ప్రభుత్వ ఆదేశాలతో సీబీసీఐడీ డీఎస్పీ బాలుజాదవ్ తన బృందంతో గత ఏడాది ఆగస్టు 8న జిల్లాలో విచారణ ప్రారంభించారు. తొలుత జిల్లా గృహ నిర్మాణ కార్యాలయంలో సంబంధిత ఫైళ్లను పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా అధికారులను ప్రశ్నించారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో కూడా విచారణ చేపట్టారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం, కూసుమంచి మండ లం లోక్యాతండా, నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పట్వారిగూడెం, ముల్కలపల్లి మండలం కూసుగూడెంలో విచారణ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు నిర్మించిన గృహాలు, నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల వివరాలను పరిశీలించి ఉన్నతాధికారులకు గత నవంబర్‌లో నివేదిక అందజేశారు. అవినీతిలో 177 మంది హస్తం! ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో విచారణ చేపట్టిన సీబీసీఐడీ బృందం 177 మందికి అవినీతిలో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించిందని ఆ శాఖ ఉన్నతాధికారి ద్వారా తెలిసింది. మూడు నెలల పాటు సాగిన విచారణలో దీనికి సంబంధించిన వారిని గుర్తించి నివేదికలో పొందుపరిచారు. దీనిలో గృహ నిర్మాణ శాఖకు చెందిన వారు 37 మంది ఉన్నట్లు తెలిసింది. ఈ జాబితాలో వర్క్ఇన్స్పెక్టర్లు, ఏఈలు, డీఈలు, ఈఈలు ఉన్నట్లు సమాచారం. రాజకీయ నాయకులు 8 మంది, మహిళా సమాఖ్యకు చెందిన వారు 15 మంది, అలాగే ఒక ఆర్డీఓ, ఇద్దరు ఎమ్మార్వోలు, ఒక ఎంపీడీవో, ముగ్గురు మద్యవర్తులు, 110 మంది లబ్ధిదారులు అవినీతిలో పాలుపంచుకున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ చేసిన అధికారులు నవంబర్‌లో నివేదికను సీబీసీఐడీ డీజీకి అందజేశారు. త్వరలో దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎక్కడ అరెస్ట్‌లకు ఆదేశిస్తుందోనని అవినీతిపరుల్లో వణుకు మొదలైంది. సస్పెండ్ అయ్యి విధుల్లో చేరిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆదేశాలు రాగానే అరెస్ట్‌ల పర్వం మొదలవుతుందని ఆ శాఖ అధికారులు ద్వారా తెలిసింది.