
ఆన్‌లైన్‌లో ఫార్మసిస్టుల లెసైన్స్‌లు
ఫార్మసిస్టులు లెసైన్స్‌ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నామని
హైదరాబాద్ : ఫార్మసిస్టులు లెసైన్స్‌ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి చెప్పారు. స్థానిక ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నూతన వెబ్‌సైట్‌ను, సేల్స్ లెసైన్స్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకూ ఫార్మసిస్టులు మందులషాపు తదితర వ్యాపారాల నిర్వహణ అనుమతి కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, ఇకపై వారు ఎలాంటి కష్టాలూ పడకుండా అనుమతి ప్రక్రియను సులభతరం చేస్తున్నామని చెప్పారు.
ఫార్మసిస్టులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా డ్రగ్స్ కార్యాలయానికి పంపొచ్చని, వారి దరఖాస్తులను పరిశీలించి అనుమతి రాగానే ఆన్‌లైన్ ద్వారానే తెలియజేస్తామని చెప్పారు. అనుమతి వచ్చిన తర్వాత లెసైన్స్ పొందడానికి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుందని, వాటి పరిశీలన అనంతరం అధికారులు లెసైన్స్ మంజూరు చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ కంట్రోల్ బోర్డు డెరైక్టర్ అకున్ సబర్వాల్, డిప్యూటీ డెరైక్టర్ అమృతరావు, పలువురు అసిస్టెంట్ డెరైక్టర్లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.