
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు దాడులు జరిపారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 809 మెడికల్ షాపులు,అనధికార వైద్యులకు సంబంధించిన ఆస్పత్రులలో డీసీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 234 మెడికల్ షాపుల్లో అబార్షన్ కిట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మైఫెప్రిస్టోన్, మిసోప్రోస్టాల్ వంటి మందులు లైసెన్స్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లుగా పలు ఆధారాల్ని సేకరించారు.
దీంతో సదరు మెడికల్ షాపులను సీజ్ చేస్తూ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరు 234 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 165 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్ చేయడంతోపాటు ఏడు మెడికల్ షాపుల లైసెన్సులు పూర్తిగా రద్దు చేశారు.
అక్రమంగా అబార్షన్ కిట్లు మహిళలకు ప్రమాదం. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దాడులు కొనసాగుతాయి అధికారులు తెలిపారు. అనధికార మెడికల్ షాపుల వద్ద అబార్షన్ కిట్లు, మందులు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి హానికరం. ప్రజలు నిబంధనల ప్రకారం మాత్రమే మందులు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.