
వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారమయ్యే పుకార్లకు వాటి అడ్మిన్లు బాధ్యత వహించాల్సి వస్తుందని పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారమయ్యే పుకార్లకు వాటి అడ్మిన్లు బాధ్యత వహించాల్సి వస్తుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న (మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ... ఏదైనా వీడియో క్లిప్పింగ్‌ను ఫార్వర్డ్ చేసే ముందు పక్కాగా సరిచూసుకోవాలని సూచించారు. ఇటీవల మార్ఫింగ్ చేసిన, ఎక్కడెక్కడిలో కలిపి జోడించిన వీడియోలు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయన్న ఆయన ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతి గ్రూప్ అడ్మిన్ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అలా కాకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
నగర షీ–టీమ్స్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కోఠి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్, శుక్రవారం చార్మినార్ వద్ద నిర్వహిస్తున్న రన్స్‌కు హోంమంత్రి మహమూద్ అలీ అతిథులుగా హాజరవుతున్నారని అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పెట్రోలింగ్ వాహనాల వద్ద కేసులు నమోదు విధానం ప్రారంభించామని, ఇప్పటి వరకు 156 ఎఫ్‌ఐఆర్‌లు, 893 పెట్టీ కేసులు రిజిస్టర్ అయినట్లు కొత్వాల్ వివరించారు. అలాగే నగరంలో వృద్థులకు ఆసరాగా ఉండటానికి పోలీసుస్టేషన్ల వారీగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడుతున్నామని, త్వరలోనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. (హాయ్.. నేను విజయ్ దేవరకొండ అంటూ..)