వైరల్‌ ఫోటో : ‘అమ్మ పరీక్షకెళ్లిందిగా నే ఆడించనా’

Hyderabad Cop Console A Baby While Her Mother Went For Constable Exam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పోలీస్‌లనగానే దురుసుగా మాట్లాడుతూ.. జనాలను హడలేత్తిస్తుంటారనే అభిప్రాయం మనలో చాలా మందికి ఉంది. కానీ వారు అందరిలాంటి వారేనని, విధి నిర్వహణలో భాగంగా అలా ప్రవర్తిస్తుంటారనే విషయం మర్చిపోతుంటాము. ఖాకీల కరుణ హృదయానికి అద్దం పట్టే ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నిన్న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌లో ఓ మహిళ తన నాలుగు నెలల చిన్నారితో కలిసి పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుంది.

అయితే పరీక్ష హాల్‌లోకి అభ్యర్థిని తప్ప ఎవరిని అనుమతించరు. దాంతో ఎగ్జామ్‌ రాసి వచ్చేంతవరకూ తన చిన్నారిని చూసుకోవడం కోసం తన బంధువుల అమ్మాయిని వెంట తీసుకొచ్చింది. పరీక్ష ప్రారంభం కావడంతో సదరు మహిళ తన చిన్నారిని వెంట వచ్చిన మనిషి దగ్గర వదిలి లోపలికి వెళ్లింది. కానీ తల్లి అలా వెళ్లిన క్షణం నుంచి ఆ పాప గుక్కపెట్టి ఏడవడం ప్రారంభించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏడుపు ఆపడం లేదు.

ఈ క్రమంలో పరీక్ష కేంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మన్‌ ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుని సముదాయించడానికి ప్రయత్నించాడు. తాను పోలీస్‌ ఉద్యోగిననే గర్వం ఏమాత్రం లేకుండా చిన్నారిని ఆడిస్తున్న ముజీబ్‌ ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’కు అసలైన ఉదాహరణగా నిలిచారు. చిన్నారిని ఆడిస్తున్న ముజీబ్‌ ఫోటోను రమా రాజేశ్వరి అనే ఐపీఎస్‌ అధికారి తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. దాంతో పాటు #HumanFaceOfCops అనే హాష్‌ ట్యాగ్‌ను జత చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో నెటిజన్ల అభినందనలు అందుకుంటుంది. ముజీబ్‌ కూకట్‌పల్లి మూసాపేట పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top