గద్వాల చీరలకు చెదరని ఆదరణ!

Hundred Years History Of  Narayanapeta Weaving Work In Mahabubnagar - Sakshi

మన్నికైన వస్త్రాలతో ఒకప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత చేనేత వృత్తిది.. ఆ కళాకారులది. చేనేత కార్మికులు నైపుణ్యంతో దేశీయ వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, రాజోళి, నారాయణపేట చీరల పేర్లు వింటేనే నాజూకు వస్త్రాలు గుర్తుకువస్తాయి. ఇక్కడి చేనేత కార్మికుల చేతిలో అద్భుతమైన చీరలు తయారవుతున్నాయి. సాధారణ నూలుతోనే ఆకర్షించే చీరలు నేస్తూ..విభిన్నమైన చీరలు రూపుదిద్దడంలో తమకు తామే సాటని చాటుతున్నారు. మగ్గాలపై తమలోని తృష్ణను బయటకు తీసి, చీరలపై అందమైన డిజైన్లుగా మారుస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

సాక్షి, మహబూబ్‌నగర్‌(నారాయణపేట) :  పల్లె నుంచి పట్నం వరకు అడిగిమరి కొనే చీరల్లో నారాయణపేట పట్టు ఒకటి. ఇక్కడి చేనేతకు వందేళ్ల చరిత్ర ఉంది. అంతటి మన్నికైన.. అపురూపమైన డిజైన్ల చీరలను తయారు చేయడం ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభ. పేట చీరల చీరల తయారీకి పట్టణంతో పాటు జాజాపూర్, కోటకొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు ఉన్నారు. 1900 సంవత్సరం నుంచే ఇక్కడ పట్టుచీరలు తయారుచేస్తున్నట్లు చరిత్ర చెప్తుంది. మగ్గాలపై చీరలు నేస్తూ ఎంతో గుర్తింపు సంపాదించిన నారాయణపేట కార్మికులు నాలుగు సంవత్సరాల క్రితం జియోగ్రాఫికల్‌ నుంచి పెటెంట్‌హక్కును సాధించుకున్నారు.

అగ్టిపెట్టెలో పట్టెంత చీరను నేసి రికార్డు
నారాయణపేట పట్టుచీరలు దేశ, విదేశాల్లో సైతం ఖ్యాతిని సంపాదించుకున్నాయి. పెద్ద, పెద్ద పట్టణాల్లో సైతం ఎంతో ఆదరణ ఉంది. మారుతున్న డిజైన్లు, ఫ్యాషన్‌కు అనుగుణంగా చీరలు నేయడం ఇక్కడి ప్రత్యేకత. అగ్గిపెట్టెలో పట్టెంత చీరను నేసి రికార్డు సృష్టించిన చరిత్ర ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి సైతం ఈ చీరలు కట్టుకుందంటే ఎంతటి గుర్తింపు దక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి చీరలు తీసుకోవడం పరిపాటి.

పట్టులో రకాలు 
పట్టు చీరల్లో పలు రకాలు అందుబాటులో ఉన్నాయి. టెంపల్‌ గర్భరేషన్, నిఖల్, పారాస్, పైటీనియా, సైటనీ, నీవాళి దనవతి, శివశంభు, నివాళి శివశంలలో కడ్డి మరియూ ప్లేన్‌ రకాలతో పాటు స్పెషల్‌ బార్డర్‌ వంటివి ప్రత్యేక ఆకర్శణగా ఉంటాయి. వీటికి తోడు కొత్తగా వస్తున్న మాడల్స్‌కు అనుగుణంగా తయారుచేస్తున్నారు. అర్డర్లు ఇచ్చి మరి తయారు చేయించుకోవడం జరుగుతుంది. మార్కెట్‌లో ముడిసరుకుల ధరలు పెరగడంతో చీరల ధరలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కో చీర నేయడానికి రెండు నుంచి మూడు రోజలు సమయం పడుతుంది.

గల్లి నుంచి ఢిల్లీ వరకు విక్రయాలు
‘పేట’ నేత కార్మికుల కుటుంబాలు తయారు చేసిన పట్టు చీరలు ఢిల్లీ వరకు అమ్మకానికి వెళ్తుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా హైద్రాబాద్, వరంగల్, పూణె, ముంబాయి, సాంగ్లీ, షోలాపూర్, ఔరంగాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, రాయిచూర్, గుల్బర్గ, యాద్గీర్, బెంగుళూర్, విజయవాడ, విషాఖపట్నం దుకాణాల్లో ప్రత్యేకంగా అమ్ముతుంటారు. డిల్లీలో సైతం ‘పేట’ పట్టు చీరలు దొరకడం విశేషం. పెళ్లిలు, శుభకార్యాలకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తుంటారు. 

గద్వాల టౌన్‌: సంస్థానాధీశుల కాలం నుంచి నేటి తరం ఆధునిక మహిళల మనస్సును కట్టిపడేసే డిజైన్లను అద్దుకున్న గద్వాల చీర నేడు దేశ, విదేశీ వనితల ఆదరణ పొందుతూ తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. కాటన్‌ చీరకు జరీ అంచుతో డిజైన్‌ చేయబడిన నాటి తరం సంప్రదాయాన్ని కొనసాగిస్తునే నేటి అదునిక అవసరాలకు అనుగుణంగా సీకో(కాటన్, సిల్క్‌)లను కలిపి దారంతో సరికొత్త డిజైన్లతో మహిళలను మనస్సుకు నచ్చేలా గద్వాల ప్రాంత చేనేత కార్మికులు చీరల నేతలను కొనసాగిస్తున్నారు. గద్వాల సంస్థానం ఏర్పడిన నాలుగు వందల ఏళ్ల నాటి నుంచి గద్వాల చీరకు ప్రత్యేక కాలగుణంగా ప్రత్యేకత ఉండేలా చేనేతకు ప్రాణం పోస్తున్నారు. ఆదునిక సాంకేతకను జోడిస్తూ గద్వాల చీర ప్రత్యేకతను నిలబెట్టుకునేలా ఇక్కడి చేనేత వృత్తిని సగర్వంగా కాలంతో వస్తున్న పోటీలో నిలుస్తున్నారు.

చీరల తయారీలో మాస్టర్‌ వీవర్స్, వీవర్స్‌ తమ వృత్తిలో నిల్చునేలా, గద్వాల చీరకు ప్రత్యేకత, గుర్తింపు, మహిళల ఆదరణ ఉండేలా ఎవరికి వారు పోటీ పడుతున్నారు. సంస్థానాధీశుల కాలంలో చేనేత కార్మికులు తమ చేనేత కళ ప్రతిభతో అగ్గిపెట్టెలో చీర ఇమిడేలా తయారు చేసేవారు. ఆ నాటి నుంచి తిరుమల శ్రీనివాసుడికి ఏటా జరిగే దసర బ్రహ్మోత్సవాలలో గద్వాలలో నిష్టగా తయారు చేసిన ఎరవాడ పంచెలను ధరింప చేస్తున్నారు. అంతటి ప్రత్యేక గద్వాల చీరలకు, చేనేత ప్రతిభకు ఉంది. 

రూ.1200 నుంచి రూ.40వేల విలువ వరకు...
కాటన్‌ చీరకు అంచు, కొంగు బార్డర్‌లో గద్వాల వారసత్యంగా వస్తున్న డిజైన్లతో పాటు, నేటి ఆదునిక డిజైన్లను నేస్తున్నారు. జరీలో వెండి, రాగి, బంగారుతో తయారైన జరీ పోగులను బార్డర్, కొంగు, చీర మద్యలో డిజైన్, బుట్టాలకు తమ ప్రతిభతో అందాలను అద్దుతున్నారు. గద్వాల చీర రూ.12 వందల నుంచి రూ.40 వేల విలువ వరకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. అంతకు మించి డిజైన్‌ను మరింత ఖరీదుతో చేయాలంటే ముందస్తు ఆర్డర్‌ను ఇవ్వాల్సింటుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top