ఎన్నికల ఎఫెక్ట్‌: భారీగా నగదు, మద్యం పట్టివేత

Huge Amounts Of Cash And Liquor Seized During Telangana Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలింగ్‌కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడానికి చివరి ప్రయత్నం చేస్తున్నారు. వారిని వలలో వేసుకోవడానికి నగదు, మద్యం పంచుతున్నారు. దీంతో నిఘా పెంచిన పోలీసులు, ఎన్నికల అధికారలు దాడులు ముమ్మరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల నగదును తరలిస్తూ పట్టుబడ్డ వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.  

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రూ.3.13 కోట్ల నగదు, రూ.60 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో పోలీసులు తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదు బీఎస్పీ అభ్యర్థికి సంబంధించిందని పోలీసులు గుర్తించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసుల రాకను గుర్తించి రూ.4 లక్షల నగదును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదును తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

ఖమ్మం త్రీటౌన్‌ అభిరామ్‌ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. డోర్నకల్‌ కూటమికి చెందిన అభ్యర్థి అనుచరుల నుంచి  రూ.26 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీబీనగర్‌లో ప్రత్యేక ఎన్నికల అధికారులు, పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. అధికారలు సోదాల్లో రూ. 2,81,000 నగదు, పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఉప్పల్‌ రామంతాపూర్‌లో టీడీపీ కార్యాలయంపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, పోలీసులు దాడులు జరిపారు. అధికారుల సోదాల్లో భారీగా నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top