విద్యాశాఖలో గందరగోళం !

Govt Teachers Naglency In Warangal - Sakshi

కాళోజీ సెంటర్‌: లక్షలాది మంది విద్యార్థులు.. వేలాది మంది ఉపాధ్యాయులు... తల్లిదండ్రుల అశలతో ముడిపడి ఉన్న విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాలలను పర్యవేక్షించాల్సిన అధికారులు శాఖను పట్టించుకోకపోవడంతో పాఠశాలల పర్యవేక్షణ పడకేసింది. దీంతో విద్యాబోధనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వచ్చేది పరీక్షల కాలం. అందుకు అనుగుణంగా పరీక్షలకు విద్యార్థులు, ఉపాధ్యాయులను సమయత్తం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను చూస్తే అధికారులు ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు కనపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

డీఈఓగా బాధ్యతలు చేపట్టిన కంకటి నారాయణరెడ్డి మొదట్లో విద్యాశాఖపై దృష్టి పెట్టినప్పటికీ అదనపు బాధ్యతలతో అసలు బాధ్యతలు మరిచిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సైతం సంతకాల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. డీఈఓ తన కార్యాలయానికి చుట్టపు చూపుగా రావడంతో కొందరు  సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఉపాధ్యాయు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జిల్లా  విద్యాశాఖ అధికారి వ్యవహర శైలిలో వచ్చిన మార్పులపై విద్యాశాఖలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

నెలల తరబడి ఫైళ్ల పెండింగ్‌...
విద్యాశాఖ కార్యాలయం పైళ్లు నెలల తరబడి పెండింగ్‌ ఉంటున్నాయి. అధికారుల ఫోన్‌ బిల్లులకు సంబంధించిన ఫైళ్లపై కూడా డీఈఓ సంతకాలు చేయకపోవడంతో మూడు నెలలుగా అధికారిక ఫోన్లు మూగబోయాయి. దీంతోపాటు కేజీబీవీ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉపాధ్యాయుల సర్వీస్‌ సంబంధ విషయాలకు సంబంధించిన ఫైళ్లు కూడా నెలల తరబడి కార్యాలయంలో మూలుగుతున్నాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివిధ పనులపై డీఈఓ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నా స్పందన ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అందుబాటులో ఉండని డీఈఓ.. 
అనేక పనులపై జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలకు డీఈఓ అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్‌ చేసినా స్పందన ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం కొంతమంది ఫోన్‌లు మాత్రమే డీఈఓ ఎత్తుతారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలా మంది డీఈఓ  కార్యాలయంలో దొరకరు... ఫోన్‌లో పలకరు అనే ఫిక్స్‌ అయ్యారు. సమస్యలను పరిష్కరించే అధికారుల పనితీరు ఇలా ఉంటే ఇంకా కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఎలా పనిచేస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 

ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు డీఈఓ నారాయణరెడ్డికి ప్రభుత్వం వరంగల్‌ అర్బన్‌ జిల్లా డీఈఓగా, డైట్‌ ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన ప్రస్తుతం మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో డీఈఓ ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. సిబ్బంది ఫైళ్లు పట్టుకుని అర్బన్‌ డీఈఓ కార్యాలయం, డైట్‌ కళాశాల చుట్టూ తిరగడంతో సందర్శకులకు కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి.

కలెక్టర్‌కు జీసీడీఓ ఫిర్యాదు..

అధికారిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడంతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రాష్ట్ర అధికారులు డీఈఓ నారాయణరెడ్డికి ఇటీవల చివాట్లు పెట్టారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన జీసీడీఓ సంధ్యారాణిని అకారణంగా టార్గెట్‌ చేసి ఇష్టం వచ్చినట్లు దూషించడంతో ఆమె ఆవేదనకు గురై కలెక్టర్‌ హరితకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు కార్యాలయంలో జరుగుతున్న తంతును కలెక్టర్‌కు వివరించారు. జీసీడీఓ  ఫిర్యాదు తర్వాత కొందరు మహిళా హెచ్‌ఎంలు డీఈఓతో వారికి జరిగిన చేదు అనుభవాలను కొంతమందితో పంచుకున్నట్లు సమాచారం. త్వరలోనే వారంతా కలెక్టర్‌కు కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

సమస్యలను చక్కదిద్దాల్సిన డీఈఓ సమస్యలను సృష్టించడంపై  ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డీఈఓ మాత్రం పదేపదే తనకు మంత్రి అండదండలు ఉన్నాయని, తనను ఎవ్వరు ఏమి చేయారని సిబ్బందితో గర్వంగా చెప్పుకోవడం మరో విశేషం. దీంతోపాటు తనకు అనుకూలంగా ఉన్న కొందరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ల పేరిట వారికి నచ్చిన దగ్గర కొలువు చేసుకునే అవకాశం కల్పించారని, దీనిపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు కొన్ని సంఘాల నేతలు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. డీఈఓ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది నిజమే.. 
హైదరాబాద్‌లో జరిగే మీటింగ్‌కు హాజరుకావడానకి డీఈఓ రిలీవ్‌ ఆర్డర్‌ ఇవ్వలేదు. కాబట్టి వెళ్లలేక పోయాను.రిలీవ్‌ ఆర్డర్‌ సెక్షన్‌ సిబ్బంది తయారు చేయాలంటే డీఈఓ ఆదేశాలివ్వాల్సి ఉంటుంది. కానీ ఆయన  ఇవ్వలేదు. అందువల్లే మీటింగ్‌కు వెళ్లలేకపోయా. దీనిమీద హెడ్‌ ఆఫీస్‌ నుంచి డీఈఓకు మెమో జారీ చేశారు.  దీంతో కిందిస్థాయి సిబ్బంది ముందు నన్ను ఆయన చులకనగా మాట్లాడారు. కాబట్టి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను. – సంధ్యారాణి, రూరల్‌ జిల్లా జీసీడీఓ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top