ఆసరా పథకం అమలులో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న అవకతవకలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టింది.
సాక్షి కథనానికి స్పందించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకం అమలులో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న అవకతవకలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల ఖమ్మం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో నిర్వహించిన సామాజిక తనిఖీలో లక్షలాది రూపాయల ‘ఆసరా’ సొమ్ము అక్రమార్కుల పాలైనట్లు వెల్లడైంది. ఈ విషయమై సోమవారం ‘ఆసరా.. అక్రమార్కుల పరం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సర్కారులో కదలిక తీసుకువచ్చింది. తక్షణం అన్ని జిల్లాల్లో(పట్టణ, నగర ప్రాంతాలు సహా) సామాజిక తనిఖీలు నిర్వహించి ఆసరా పథకం అమల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించింది.
ఈ మేరకు ఆసరా పింఛన్ల మంజూరు బాధ్యతలను నిర్వహిస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో మురళి సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ(శాట్) డెరైక్టర్‌కు సోమవారం లేఖ రాశారు. ‘ఆసరా’ పింఛన్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని, పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే సామాజిక తనిఖీ నిర్వహించాలని సోషల్ ఆడిట్ విభాగం డెరైక్టర్‌ను కోరారు. దీంతో మంగళవారం నుంచే సామాజిక తనిఖీ నిర్వహించేందుకు శాట్ సన్నద్ధమైంది.