మాదారి బాటసారి | GHMC Officers Removing Illegal Occupied On Footpaths In Hyderabad | Sakshi
Sakshi News home page

Jul 1 2018 6:54 AM | Updated on Oct 5 2018 8:51 PM

GHMC Officers Removing Illegal Occupied On Footpaths In Hyderabad - Sakshi

కోఠి ఇసామియా బజార్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది

సాక్షి, సిటీబ్యూరో : ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణల తొలగింపునకు మూడు రోజుల స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. తొలిరోజు శనివారం 1024 ఆక్రమణలను కూల్చివేశారు. నడక మార్గాలు లేకుండా విస్తరించిన దుకాణాలను ప్రత్యేక ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లతో   కూల్చివేయడంపై పలు ప్రాంతాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఎంపిక చేసిన 48 మార్గాల్లో 127.5 కి.మీ. పరిధిలో 4133 ఆక్రమణలు గుర్తించిన అధికారులు.. వాటిని తొలగించేందుకు ఆరు బృందాలు రంగంలోకి దిగాయి. వీరిలో జీహెచ్‌ంఎసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, యూసీడీ విభాగాలతో పాటు ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగాల పోలీసు అధికారులు కూడా ఉన్నారు.
తొలిదశలో శాశ్వత నిర్మాణాలపై దృష్టి.. 
ప్రధాన రహదారుల ఫుట్‌పాత్‌లపై పాదచారులకు దారి లేకుండా బడాబాబులు జబర్దస్తీగా చేపట్టిన శాశ్వత నిర్మాణాలను కూల్చివేశారు. పేదలు ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక దుకాణాల జోలికి వెళ్లలేదు. నగరంలోని ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలు తొలగించాలని హైకోర్టు పలు మార్లు జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీచేసిందని, జీహెచ్‌ఎంసీ చట్టం 504 సెక్షన్‌ మేరకు మూడు రోజుల  స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టామని కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు.  
స్ట్రీట్‌ వెండర్స్‌ పాలసీ అమలు..  
కేంద్ర ప్రభుత్వ స్ట్రీట్‌ వెండర్స్‌ పాలసీ మేరకు నగరంలో ఇప్పటికే 24,580 మంది వ్యాపారులను గుర్తించి, వారిలో 22,324 మందికి గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. నగరంలో మొత్తం 135 వెండింగ్‌ జోన్లను తమ యూసీడీ విభాగం గుర్తించిందని, వీటిలో 24 జోన్లను నో వెండింగ్‌ జోన్లుగా గుర్తించారన్నారు. 77 జోన్లను ఫ్రీ వెండింగ్‌ జోన్లుగా, మరో 34 జోన్లను పాక్షిక విక్రయ జోన్లుగా ప్రకటించామన్నారు. చిరు వ్యాపారుల ఉపాధికి ఇబ్బంది లేకుండా ఈ వెండింగ్‌ జోన్లు ఉపకరస్తాయన్నారు.  
సానుకూల స్పందన: విశ్వజిత్‌ 
నగరంలో చేపట్టిన ఫుట్‌ఫాత్‌లపై ఆక్రమణల తొలగింపునకు నగర ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ తెలిపారు. స్వల్ప ఘటనలు మినహా కూల్చివేతలు ప్రశాంతంగా జరిగాయన్నారు. జీహెచ్‌ఎంసీ ఈ స్పెషల్‌ డ్రైవ్‌ను అభినందిస్తూ సోషల్‌ మీడియాలో పలువురు పోస్టింగ్‌లు చేశారన్నారు. చార్మినార్‌ పాదచారుల పథకంలో భాగంగా అక్కడి నుంచి తొలగించిన చిరువ్యాపారులకు సాలార్జంగ్‌ మ్యూజియం ఎదుట నిర్మించనున్న ఐకానిక్‌ బ్రిడ్జిపై ప్రత్యామ్నాయం చూపుతున్నట్లుగా ఇతర ప్రాంతాల్లోని వారికీ సమీప ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపాలని పలువురు సూచించారు.  
ఆరంభ శూరత్వం కారాదు.. 
జీహెచ్‌ఎంసీ చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌కు సానుకూలంగా స్పందించిన నగర పౌరులు.. ఇది కేవలం ఆరంభ శూరత్వం కారాదని, అన్ని ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించి ప్రజలు నడిచేందుకు అవకాశం కల్పించాలన్నారు. కొన్ని సర్కిళ్ల పరిధిలో కూల్చివేతలు ప్రారంభించకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ వారు ఎలాంటి తారతమ్యం లేకుండా చూడాలన్నారు. గతంలో మాదిరిగా కొన్ని రోజులు.. కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయరాదనే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన కొన్ని ఫుట్‌ఫాత్‌లను బడా వ్యాపారులు తమ అవసరాలకు వినియోగిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ, అలాంటివాటినన్నింటినీ తొలగించాలనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement