దగాపై కన్నెర్ర

దగాపై కన్నెర్ర - Sakshi


- నాసిరకం వరి విత్తనాలను

- అంటగట్టారంటూ రైతన్న ఆగ్రహం

- ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ఆందోళన

- పట్నం చౌరస్తాలో రాస్తారోకో..

- విత్తనాలను తగులబెట్టి నిరసన


ఇబ్రహీంపట్నం రూరల్: అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టితో ప్రకృతి వికటాట్టహాసం చేస్తుండడంతో ఇప్పటికే పుట్టెడు క ష్టాలతో కాలం నెట్టుకొస్తున్న అన్నదాతను విత్తన వ్యాపారులూ దగా చేస్తున్నారు. నాసిరకం విత్తనాలను అంటగట్టి నిలువునా దోచుకుంటున్నారు. దీంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వ్యాపారుల దగాపై కన్నెర్రజేశారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమాని నాసిరకం విత్తనాలను విక్రయి స్తూ మోసం చేస్తున్నారని రైతులు రాస్తారోకో చేశారు. నాసిరకం విత్తన బ్యాగులను తగులబెట్టారు. పాలకుల నుంచి అధికారుల వరకు అందరూ రైతుల జీవితాలతో ఆడుకునేవారే.. ఒక్కరూ పట్టించుకోరంటూ ఆగ్రహోదగ్రులయ్యారు. వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.



రైతుల కథనం ప్రకారం ఇదీ మోసం..ఇబ్రహీంపట్నంలోని రాఘవేంద్ర ఫర్టిలైజర్ దుకాణంలో పలువురు రైతులు కొన్నాళ్ల క్రితం ఒక్కో వరి విత్తన బస్తాను రూ.750కి కొనుగోలు చేశారు. సాధారణ రకం కాకుండా లక్ష్మీగణపతి, అర్ణపూర్ణ కంపెనీలకు చెందిన బీపీటీ 1010, ఐఈఆర్64, తెల్లహంస విత్తనాలను కొన్నారు. నెలలు గడుస్తున్నా నారు మొలక కూడా రాలేదు. ‘ఇప్పటికే తాము సమస్యలతో సతమతమవుతుంటే సందట్లో సడేమియాలాగా ఫర్టిలైజర్ దుకాణాల వారూ నిండాముంచారు. మొలకెత్తని నాసిరకం విత్తనాలను అంటగడతారా’ అంటూ రైతులు కన్నెరజేశారు.



ఫర్టిలైజర్ షాపులోని నాసిరకం విత్తనాలను రోడ్డుపై పోసి తగులబెట్టారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందేలా కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని సోమవారం ఇక్కడ జరిగిన ఘటనతో స్పష్టమైంది. రైతులు ఎంత మొత్తుకుంటున్నా వ్యాపారులు పెడచెవినబెట్టి.. నాసిరకం విత్తనాలనే విక్రయిస్తున్నారు. రోహిణి కార్తెలో విత్తనాలు వేస్తే సకాలంలో మొలకెత్తి.. నాటు వేయడానికి వీలుంటుందని భావించిన రైతులను నిలువెల్లా మోసం చేస్తున్నారు.

 

మాకేం సంబంధం లేదు..

ఈ విషయంలో ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుల వాదన మరోలా ఉంది. నాసిరకం విత్తనాలతో తమకెటువంటి సంబంధం లేదని.. అది పూర్తిగా ఆయా కంపెనీల తప్పిదమేనని చెబుతున్నారు. వారిచ్చిన విత్తనాలనే తాము విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు మాత్రం ఈ దగాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని.. తమ పొట్టకొట్టిన షాపు నిర్వాహకులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.  

 

విత్తనాలను పరిశీలిస్తాం: కంపెనీ ప్రతినిధులు

విత్తనాల విషయమై రైతులు ఆందోళన చేపట్టడంతో రంగంలోకి దిగిన వ్యవసాయాధికారులు సదరు విత్తన కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. మంగళవారం విత్తనాలను పరిశీలించేందుకు వస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. విత్తనాలు తీసుకున్న రైతులకు తిరిగి డబ్బులను వాపసు ఇస్తామని చెప్పగా.. రైతులు దీనికి ససేమిరా అన్నారు. కార్తె బలం ఉన్నప్పుడే విత్తనాలు వేస్తే ఫలితం ఉంటుందని.. ప్రస్తుతం వేస్తే ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు.



విత్తనాలతోపాటు, ఎరువులు, దున్నడానికి, ఇతరత్రా ఖర్చులు కలుపుకొని సుమారు రూ.4వేలు ఖర్చయ్యిందని.. ఆ డబ్బును ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫర్టిలైజర్ షాపు నిర్వాకంపై వ్యవసాయాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆందోళనలో ఆదర్శ రైతు సంఘం అధ్యక్షుడు ఆకుల ఆనంద్‌కుమార్, ఆదర్శ రైతు యాదయ్యతోపాటు సుమారు 40 మంది రైతులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top