నిరంతర విద్యుత్‌తో నీటి కష్టాలు!

farmers faced problems with continuous electricity in telangana - Sakshi

ఎస్సారెస్పీ ఆయకట్టులో ఎగువన భారీగా నీటి వినియోగం

కాలువలకు మోటార్లు పెట్టి నీటిని లాగేస్తున్న రైతులు

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌తో కొత్త చిక్కు వచ్చి పడింది. శ్రీరాంసాగర్‌ నుంచి విడుదల చేస్తున్న నీరంతా ఆయకట్టు ఎగువనే వినియోగమవుతోంది. నిరంతర విద్యుత్‌ సరఫరాతో.. రైతులు మోటార్ల ద్వారా కాకతీయ కాలువ నుంచి నీటిని తోడేస్తున్నారు. దీనివల్ల ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సమయంలో విద్యుత్‌ సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటిని విడుదల చేసినప్పుడు విద్యుత్‌ సరఫరాను 9 గంటలకు తగ్గించాలని, మిగతా సమయాల్లో నిరంతరాయంగా సరఫరా చేయాలని యోచిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: నిరంతరాయ విద్యుత్‌ సరఫరా కారణంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు చివరి ఆయ కట్టుకు నీటి గోస తలెత్తింది. కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటిని ఎగువ ప్రాంతాల్లోని రైతులు మోటార్లు పెట్టి లాగేస్తుండడంతో దిగువకు నీటి రాక తగ్గిపోయింది. దీనిపై చివరి ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దృష్టి సారించింది. నీటి విడుదల సమయంలో ఎగువ ఆయకట్టు ప్రాంతాల్లో విద్యుత్‌ను తొమ్మిది గంటలకే పరిమితం చేయాలని యోచిస్తోంది.

ఐదున్నర లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రణాళిక
గతేడాది డిసెంబర్‌లో ఎస్సారెస్పీ, లోయర్‌ మానేరు డ్యామ్‌ (ఎల్‌ఎండీ)లలో నీటి నిల్వలకు అనుగుణంగా రబీకి నీరందించే ఆయకట్టును ఖరారు చేశారు. అప్పటికే ఎస్సారెస్పీలో లభ్యతగా ఉన్న 55.16 టీఎంసీలకు తోడు సింగూరు నుంచి మరో 5 టీఎంసీలు విడుదల చేసి.. మొత్తంగా 60.16 టీఎంసీలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో 15 టీఎంసీలను కాకతీయ కాల్వ ద్వారా ఎల్‌ఎండీకి విడుదల చేశారు. మిగతా లభ్యత నీటిలో తాగునీటికి 6.5 టీఎంసీలు పక్కనపెట్టి.. 28.88 టీఎంసీలను ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిన 4 లక్షల ఎకరాలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఎల్‌ఎండీ నీటిలో మిషన్‌ భగీరథకు 6.16 టీఎంసీలు కేటాయించారు. మరో 9.53 టీఎంసీలను డిసెంబర్‌ 15 నుంచి మార్చి 14 వరకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిన 1.6 లక్షల ఎకరాలకు ఇచ్చేలా ప్రణాళిక వేశారు.

నీరంతా ఎగువనే ఖాళీ..
ఎస్సారెస్పీ నుంచి రోజుకు 6 వేల క్యూసెక్కుల మేర నీటిని వదిలితే... కాకతీయ కాల్వ 68వ కిలోమీటర్‌ వద్ద ఉన్న తాళ్లపేట, మేడిపల్లి ప్రాంతానికి వచ్చేసరికే 2 వేల క్యూసెక్కులకు తగ్గిపోతోంది. అక్కడి నుంచి దిగువన 116వ కిలోమీటర్‌ వరకు వెయ్యి క్యూసెక్కుల నీరు కూడా రావడంలేదు. ఇదేమిటని అధికారులు పరిశీలించగా.. రైతులు మోటార్లు పెట్టి కాల్వ నుంచి నీటిని తోడుకుంటున్నట్లు గుర్తించారు. ఎస్సారెస్పీ నుంచి 68వ కిలోమీటర్‌ వరకు ఏకంగా 2,600 మోటార్లు ఉండగా.. దిగువన మరో 700 మోటార్లు ఉన్నట్లు తేల్చారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా ఉండడంతో రైతులు భారీగా నీటిని తోడేస్తున్నారని, దీంతో దిగువకు నీటి రాక తగ్గిపోతోందని గుర్తించారు. రోజూ ఈ మోటార్ల ద్వారా సుమారు 800 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నట్లు అంచనా వేశారు.

ఎల్‌ఎండీ దిగువన కూడా..
ఎల్‌ఎండీ దిగువన కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ 1.60 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం 2,200 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా... దిగువకు వచ్చే సరికి 500 క్యూసెక్కులు కూడా ఉండటం లేదు. కొన్ని చోట్ల చివరి ఆయకట్టు వరకు నీరే రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు, మూడు కిలోమీటర్ల పొడవునా..
ప్రాజెక్టు కుడి, ఎడమ గట్ల పరిధిలోని బాల్కొండ నియోజకవర్గం మొండోరా, తిమ్మాపూర్, ఉప్పలూర్‌లతోపాటు జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉంది. కాల్వల వద్ద మోటార్లు పెట్టి.. రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోని పొలాలకు కూడా పైప్‌లైన్లు వేసి నీటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

వరి సాగు పెరగడంతో..
ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో 70:30 నిష్పత్తిన వరి, ఆరుతడి పంటలకు నీరివ్వాలని ప్రణాళిక వేశారు. కానీ ఎగువన రైతులంతా వరి సాగుకే మొగ్గు చూపడంతో.. ఈ నిష్పత్తి కాస్తా 85ః15గా మారింది. దీంతో ఎగువ నీటి వినియోగం మరింత పెరిగింది.

క్రమబద్ధీకరణకే ప్రభుత్వం మొగ్గు
ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు రైతుల ఆందోళ న నేపథ్యంలో 24 గంటల విద్యుత్‌పై నీటి పారుదల శాఖ ఇటీవల సమీక్ష నిర్వహించి.. రైతుల అభిప్రాయాలను తెలుసుకుంది. ఈ మేరకు 24 గంటల విద్యుత్‌ను క్రమబద్ధీకరిస్తే సాగు నీటి విషయంలో ఇబ్బందులు తప్పు తాయన్న యోచనకు వచ్చింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ నుంచి దిగువకు నీటిని విడుదల చేసే సమయంలో ఆయకట్టు ఎగువ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్‌ సరఫరాను 24 గంటల నుంచి 9 గంటలకు పరిమితం చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ఎగువన నీటి వినియోగం తగ్గి.. దిగువకు లభ్యత పెరుగుతుందని భావిస్తోంది.

అదే నీటి విడుదలను నిలిపేసిన సమయంలో మాత్రం పూర్తిగా 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని యోచిస్తోంది. దీనిపై నాలుగు రోజుల కింద ప్రయోగాత్మకంగా ప్రధాన కాల్వల పరిధిలో 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరాను తగ్గిస్తే దిగువకు ఏకంగా 400 క్యూసెక్కుల ప్రవాహం పెరిగినట్లుగా గుర్తించారు. దీంతో విద్యుత్‌ సరఫరాను క్రమబద్ధీకరించాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ పెద్దల ఆమోదం తర్వాత దీనిని అమలు చేసే అవకాశముంది. దీనికితోడు వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖలతో కాల్వలపై నిరంతర పర్యవేక్షణ జరిపించాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది.

చివరి భూముల రైతుల్లో గుబులు
ఎగువ నుంచి నీరు సరిగా రాక పోతుండటంతో ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి ప్రాంతం (టెయిల్‌ ఎండ్‌)లోని.. పెద్దపల్లి, రామగుండం పరిధిలోని డి–83, డి–86 కాల్వలకు, జగిత్యాలలోని కొన్ని ప్రాంతాలకు నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top