వచ్చిరాని వైద్యం.. ఆపై నిలువు దోపిడీ 

Fake Doctor Giving Treatment Becoming Dangerous To Patients In Neredgonda, Adilabad - Sakshi

సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్‌) : గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాథమిక చికిత్స అందించే వారు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు. వారికున్న అవగాహన, అనుభవం మేరకు చికిత్సనందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే వ్యక్తులు. కానీ ప్రస్తుతం కొందరు అక్రమార్జనే ధ్యేయంగా కనీస పరిజ్ఞానం లేకున్నా, అవగాహన లేకున్నా డాక్టర్ల అవతారమెత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొద్ది రోజుల పాటు ఏదో ఒక ఆస్పత్రిలో పనిచేసి వైద్యుల్లా చలామణి అవుతున్నారు.

అవసరమున్నా లేకపోయినా రకరకాల మందులు, టెస్టులు రాసి రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు. దీంతో ప్రథమ చికిత్సకు ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు ఆస్పత్రికి వెళ్లేలోపు కావాల్సిన ప్రథమ చికిత్స అందిస్తుంటారు. కానీ వారిలోని కొందరు అక్రమార్జన బాట పట్టారు. అవగాహన లేకపోయినా, వైద్యం అందిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కాసుల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వైద్యం కోసం ఆర్‌ఎంపీల దగ్గరకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే స్థాయికి చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

పరిజ్ఞానం లేకపోయినా వైద్యం..
గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు ఆర్‌ఎంపీలు పరిజ్ఞానం లేకుండానే వైద్యులుగా చలామణి అవుతున్నారు. వాస్తవానికి ఆర్‌ఎంపీలు, పీఎంపీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స చేయడానికి మాత్రమే అర్హులు. జ్వరం, జలుబు లాంటి వాటికి చిన్న చిన్న మాత్రలు ఇస్తే సరిపోతుంది. కానీ చాలా మంది పరిధి దాటి వైద్యం చేస్తున్నారు.

అవగాహన లేక కొంత, రోగం తొందరగా తగ్గితే చాలా మంచి డాక్టర్‌గా పేరు సంపాదించాలన్న ఆత్రుత కొంత వెరసీ అవసరమున్న దానికంటే ఎక్కువ మోతాదు మందులు ఇస్తున్నారు. ఫలితంగా రోగి బలహీన పడిపోవడమే కాకుండా ఎక్కువ రోజులు రోగాలతో సావాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వచ్చిన జబ్బేమో కానీ వైద్యం తర్వాత బిల్లు చూస్తే కొత్త రోగం రావడం ఖాయమని రోగులు అంటున్నారు.

కొద్ది రోజులే కాంపౌండర్‌..
పెద్ద ఆస్పత్రుల్లో ఐదారు నెలల పాటు కాంపౌండర్‌గా పనిచేయడం, కొంత మేర వైద్య పరిజ్ఞానం సంపాదించి సొంత ఊరిలో ఆర్‌ఎంపీలుగా అవతారం ఎత్తడం పరిపాటిగా మారింది. ఇంజక్షన్‌ వేయడం వస్తే చాలు వైద్యం నిర్వహించేందుకు ముందడుగు వేస్తున్నారు. కాంపౌండర్‌గా పనిచేసిన సమయంలో తెలిసిన కాస్తో, కూస్తో పరిజ్ఞానంతో గ్రామీణ ప్రాంతాల్లో క్లినిక్‌లు పెట్టేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులున్నప్పటికి వారు ప్రైవేటుకు ఎక్కువగా ప్రాధాన్యమివ్వడం, సమయపాలన పాటించకపోవడం, వచ్చిన రోగులను పట్టించుకోకపోవడంతో రోగులు స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు గ్రామీణ వైద్యులు తెలిసీ తెలియని వైద్యాన్ని కొంతమేర నిర్వహించి, పెద్దాస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రాథమిక చికిత్స నుంచి మొదలుకొని ఆస్పత్రి నుంచి బయటికి వచ్చే వరకు అంతా తామై నడిపిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top