నకిలీలపై నజర్‌ | Sakshi
Sakshi News home page

నకిలీలపై నజర్‌

Published Tue, May 21 2019 8:19 AM

Fake Catton Seeds in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో పత్తి సాగు ఊపందుకోనుంది. ఈ సీజన్‌లో వరి కంటే ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట సాగుచేస్తారు. ఫలితంగా విత్తనాలకు భారీ డిమాండ్‌ ఏర్పడుతుంది. దీనిని క్యాష్‌ చేసుకునేందుకు నకిలీ, అనుమతి లేని విత్తనాల మాఫియాలు విజృంభిస్తూ ఉంటాయి. ఈ దందాకు చెక్‌ చెప్పడానికి ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ బందాల్లో వ్యవసాయ, సీడ్‌ సర్టిఫయింగ్‌ ఆఫీసర్, పోలీసు అధికారులు సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లకు చెందిన టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌ (ఎస్వోటీ) నుంచి ఎస్సై స్థాయి అధికారులకు ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లో డిప్యుటేషన్‌పై పోస్టింగ్‌ ఇచ్చారు. పత్తి విత్తనాలు నాటే సీజన్‌ సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఏటా రూ.వేల కోట్లలో జరిగే ఈ వ్యాపారంలో నకిలీ విత్తులూ పెద్ద ఎత్తున అమ్ముడుపోతున్నాయి.

దీనిని గుర్తించలేని రైతన్నలు వీటిని నాటుతున్నారు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది కొన్ని సందర్భాల్లో రైతు ఆత్మహత్యలకూ కారణం అవుతోంది. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా ఈసారి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విత్తన విక్రయాలపై కన్నేసి ఉంచడానికి, నకిలీ విత్తుల దందాకు పూర్తిగా చెక్‌ చెప్పడానికి 15 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ నుంచి వ్యవసాయ అభివృద్ధి అధికారి, సీడ్‌ సర్టిఫయింగ్‌ అధికారి, పోలీసు విభాగం నుంచి హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ లేదా సైబరాబాద్, రాచకొండల్లోని ఎస్వోటీల్లో పని చేస్తున్న సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి ప్రధాన సభ్యులుగా ఉన్నారు. తనిఖీల్లో వీరికి మండలస్థాయిల్లో స్థానిక వ్యవసాయ అధికారి సహకరిస్తున్నారు. నకిలీ విత్తనాలను కొందరు వ్యాపారులు స్థానికంగానే తయారు చేస్తుండగా మరికొందరు ఇతర రాష్ట్రాల నుంచి రవాణా చేసి విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, అదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలతో పాటు రాజధానిలోనూ పత్తి విత్తనాల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ గ్రేట్‌ హైదరాబాద్‌పై దృష్టి కేంద్రీకరించింది. నకిలీల దందాలో అత్యధికంగా రాజధాని కేంద్రంగానే జరుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీమ్స్‌ పని చేస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఆయా జిల్లాల్లో ఉన్న సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్, గోదాములు, ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థల కార్యాలయాలు, విక్రయ దుకాణాల్లోనూ సోదాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్న వ్యవసాయ అధికారులు అనుమానాస్పదమైన వాటి శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. అవి నకిలీ లేదా అనుమతి లేనివిగా తేలితే స్థానిక వ్యవసాయ అధికారితో ఫిర్యాదు చేయించి ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. కొన్ని అనుమానాస్పద దుకాణాలు, రవాణా సంస్థలపై నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఏడీఓ జీఎం నివేదిత, టాస్క్‌ఫోర్స్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ కేఎస్‌ రవి, ఎస్సీఓ పి.అపర్ణ, ఏఓ నిర్మలలతో కూడిన ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆది, సోమవారాల్లో సరూర్‌నగర్‌లోని యూనిసెమ్‌ అగ్రిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎల్బీనగర్‌లోని చార్డన్‌ పోఖ్‌పాండ్‌ సీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఆటోనగర్‌లోని కావేరీ సీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నిర్మల్‌ సీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఏబీటీ ట్రాన్స్‌పోర్ట్స్, వీఆర్‌ఎల్‌ ట్రాన్స్‌పోర్ట్స్, అసోసియేటెడ్‌ రోడ్‌ క్యారియర్స్, టీసీఐ ట్రాన్స్‌పోర్ట్‌ల్లో సోదాలు చేశాయి. ఓ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో ఉన్న పత్తి విత్తనాలపై వ్యవసాయ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు.  నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాజధాని కేంద్రంగా పని చేస్తున్న ఈ 15 బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాయి. పత్తి విత్తనాల విక్రయ సీజన్‌ ముగిసే వరకు వీటిని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Advertisement
Advertisement