ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకో | Face Recognition System Ready in RGIA Samshabad | Sakshi
Sakshi News home page

ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకో

Oct 24 2019 8:00 AM | Updated on Oct 31 2019 12:37 PM

Face Recognition System Ready in RGIA Samshabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (ఆర్‌జీఐఏ)లో డొమెస్టిక్‌ ప్రయాణికుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ఎఫ్‌ఆర్‌) ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. ఒకసారి ముఖకవళికలు నమోదు చేసుకున్న ప్రయాణికులు.. ఆ తర్వాత ఎలాంటి తనిఖీలు లేకుండా తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించేందుకు వీలుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని  ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. జూలైలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ట్రయల్‌ రన్‌లో భాగంగా 3,000 మంది ముఖకవళికలను నమోదు చేయాలని అధికారులు భావించారు. కానీ ఈ సంఖ్య 4,198కి చేరుకుంది. అనుకున్న దానికన్నా 40శాతం మంది ప్రయాణికులు అధికంగా తమ ముఖకవళికలను నమోదు చేసుకున్నట్లు జీఎమ్మార్‌ అధికారులు తెలిపారు. సినీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రాంచరణ్, అఖిల్, సమంత తదితరులు ఎఫ్‌ఆర్‌లో తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. అలాగే హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సైతం తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఇలా నమోదు చేకున్న వారంతా ఈ నెల 17 నాటికి శంషాబాద్‌  విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు 6వేల సార్లు ప్రయాణం చేశారు. వీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల ద్వారా ఎలాంటి తనిఖీలు లేకుండా వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. 

‘డిజియాత్ర’కు మార్గం సుగమం...  
సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందజేసేందుకు కేంద్రం ‘డిజియాత్ర’ చేపట్టిన విషయం విదితమే. ఒకసారి తమ పూర్తి వివరాలను, ముఖకవళికలను విమానాశ్రయ భద్రతా సిబ్బంది వద్ద నమోదు చేసుకున్నవారు పదే పదే ఆ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఆర్‌జీఐఏలో జూలైలో ప్రారంభించి, ప్రయాణికులు వివరాలు నమోదు చేయిచుకునేందుకు ఎయిర్‌పోర్టులోని 1, 3 డొమెస్టిక్‌ డిపార్చర్‌ గేట్ల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎఫ్‌ఆర్‌లో భాగంగా ప్రయాణికుల  గుర్తింపుకార్డు, కాంటాక్ట్‌ వివరాలను నమోదు చేశారు. ఆ తర్వాత ప్రయాణికుల ముఖాలను ఫొటో తీశారు. సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా అధికారులు ప్రయాణికుల నుంచి సేకరించిన వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఒక యూనిక్‌ డిజియాత్ర ఐడీని కేటాయించారు. ఈ ఐడీలపై ఇప్పటి వరకు ప్రయాణికులు 6వేల సార్లు ప్రయాణం చేసినట్లు అధికారులు తెలిపారు. 

కేంద్రం అనుమతిస్తే అందరికీ...  
ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు వివరాలను కేంద్ర విమానయాన శాఖ పరిశీలనకు పంపించారు. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ కావడంతో కేంద్రం అనుమతిస్తే ప్రయాణికులందరికీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీఎమ్మార్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధంగా ఉంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతిరోజు సుమారు 55వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల మధ్య రెగ్యులర్‌గా రాకపోకలు సాగించేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఒక్కసారి ఫేషియల్‌ రికగ్నీషన్‌ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుంటే...  ఆ తర్వాత ప్రయాణంలో ఎలాంటి తనిఖీలు లేకుండా హాయిగా సాగిపోవచ్చు. కేవలం హ్యాండ్‌బ్యాగ్‌ ద్వారా వెళ్లేవాళ్లకు ఇదిఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈసదుపాయం ప్రయాణికులందరికీఅందుబాటులోకి రావాలంటే కేంద్రంగ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే ఆలస్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement