రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టిస్తున్నాయి.. 2013-14తో పోలిస్తే 16 శాతం వరకు విక్రయాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
- రికార్డు స్థాయిలో రూ. వెయ్యి కోట్లు దాటిన డిసెంబర్ రాబడి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టిస్తున్నాయి.. 2013-14తో పోలిస్తే 16 శాతం వరకు విక్రయాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.. 2014-15లోనే అత్యధికంగా డిసెంబర్‌లో రూ. 1,005.67 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగాయి. నవంబర్ నెలతో పోలిస్తే ఇది రూ. 150 కోట్లు ఎక్కువ. అంతేకాదు గత ఏడాది డిసెంబర్‌తో పోల్చినా... రూ. 130 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. అయితే ఇదంతా నూతన సంవత్సర వేడుకల్లో వినియోగం పెరిగినందువల్లేనని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
2014 సంవత్సరాంతానికి వారం ముందు నుంచే మద్యం వ్యాపారులు వందల కోట్ల రూపాయల మద్యం స్టాక్‌ను గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. డిసెంబర్ 24వ తేదీ నుంచే మద్యం డిపోల నుంచి స్టాక్ కొనుగోళ్లు పెరగగా.. 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మూడు రోజుల్లోనే రూ. 225 కోట్ల మేర మద్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. తద్వారా గత సంవత్సరంతో పోలిస్తే ఈ నెలలో 16 శాతం అమ్మకాలు పెరిగాయి.
రోజువారీ విక్రయాలు రూ. 30 కోట్ల లోపే..
రాష్ట్రంలోని 17 టీఎస్ బీసీఎల్ గోడౌన్‌ల ద్వారా ప్రతిరోజు సగటున వ్యాపారులు కొనుగోలు చేసే మద్యం రూ. 30 కోట్ల లోపే. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని 24వ తేదీ నుంచే గోడౌన్‌ల నుంచి భారీగా స్టాక్‌ను కొన్నా రు. 24న రూ. 52.26 కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేయగా, 26న రూ. 49.95 కోట్లు, 27న రూ. 54 కోట్ల మద్యాన్ని కొన్నారు. ఇక 29, 30, 31వ తేదీల్లో వరుసగా రూ. 79 కోట్లు, రూ. 78.26 కోట్లు, 70.53 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాలు, బార్లు, క్లబ్బులకు తరలించారు. అంటే ఈ వారం రోజుల్లో రూ. 180 కోట్లకుపైగా మద్యాన్ని అదనంగా కొన్నారు.
అమ్మకాలు పెరిగాయి: డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు కొంత పెరిగాయని ఎక్సైజ్ శాఖ కమిషనర్ అహ్మద్ నదీం చెప్పారు. ఈ ఒకే నెలలో రూ. 1,005 కోట్లకు పైగా రికార్డు స్థాయిలో రాబడి వచ్చిందన్నారు. అలాగే నూతన సంవత్సర వేడుకల కోసం ‘పార్టీలు’ చేసుకునేందుకు 118 ఈవెంట్ పర్మిట్లు ఇచ్చినట్లు తెలిపారు.