‘జిల్లా ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా మార్చండి’

Etela Rajender Meets Health Minister Harshvardhan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా మార్చాలని మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కలిసి విన్నవించారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా ఆధునీకరించాలని విన్నవించారు. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద కొత్త బ్లాక్స్‌ ఏర్పాటుపై కేంద్ర మంత్రితో ఈటల చర్చించారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రాలు, కొత్త వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరారు. మరోవైపు ప్రాంతీయ క్యాన్సర్‌ కేంద్రాల ఏర్పాటుపై ఈటల చర్చించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే కేంద్రమంత్రితో ఈటల సమగ్రంగా ఏమేం చర్చించారన్న విషయాన్ని కార్యాలయ వర్గాలు పూర్తిస్థాయిలో వెల్లడించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఇదిలాఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ‘అందరికీ అందుబాటులోకి ఆధునిక వైద్య పరికరాలు’అనే లక్ష్యంతో ‘వైద్య పరికరాలు–సేవలు’పేరుతో మంగళవారం ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు ఈటల ఢిల్లీ వెళ్లారు. కాగా, మన శాస్త్ర విజ్ఞానం రోగులకు అతి తక్కువ ధరకు వైద్యం అం దించేందుకు ఉపయోగపడాలని ఈటల కోరారు. సోమవారం హైదరాబాద్‌లో హెల్త్‌ అండ్‌ ఫార్మా సదస్సు జరిగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top