కరెంటు ఇచ్చారు..లైన్‌ మరిచారు! | Electrification Completed Pagidipalli Station To Nallapadu Trains Not Sanctioned | Sakshi
Sakshi News home page

కరెంటు ఇచ్చారు..లైన్‌ మరిచారు!

Sep 1 2019 7:51 AM | Updated on Sep 1 2019 7:51 AM

Electrification Completed Pagidipalli Station To Nallapadu Trains Not Sanctioned - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అది దగ్గరి దారి.. ఆ మార్గం గుండా వెళ్తే దాదాపు 80 కి.మీ. దూరం తగ్గుతుంది. ఫలితంగా సమయంతోపాటు ఖర్చూ ఆదా అవుతుంది. అలాంటప్పుడు ఎవరైనా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. గరిష్టంగా దాన్ని వినియోగించుకుని ఆదా చేసుకుంటారు. కానీ ఘనత వహించిన మన రైల్వే మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో నడికుడి మార్గం కీలకమైన వాటిల్లో ఒకటి. నగరం నుంచి వెళ్లేటప్పుడు బీబీ నగర్‌ దాటిన తర్వాత వచ్చే పగిడిపల్లి స్టేషన్‌ తర్వాత మార్గం రెండుగా విడిపోతుంది. ఎడమవైపు వెళ్తే వరంగల్, కుడివైపు వెళ్తే నడికుడి మార్గం వస్తుంది. వరంగల్‌ మార్గం డబుల్‌లైన్‌ కావటం, విద్యుదీకరణ ఉండటంతో ఇది ప్రధాన మార్గమైంది.

కానీ నడికుడి మార్గం సింగిల్‌లైన్‌గా ఉండిపోవటంతో ఆ మార్గంలో కొన్ని రైళ్లే నడుస్తున్నాయి. పైగా ఇప్పటివరకు అది విద్యుదీకరణ పూర్తి కాకపోవటంతో డీజిల్‌ రైళ్లనే నడుపుతున్నారు. వరంగల్‌ మార్గంలో రైళ్ల ట్రాఫిక్‌ గరిష్ట పరిమితి దాటిపోవటంతో ప్రమాదకర పరిస్థితిలో దాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో దానికి ప్రత్యామ్నాయంగా నడికుడి మార్గాన్ని అభివృద్ధి చేయాలని గతంలోనే నిర్ణయించారు. రెండో లైన్‌ వేయటంతోపాటు విద్యుదీకరణ చేపట్టి కొన్ని రైళ్లను ఈ మార్గంలో మళ్లించాలనేది ఆలోచన. గుంటూరుకు వరంగల్‌ మీదుగా కంటే ఈ మార్గంలో వెళ్తే దాదాపు 80 కి.మీ. నిడివి తగ్గుతుంది. దీంతో ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు.  

కరెంటు ఏర్పాటు చేసి తుస్సుమనిపించారు.. 
చేసిన ఆలోచనకు, చేపట్టిన కార్యాచరణకు పొంతన లేకపోవటంతో ఇప్పుడు ఈ మార్గంలో వింత పరిస్థితి ఎదురైంది. పగిడిపల్లి స్టేషన్‌ నుంచి గుంటూరు సమీపంలోని నల్లపహాడ్‌ వరకు తాజాగా విద్యుదీకరణ పూర్తి చేశారు. గుంటూరు నుంచి విజయవాడ మార్గంలో చాలా కాలం క్రితమే ఆ తంతు పూర్తయింది. గుంటూరు నుంచి అటు తెనాలి, ఇటు గుంతకల్‌ మార్గాల్లో కూడా ఇటీవలే విద్యుదీకరణ పూర్తి చేశారు. వెరసి కరెంటు ఇంజిన్లతో రైళ్లు నడిపేందుకు ఈ మార్గం సిద్ధమైందన్నమాట. ఇప్పటివరకు ఈ మార్గంలో కేవలం డీజిల్‌ రైళ్లనే నడిపేవారు. హైదరాబాద్‌ నుంచి డీజిల్‌ ఇంజిన్‌ రైలును గుంటూరు/తెనాలి వరకు లాక్కెళ్లేది. అక్కడ దాన్ని మార్చి రైలుకు విద్యుత్తు ఇంజిన్‌ అమర్చి పంపేవారు.

దీంతో దాదాపు 20 నిమిషాల సమయం వృథా అయ్యేది. ఇప్పుడు విద్యుదీకరణ పూర్తి కావటంతో ఆ సమస్య లేకుండా కరెంటు ఇంజిన్లు అమర్చి రైళ్లను నడిపే అవకాశం కలిగింది. విజయవాడ, గుంటూరు, తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాలకు ఇది దగ్గరి దారిగా మారింది. ఇక వరంగల్‌ మార్గంపై భారం తగ్గించేందుకు కొన్ని రైళ్లను ఈ దారి గుండా నడపాల్సి ఉంది. కానీ ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఈ మార్గాన్ని విద్యుదీకరించారు కానీ రెండో లైన్‌ (డబ్లింగ్‌) నిర్మించలేదు. ఫలితంగా పగిడిపల్లి నుంచి గుంటూరు వరకు ఇది సింగిల్‌ లైన్‌గానే ఉంది. దీంతో ఎక్కువ రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోయింది. విద్యుదీకరించినా, ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు కరెంటు ఇంజిన్‌ ఏర్పాటు చేయడం తప్ప ఒక్క రైలు కూడా అదనంగా నడిపే అవకాశం దక్కలేదు. వెరసి భారీ వ్యయంతో విద్యుదీకరించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

గతంలోనే మంజూరు.. పనులే చేపట్టలేదు.. 
పగిడిపల్లి నుంచి నల్లపహాడ్‌ వరకు డబ్లింగ్‌ చేపట్టేందుకు రైల్వే శాఖ గతంలోనే అనుమతి మంజూరు చేసినా అది ముందుకు సాగలేదు. ఎంపీ నిలదీయంతో కొత్తగా మంజూరు చేస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. కానీ దాని ఊసేలేకుండా పోయింది. దాదాపు 200కి.మీ. మార్గాన్ని డబ్లింగ్‌ చేయకపోవటం వల్ల, విద్యుదీకరణ జరిగినా అదనంగా రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోయింది. ఫలితం.. వరంగల్‌ మార్గంపై అదనపు భారం పడటం, 80 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి రావటం, అంతమేర కరెంటు ఖర్చు, సమయం వృథా.. ఇదీ పరిస్థితి. అటు విద్యుదీకరణ, ఇటు డబ్లింగ్‌ పనులు ఒకే సారి చేపట్టి ఉంటే.. రెండూ పూర్తయ్యేవి.  రైల్వేకు, ప్రయాణికులకు ఎంతో మేలు జరిగేది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement