విద్యార్థులు  కావలెను

Declining Students in Public Schools - Sakshi

ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న పిల్లల సంఖ్య

టీచర్లు ఎక్కువ.. స్టూడెంట్స్‌ తక్కువ

నిబంధనలకు అనుగుణంగా లేని పాఠశాలలెన్నో

పట్టించుకోని అధికారులు

సదాశివనగర్‌:  ఇది ఒక కల్వరాల్‌ ఉన్నత పాఠశాల పరిస్థితే కాదు.. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ పడి పోతోంది. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్నా అది మాటలకే పరిమితమవుతోంది. మౌలిక వసతుల లేమి, నాణ్యమైన బోధన లభించక పోవడం, కొందరు టీచర్లు పట్టనట్లు వ్యవహరించడం.. తదితర కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గి పోతున్నారు. జిల్లాలో దాదాపు 60 శాతం వరకు బడుల్లో విద్యార్థుల సంఖ్య వంద లోపే ఉండడం గమనార్హం. కొన్నిచోట్ల 30 లోపు, మరికొన్ని చోట్ల 40 లోపు మాత్రమే పిల్లలు చదువుతున్నారు. ఆయా బడుల్లో నలుగురు, ఐదుగురు టీచర్లు పని చేస్తుండడం విశేషం. నెలనెలా ఠంచన్‌గా జీతాలు తీసుకుంటున్న అధికారులు, ఉపాధ్యాయులు సర్కారు బడులను బలోపేతం చేయడంపై పెద్దగా దృష్టి సారించట్లేదు.

ఒక్కోచోట ఒక్కో విధంగా.. 
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న బడుల్లో టీచర్లు తక్కువగా ఉన్నారు. తాడ్వాయి మండలం ఎండ్రియాల్‌ ఉన్నత పాఠశాలలో 26 మంది విద్యార్థులుంటే, తొమ్మిది మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఎర్రాపహడ్‌ బాలికల పాఠశాలలో 28 విద్యార్థులుంటే ఎనిమిది మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. తుక్కోజివాడి ఉన్నత పాఠశాలలో 40 మంది, వజ్జపల్లి హైస్కూల్‌లో 78 మంది చొప్పున విద్యార్థులుండగా, ఆయా బడుల్లో ఏడుగురు చొప్పున ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇలా ఒక్కో పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఒక్కో విధంగా ఉంది. ఎక్కువగా ఉన్న టీచర్లను అవసరమున్న చోటకు పంపించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. 

ప్రచారానికే పరిమితం.. 
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేరి్పంచాలని విద్యాసంవత్సరం ప్రారంభంలో కొన్ని రోజులు ఆర్భాటం చేసి వదిలేస్తున్నారు. అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని, నాణ్యమైన బోధన అందిస్తామని చెప్పి మొదట్లో ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత విద్యాబోధన, వసతుల గురించి పెద్దగా పట్టించుకోక పోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బడి మార్చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇలాంటి పాఠశాలలపై ఉన్నతాధికారులు దృష్టి సారించక పోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. 

చొరవ తీసుకుంటేనే.. 
అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటేనే ప్రభుత్వ బడులు బతికేది. లేకుంటే ఆయా పాఠశాలలు త్వరలోనే మూసివేసే పరిస్థితి నెలకొంటుంది. గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. మరోవైపు, అధికారులు కూడా స్పందించి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థుల పెరుగుదలకు కృషి చేస్తే ఫలితం కనిపించే అవకాశముంది.
 
‘ప్రైవేట్‌’కు పంపకుండా చూడాలి 
గ్రామం నుంచి పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లనీయకుండా చూడాలి. అప్పుడే మార్పు వస్తుంది. గతంలో చాలా ప్రయత్నం చేశాం. తల్లిదండ్రులను ఒప్పించి ఆంగ్లమాధ్యమం ప్రారంభించాం. అ యినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటì æకైనా అధికారులు స్పందించి చర్యలు చే పడితే బడిలో పిల్లలు చేరే అవకాశం ఉంది.  – నోముల రూపేందర్‌రెడ్డి, కల్వరాల్‌ 

ఇంటింటికీ వెళ్లాం.. 
విద్యార్థుల సంఖ్య ఏటేటా క్రమంగా తగ్గి పోతుందనే ఉద్దేశ్యంతోనే గ్రామంలోని ఇంటింటికీ వెళ్లాం. పిల్లలను ప్రభుత్వ బడిలోకి పంపించాలని సూచించాం. అయినా కొంత మంది తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు.  – రాజిరెడ్డి, ఉపాధ్యాయుడు, కల్వరాల్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top