సౌదీ అరేబియాలో 14 నెలల క్రితం మృతిచెందిన కుమ్మరి భాస్కర్ ...
కామారెడ్డి రూరల్ : సౌదీ అరేబియాలో 14 నెలల క్రితం మృతిచెందిన కుమ్మరి భాస్కర్ (28) మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరింది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి భాస్కర్ 17 నెలల క్రితం బతుకుదెరువుకోసం సౌదీ అరే బియాకు వెళ్లాడు. అతడు ఏజెంట్ చేతిలో మోసపోయాడు. కంపెనీ పేరుచెప్పిన ఏజెంట్.. విజిట్ వీసాపై పంపాడు. విజిట్ వీసాలపై వచ్చినవారు దేశం విడిచి వెళ్లాలన్న అక్కడి ప్రభుత్వ ఆదేశాలతో ఆందోళన చెందిన భాస్కర్ స్వదేశానికి తిరిగి రావడానికి యత్నించాడు.
ఈలోగా గతేడాది సెప్టెంబర్ 16న మృత్యువాత పడ్డట్లు సౌదీ నుంచి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే భాస్కర్ ఎలా మరణించాడన్న విషయం తెలియలేదు. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడం కోసం పలువురు ప్రయత్నించారు. 14 నెలల తర్వాత శనివారం మృతదేహం స్వగ్రామానికి చేరింది. మృతుడికి తల్లిదండ్రులు బాలమణి, బుచ్చిరాములు, భార్య పద్మ, నాలుగేళ్ల కుమారుడు ఆదిత్య, రెండేళ్ల కుమారుడు సిద్దు ఉన్నారు. బతుకుదెరువుకోసం సౌదీ వెళ్లిన వ్యక్తి విగతజీవుడై ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చాంద్ పాషా డిమాండ్ చేశారు. శనివారం ఆయన గ్రామానికి వచ్చి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గల్ఫ్‌బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారని.. అధికారం వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కంపెనీ వీసా అని చెప్పి విజిట్ వీసాపై పంపి మోసం చేసిన గల్ఫ్ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.