breaking news
The dead body
-
ఏడ్చి ఏడ్చి.. కన్నీళ్లింకాక..
కామారెడ్డి రూరల్ : సౌదీ అరేబియాలో 14 నెలల క్రితం మృతిచెందిన కుమ్మరి భాస్కర్ (28) మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరింది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి భాస్కర్ 17 నెలల క్రితం బతుకుదెరువుకోసం సౌదీ అరే బియాకు వెళ్లాడు. అతడు ఏజెంట్ చేతిలో మోసపోయాడు. కంపెనీ పేరుచెప్పిన ఏజెంట్.. విజిట్ వీసాపై పంపాడు. విజిట్ వీసాలపై వచ్చినవారు దేశం విడిచి వెళ్లాలన్న అక్కడి ప్రభుత్వ ఆదేశాలతో ఆందోళన చెందిన భాస్కర్ స్వదేశానికి తిరిగి రావడానికి యత్నించాడు. ఈలోగా గతేడాది సెప్టెంబర్ 16న మృత్యువాత పడ్డట్లు సౌదీ నుంచి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే భాస్కర్ ఎలా మరణించాడన్న విషయం తెలియలేదు. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడం కోసం పలువురు ప్రయత్నించారు. 14 నెలల తర్వాత శనివారం మృతదేహం స్వగ్రామానికి చేరింది. మృతుడికి తల్లిదండ్రులు బాలమణి, బుచ్చిరాములు, భార్య పద్మ, నాలుగేళ్ల కుమారుడు ఆదిత్య, రెండేళ్ల కుమారుడు సిద్దు ఉన్నారు. బతుకుదెరువుకోసం సౌదీ వెళ్లిన వ్యక్తి విగతజీవుడై ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చాంద్ పాషా డిమాండ్ చేశారు. శనివారం ఆయన గ్రామానికి వచ్చి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గల్ఫ్బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారని.. అధికారం వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కంపెనీ వీసా అని చెప్పి విజిట్ వీసాపై పంపి మోసం చేసిన గల్ఫ్ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య
* సింగుపురంలో దారుణం * నీటి డ్రమ్ములో తలకిందులుగా మృతదేహం *శరీరంపై ఆభరణాలు మాయం శ్రీకాకుళం క్రైం, శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్: మహిళపై లైంగికదాడి చేసిన కిరాతకులు అనంతరం ఆమెను దారుణంగా చంపి నీటి డ్రమ్ములో తలకిందులుగా పెట్టిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బంగారం కోసమే హత్య చేశారా లేక అత్యాచారాన్ని దొంగతనంగా మార్చేందుకు దుండగులు ఆభరణాలు అపహరించారా అని పలు అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి. బంధువుల పెళ్లికి హాజరైన మహిళ అర్థరాత్రి కనిపించకుండా పోయి శుక్రవారం ఉదయాన్నే నీటి డ్రమ్ములో శవంగా మారడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో గురువారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం... నరసన్నపేట మండలం కిల్లాం గ్రామానికి చెందిన చల్ల సూరమ్మ(30) భర్తతో విడాకులు పొంది తల్లి అప్పమ్మతో కలసి నివసిస్తోంది. ఆమె అన్న సింహాచలం సింగుపురంలో తన అత్తవారింటి వద్దనే ఉంటున్నాడు. బంధువుల పెళ్లి ఉండటంతో సూరమ్మ రెండు రోజుల కిందట తన అన్న సింహాచలం ఇంటికి వచ్చింది. గురువారం రాత్రి సింగుపురం ఊరి శివార్లో ఉన్న కళ్యాణ మండపంలో బంధువుల పెళ్లి జరుగుతుండంతో సూరమ్మ వదిన లక్ష్మితో కలసి పెళ్లికి వెళ్లింది. అర్థరాత్రి సమయంలో సూరమ్మ కనిపించకపోవడంతో వదిన లక్ష్మి చుట్టుపక్కలంతా వెతికింది. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఎవరైనా తెలిసిన వారి ఇంటికి వెళ్లి ఉంటుందని భావించి లక్ష్మి తన ఇంటికి వెళ్లిపోయింది. కానీ శుక్రవారం ఉదయాన్నే సూరమ్మ మృతదేహం కళ్యాణ మండపం పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోని నీటి డ్రమ్ములో కనిపించడంతో బంధువులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటన విషయం తెలుసుకున్న శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, శ్రీకాకుళం టౌన్ సీఐ ఎస్.తాతారావు, రూరల్ ఎస్సై ఎం.శ్రీను, శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్సై కె.భాస్కరరావులు సంఘటన స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. కర్రతో మోది హత్య.. కంటిపై బలమైన గాయం పెళ్లికి వెళ్లిన సూరమ్మపై అత్యాచారం చేసిన కిరాతకులు ఆపై హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కళ్యాణ మండపం నుంచి పక్కనే ఉన్న ఇంట్లోకి తనే స్వయంగా వెళ్లిందా లేక తెలిసిన వారెవరైనా తీసుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు సూరమ్మను కర్ర(గజం బద్ద) తో కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె కుడి కంటిపై బలమైన గాయం కనిపిస్తోంది. దీంతో రక్తస్రావం తాలూకా మరకలు ఇంట్లోని నేలపై కనిపిస్తున్నాయి. అనంతరం ఆమెను అక్కడే ఉన్న నీటి డ్రమ్ములో తలకిందులుగా ఉంచారు. అయితే మృతురాలి మెడలోని గొలుసు, చేతి ఉంగరం, చెవి దుద్దులు తదితర ఆభరణాలు కనిపించడం లేదు. ఆమెను పెళ్లి నుంచి ఎవరూ బలవంతంగా అపహరించే అవకాశం లేదు కాబట్టి ఎవరో తెలిసిన వారే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ఆ రెండిళ్లల్లోనే ఉన్నారా..? సింగుపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకున్నారు. సంఘటన స్ధలంలో కదిలిన పోలీసు కుక్క సింగుపురంలోని రెండు ఇళ్ల వద్దకు వెళ్లి అగింది. అయితే ఆ రెండు ఇళ్లకూ తాళాలు వేసి ఉండటం కూడా పలు అనుమానాలు తావిస్తోంది. ఆ ఇంటి యజమానులపై నిఘా ఉంచారు. అంతేకాకుండా సూరమ్మకు పరిచయం ఉన్న వ్యక్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. సూరమ్మ హత్యకు సంబంధించి ఆమె అన్నయ్య సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.