ఏటీఎం దొంగలు దొరికారు 

DCP Prakash-Reddy Says, ATM Robbed Gang Was Arrested In Vikarabad - Sakshi

సాక్షి, మొయినాబాద్‌ : జల్సాలకు అలవాటు పడిన యువకులు ముఠాగా ఏర్పడి ఈజీగా మనీ సంపాదించాలని దొంగతనాన్ని ఎంచుకున్నారు. ఏటీఎం సెంటర్లే లక్ష్యంగా ఇరవై రోజుల వ్యవధిలో మొయినాబాద్, నార్సింగి, రాయదుర్గం ప్రాంతాల్లో ఆరు ఏటీఎం సెంటర్లలో చోరీలకు యత్నించి విఫలమయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. సోమవారం మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వెల్లడించారు.

నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సర్ఫరాజ్, మహ్మద్‌ అమీర్‌ రయీస్, అబ్దుల్‌ రహీం, మొయినాబాద్‌ మండలం ముర్తూజగూడ గ్రామానికి చెందిన మహ్మద్‌ ఫర్దీన్‌ స్నేహితులు. వీరిలో మహ్మద్‌ సర్ఫరాజ్‌ ఇంటర్‌ చదువుతుండగా మిగిలిన వారు ఇంటర్‌ వరకు చదివి ప్రైవేటు కంపెనీల్లో పనులు చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఈ నలుగురు యువకులు ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దొంగతనాలకు అలవాటు పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఏటీఎం కేంద్రాల్లో చొరబడి మిషన్‌ను ధ్వంసం చేసి డబ్బులు తీసుకోవాలని ప్లాన్‌ వేశారు. 

అర్ధరాత్రి చోరీలు... 
ముఠాగా ఏర్పడిన ఈ నలుగురు యువకులు ఏటీఎం కేంద్రాలే లక్ష్యంగా చోరీలు మొదలుపెట్టారు. జూన్‌ 27 అర్ధరాత్రి 2 గంటల సమయంలో మొయినాబాద్‌లో అంజనాదేవి గార్డెన్‌ పెట్రోల్‌ బంకు వద్ద ఉన్న యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం సెంటర్‌ ఎదుట ఉన్న సీసీ కెమరాలు ధ్వంసం చేసి ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి మిషన్‌ను ధ్వంసం చేసి అందులోని డబ్బు తీసేందుకు ప్రయత్నించారు.

ఏటీఎం మిషన్‌లో డబ్బులు ఉన్న బాక్స్‌ తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది. అదే విధంగా జులై 11న అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో మొయినాబాద్‌ మండల కేంద్రంలో ఎస్‌బీఐ ఏటీఎం పక్కన ఉన్న యాక్సీస్‌ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నించారు. మనీ బాక్సు తెరుచుకోకపోవడంతో అక్కడ కూడా వారికి డబ్బులేమీ దొరకలేదు. 

అన్ని చోట్ల విఫలమే... 
మొయినాబాద్‌ మండలంలోని రెండు ఏటీఎం సెంటర్లతో పాటు 20 రోజుల వ్యవధిలో నార్సింగి పీఎస్‌ పరిధిలో మూడు చోట్ల, రాయదుర్గం పీఎస్‌ పరిధిలో ఒక చోట ఏటీఎం సెంటర్లలో చోరీలకు యత్నించారు. ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు యత్నించిన దుండగులు అన్ని చోట్ల విఫలమయ్యారు.  

సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టుబడ్డారు 
ఏటీఎం సెంటర్లలో చోరీలకు యత్నించిన ముఠాను పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా గుర్తించారు. నిందితులు ఎక్కడ ఏటీఎం సెంటర్‌లో చోరీకి యత్నించినా.. అక్కడ సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అయితే నిందితులు ఏటీఎం కేంద్రం వద్దకు వచ్చే దృశ్యాలు అప్పటికే నిక్షిప్తమయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు.

సోమవారం మొయినాబాద్‌ మండలంలోని జేబీఐటీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్‌ బైక్‌పై వస్తున్న ముగ్గురు నిందితులు మహ్మద్‌ సర్ఫరాజ్, మహ్మద్‌ అమీర్‌ రయీస్, మహ్మద్‌ ఫర్దీన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బైక్‌తో పాటు ఒక టూల్‌ కిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి సోమవారం రియాండ్‌కు తరలించారు. కేసును చేధించడంలో కీలకంగా వ్యవహరించిన మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్సై జగదీశ్వర్, కానిస్టేబుళ్లను డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఏసీపీ అశోక చక్రవర్తి అభినందించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top