ఓసారి ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకోండి! 

Complete Phase Recognition Pilot Project at Shamshabad Airport - Sakshi

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోఫేస్‌ రికగ్నైజేషన్‌ పైలట్‌ ప్రాజెక్టు పూర్తి

పూర్తిగా అమల్లోకి వస్తే.. ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం

తొలిదశలో ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బందికి వర్తింపు

దశలవారీగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ ప్రయాణికులకు

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది. సత్వరమే భద్రతా తనిఖీలను పూర్తిచేసే ముఖకవళికల(ఫేస్‌ రికగ్నైజేషన్‌) నమోదు ప్రక్రియను గతేడాది ఎయిర్‌పోర్టు అధికారులు ప్రారంభించారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బంది, రెండోదశలో భాగస్వామ్య సంస్థలను ఈ తనిఖీల పరిధిలోకి తెచ్చారు. మొత్తం ఎయిర్‌పోర్టు కమ్యూనిటీ ఫేస్‌ రికగ్నైజేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లు ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.

డిజి యాత్ర ప్రాజెక్టులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేస్‌ రికగ్నైజేషన్‌ను దశలవారీగా జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. రోజూ సుమారు 55,000 మంది ప్రయాణికులు, 400 జాతీయ, అంతర్జాతీయ విమానాలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల భద్రతలో భాగంగా ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన అధికారులు తాజాగా ముఖకవళికల నమోదుకు శ్రీకారంచుట్టారు. బ్యాగేజ్‌ తనిఖీల్లోనూ మరింత పటిష్టమైన ఆటోమేటిక్‌ ట్రేరిట్రైవల్‌ సిస్టమ్‌(ఏటీఆర్‌ఎస్‌) చేపట్టింది. ప్రస్తుతం డొమెస్టిక్‌ ప్రయాణికుల బ్యాగేజ్‌కి మాత్రమే ఈ ఏటీఆర్‌ఎస్‌ను పరిమితం చేశారు.  

ముఖ కవళికల నమోదు ఇలా.... 
ఎయిర్‌పోర్టు టర్మినల్‌ ప్రవేశమార్గంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కియోస్క్‌ల ద్వారా ప్రయాణికులకు వన్‌టైమ్‌ ఫేస్‌ రికగ్నైజేషన్‌ సదుపాయాన్ని కల్పిస్తారు. ఇందుకోసం ప్రయాణికులు ఫేస్‌ ఐడీతోపాటు, గుర్తింపు ధ్రువీకరణ, ఫొటోలను కియోస్క్‌ల వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం ఈ–బోర్డింగ్‌ పాస్‌ను స్కాన్‌ చేస్తారు. దీంతో ఎయిర్‌లైన్‌ డిపార్చర్‌ కంట్రోల్‌ సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా తనిఖీ పూర్తవుతుంది. తర్వాత ప్రయాణికుల ఫేస్‌ రికగ్నైజేషన్‌తో టికెట్‌ అందజేస్తారు.

ఒకసారి ఫేస్‌ రికగ్నైజేషన్‌ పూర్తి చేసుకున్న ప్రయాణికులు ఆ తరువాత పదే పదే నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా భద్రతా తనిఖీలను పూర్తిచేసుకొని వెళ్లిపోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో ఈ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో మరి కొద్దిరోజుల్లో డొమెస్టిక్‌ ప్రయాణికులకు దీనిని విస్తరించనున్నారు. తరువాత అంతర్జాతీయ ప్రయాణికులను ఈ ప్రక్రియలోకి తెచ్చే అవకాశం ఉంది. ఒక సారి ఫేస్‌ నమోదు పూర్తయిన తరువాత ఇతర ప్రవేశమార్గాల్లో, భద్రతా అధికారుల తనిఖీల్లో మరోసారి నమోదు చేసుకోవలసిన అవసరం ఉండదు.  

ఏటీఆర్‌ఎస్‌ బ్యాగేజ్‌..
ఎక్స్‌రే–బ్యాగేజ్‌ తనిఖీల్లో అత్యాధునిక ఆటోమేటిక్‌ ట్రే రిట్రైవల్‌ సిస్టమ్‌(ఏటీఆర్‌ఎస్‌)ను ప్రవేశపెట్టారు. ఇది సమగ్రమైన భద్రతా ప్రక్రియ. అన్ని డొమెస్టిక్‌ సెక్యూరిటీ మార్గాల్లో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో ప్రత్యేకంగా సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా బ్యాగుల తనిఖీ పూర్తవుతుంది. చెక్‌–పాయింట్‌ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. వేగంగా, పటిష్టంగా బ్యాగ్‌ స్క్రీనింగ్‌ పూర్తవుతుంది. ఆటోమేటిక్‌ ట్రేలలో బ్యాగులు వేసిన తరువాత ఆటోమేటిక్‌ రోల్‌లో ఎక్స్‌రే–మెషీన్‌ల వైపు బ్యాగులు వెళ్తాయి.

ఈ ట్రేలను కేబిన్‌ సైజ్‌ బ్యాగులు తనిఖీ చేసేలా ఏర్పాటు చేశారు. ప్రతి ట్రేకు ప్రారంభం నుంచి చివరి వరకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్రాకింగ్‌ ఉంటుంది. అనుమానాస్పద వస్తువులు ఉన్న బ్యాగులను తొలగించేందుకు ప్రత్యేక లైన్‌లు ఉంటాయి. అనంతరం అలాంటి బ్యాగులను అధికారులు స్వయంగా తనిఖీ చేసి నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఇంటీరిమ్‌ ఇంటర్నేషనల్‌ డిపార్చర్‌ టెర్మినల్‌(ఐఐడీటీ)లో సమీకృత ఏటీఆర్‌ఎస్‌ వ్యవస్థతో పాటు 2 ఎక్స్‌–రే మెషీన్లు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top