టోకరా! | Sakshi
Sakshi News home page

టోకరా!

Published Sat, Dec 20 2014 2:30 AM

టోకరా!

నిర్ధారించిన భూగర్భ వనరుల శాఖ
10 కంపెనీలకు రూ.2.59 కోట్ల జరిమానా
చెల్లించినవి.. రూ.66 లక్షలు
చెల్లించాల్సింది.. రూ.1.93 కోట్లు
చెల్లింపులపై కంపెనీల దాటవేత  
 
 
వరంగల్ : ములుగు మండలంలోని మల్లంపల్లి, రామచంద్రాపురం, నిమ్మానగర్‌లో ఎర్రమట్టి గనులు ఉన్నాయి. అనుమతి పొందిన సంస్థల యజమానులు క్వారీలు నిర్వహిస్తున్నారు. తమ పరిధిని దాటి అనుమతి ఇవ్వని ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. ఈ అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు రావడంతో భూగర్భ వనరుల శాఖ అధికారులు ఎర్రమట్టి క్వారీలపై సర్వే నిర్వహించారు. అక్రమంగా తవ్వకాలు నిర్వహిస్తున్న 10 సంస్థల యజమానులకు 2012లో దశలవారీగా నోటీసులు జారీ చేశారు. ఈ సంస్థలకు అక్రమంగా తవ్వకాలు జరిపినందుకు రూ.2.59 కోట్లు జరిమానా విధించారు. మూడు సంస్థలు చెల్లింపులు పూర్తి చేశాయి. మరో మూడు సంస్థలు చెల్లించలేదు. మరో నాలుగు సంస్థలు కొంత మేరకు చెల్లింపులు జరిపాయి.

చెల్లింపుల విషయంలో దశలవారీగా పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తి మేరకు భూగర్భ వనరుల శాఖ రాష్ట్ర కార్యాలయం అనుమతి  ఇచ్చింది. అయినా ఇప్పటివరకు  ఈ చెల్లింపులు పూర్తి కాలేదు. రెండు సంస్థలు కేంద్ర ప్రభుత్వంలోని గనుల శాఖను ఆశ్రయించగా.. మరో రెండు హైకోర్టును ఆశ్రయించాయి. మరో రెండు కొంత మొత్తాన్ని చెల్లించి ఆగిపోయాయి. ఏడు సంస్థల నుంచి ఇంకా రూ.1.93 కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడంతో జరిమానా చెల్లింపు అంశం ఎప్పుడు తేలుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
 
 

Advertisement
Advertisement