జర్నలిస్టుల సమస్యలపై 4న ‘చలో ఢిల్లీ’

Chalo Delhi on 4th September about journalists issues - Sakshi

ఐజేయూ సెక్రటరీ జనరల్‌ అమర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 4న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌(ఐజేయూ) సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే గవర్నర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో 220 మంది జర్నలిస్టులు అకాల మరణం పొందారన్నారు.

జర్నలిస్టుల హెల్త్‌కార్డులు ఎక్కడా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో జర్నలిస్టుల అకాల మరణాల నిలుపుదల కోసమే టీయూడబ్ల్యూజే చలో ఢిల్లీకి పిలుపునిచ్చిందని చెప్పారు. జర్నలిస్టులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఎలక్ట్రానిక్‌ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. మీడియా స్వేచ్ఛను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 1న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు చెప్పారు. త్రిపుర, అస్సాంలో మాదిరిగా దేశ వ్యాప్తంగా 60 ఏళ్లు నిండిన జర్నలిస్టులకు రూ.10 వేల పింఛన్‌ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు.  

ఐజేయూ సీనియర్‌ నేత కె. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వేజ్‌బోర్డు సిఫారసులు అమలు చేయాలని చాలా కాలంగా కోరుతున్నా పరిష్కారాం కావటంలేదన్నారు.  జర్నలిస్టుల సంఘాలతో మంత్రి కేటీఆర్‌ చర్చలు జరిపినా ఫలితం కనపడటంలేదన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top