నిలిచిపోయిన 'ఇందిరమ్మ' ఇళ్ల నిర్మాణం

నిలిచిపోయిన 'ఇందిరమ్మ' ఇళ్ల నిర్మాణం - Sakshi


125 చదరపు గజాల ఇల్లు కావాలంటున్న లబ్ధిదారులు

కొత్త పథకంపైఖరారు కాని విధివిధానాలు

గందరగోళంలో అధికారులు


 ‘రెండు పడక గదులు, హాలు, వంటగది, విడిగా స్నానాలగదితో 125 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఇల్లు. దీన్ని ప్రభుత్వమే రూ.3 లక్షల వ్యయంతో నిర్మించి ఇస్తుంది’ - ఇటీవలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీ. ‘కేవలం 28 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు గదులతో నిర్మితమయ్యే ఇల్లు, దీనికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం రూ.70 వేలు’ - ఇప్పటి వరకు అమలవుతున్న ఇందిరమ్మ పథకంలో ఇంటి స్వరూపం ఇది.ఈ రెండింటిలో ఏది కావాలో ఎంచుకొమ్మంటే నిరుపేదలు, ఆ మాటకొస్తే ఎవరైనా... దేనివైపు మొగ్గు చూపుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఇంటికోసం దరఖాస్తు చేసుకునేవారే కాదు.. ఇప్పటికే ఇల్లు మంజూరై పని ప్రారంభించిన వారు కూడా టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పథకంలోనే ఇల్లు కావాలనుకుంటున్నారు. ఫలితంగా తెలంగాణవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక్కసారిగా ఆగిపోయింది. గతంలో మంజూరై నిర్మాణం ప్రారంభమైన ఈ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరో ఆరు లక్షల ఇళ్లు మంజూరైనా నిధుల సమస్యతో ఇంకా పని ప్రారంభం కాలేదు. వెరసి ఈ పదిన్నర లక్షల ఇళ్ల మంజూరును రద్దు చేసి.. వాటి స్థానంలో కేసీఆర్ ప్రకటించిన ‘125 చదరపు గజాల ఇల్లు’ కావాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా ఇప్పటి వరకు గృహనిర్మాణ శాఖను ఎవరికీ కేటాయించలేదు. దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తనవద్దనే ఉంచుకున్నారు.ఆయన ముఖ్యమైన సమావేశాలు, ఢిల్లీ టూర్లు, ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో గృహనిర్మాణ శాఖ అధికారులతో భేటీ కాలేదు. దీంతో పేదల గృహనిర్మాణ పథకం రూపురేఖలు ఎలా ఉంటాయో, దానికి అర్హులెవరో, ఆ పథకం ఎప్పటి నుంచి వర్తిస్తుందో.. తదితర వివరాలపై అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. నిజానికి, టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందే.. 125 గజాల్లో విశాలమైన ఇల్లును కేసీఆర్ ప్రకటించగానే.. ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేశారు. ఇందిరమ్మ పథకం బిల్లులు తీసుకోవటానికి కూడా ఇష్టపడలేదు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావటంతో.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేసి కొత్త పథకం కింద తమ పేర్లు నమోదు చేయాలంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.ప్రభుత్వానికి కొత్త చిక్కురైతుల రుణమాఫీ తరహాలోనే ఈ పేదల ఇళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వానికి తల నొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. పథకాన్నయితే ప్రకటించారు గాని దాని విధివిధానాలు సిద్ధం చేయలేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే పథకాన్ని వర్తింప చేస్తారా? లేక ఇప్పటికే ఇళ్లు మంజూరై పనులు మొదలు కాని వారిని కూడా అర్హులుగా గుర్తిస్తారా? పనులు మొదలైనా పూర్తికాని వాటికీ ఈ పథకం వర్తిస్తుందా? ఈ ప్రశ్నలకు అధికారుల వద్ద కూడా సమాధానం లేదు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top