
గాయపడ్డ మహిళకు ప్రథమ చికిత్స చేస్తున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్
నకిరేకల్: తాను అటుగా వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళకు భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ప్రథమ చికిత్స చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాములు గ్రామం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ మియాపూర్ నుంచి ద్విచక్రవాహనంపై నాగమణి, వెంకటేశ్వర్లు, నాగరాజు కలసి వారి స్వగ్రామమైన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇనుపాముల శివారులో జాతీయ రహదారిపై తమ ముందు ఉన్న వాహనాన్ని వారి బైక్ ఢీకొనడంతో కిందపడ్డారు. ఈ ప్రమాదంలో నాగమణికి తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తన కారును ఆపి గాయపడ్డ నాగమణికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆయన 108ను పిలిపించి నకిరేకల్ ఆసుపత్రికి ఆమెను పంపించారు. దీంతో స్థానికులు ఎంపీపై ప్రశంసలు కురిపించారు.