వివాదాస్పదంగా బిగ్‌బాస్‌ | Sakshi
Sakshi News home page

బిగ్‌ ఫైట్‌!

Published Wed, Jul 17 2019 9:22 AM

Bigg Boss Telugu Controversy on Selections - Sakshi

టీవీక్షకులను ఉర్రూతలూగించే బిగ్‌ బాస్‌రియాలిటీ షో... ప్రారంభానంతరం  వినోదంతో పాటువివాదాలను కూడా తెలుగువారికి చవి ‘చూపించడం’ అందరికీ తెలిసిందే. ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ షో.. వినోదానికి తెర లేవకుండానే వివాదానికితెర తీసింది. ఊపిరి సలపని చిత్ర విచిత్ర విశేషాలతో చిన్ని తెరపై సందడి చేయడానికి ముందేఉలిక్కిపడేలా ‘బిగ్‌’ డిబేట్‌కు దారి తీసింది. 

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌) : బుల్లి తెరపై పెద్ద సందడి బిగ్‌బాస్‌ రెండు సీజన్లు హల్‌చల్‌ చేసింది. ఈ రియాలిటీ షోతో వీక్షకుల్ని వినోదాశ్చర్యాల్లో ముంచెత్తే సెలబ్రిటీల్లో చాలావరకూ నగరవాసులే ఉంటారు. దీంతో సహజంగానే బిగ్‌ షోలో జరిగే ప్రతిదీ సిటీలో హాట్‌ టాపిక్‌గా మారుతుంటుంది.  

ఎంపిక నుంచే..
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో  బిగ్‌ బాస్‌ షో ప్రసారమవుతోంది. ఈ షో నుంచి మధ్యలో క్విట్‌ అయినా లేక ఎలిమినేట్‌ అయినవారు దీని నిర్వహణ తీరు తెన్నులను విమర్శిస్తూ మీడియాకు ఎక్కుతుండడం ఎప్పటి నుంచో ఒక రివాజుగా మారింది. చాలా కాలం క్రితమే నగరం నుం చి ముంబై వెళ్లి మరీ బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న వారు కూడా ఆ షో నిర్వహణపై విమర్శలు గుప్పించిన సందర్భాలున్నాయి. ఎంపిక ప్రక్రియ నుంచే వివాదాస్పదం అవడం అనేది మాత్రం మన నగరం నుంచే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఓ రకంగా సెలక్టింగ్‌ ప్రక్రియ నుంచే ఈ తరహా కాంట్రావర్సీలు చుట్టుముట్టడం అనేదానికి ఈ సీజన్‌ నాంది పలికింది.  

సెలబ్రిటీస్‌.. సెలక్షన్స్‌..
ఈ షో కోసం ప్రత్యేకంగా ఒక సెలక్షన్‌ టీమ్‌ ఉంటుంది. ఈ షోని చూసేవాళ్లకి అది 100 రోజులకు ఒకసారి బ్రేక్‌ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో పనిచేసేవారు మాత్రం నిరంతరం దీనికి సంబంధించిన కార్యకలాపాల్లోనే ఉంటారు. చిన్నా చితకా అంతా కలిపి ఈ బిగ్‌ షో కోసం 3వేల మంది దాకా పనిచేస్తారని సమాచారం. ఈ రియాలిటీ షో కోసం సెలబ్రిటీలను ఎంపిక చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. దీని కోసం రకరకాలుగా అన్వేషణ సాగుతుంది. తెలుగువారికి సినీ, టీవీ, సోషల్‌ మీడియాల ద్వారా సుపరిచితులైన కనీసం 100 మంది ప్రముఖులతో జాబితా తయారు చేసుకుని, వారిని సంప్రదించడం, అన్ని రోజులు సమయం కేటాయించగలరో లేదో చూడడం.. వగైరా అన్నీ అయ్యాక అందులో నుంచి 50 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేసి, రకరకాల వడపోతల అనంతరం 16 మందిని ఎంపిక చేస్తారు. దీని కోసం ముంబై నుంచి వచ్చిన బృందం, స్థానిక సిబ్బందితో సమన్వయంతో  పనిచేస్తుంది. 

క్రేజీ.. కాంట్రావర్సీ..
ఈ షోలో పాల్గొంటున్నవారు మరింత సెలబ్రిటీలుగా మారుతుండడంతో నగరంలో కాస్తో కూస్తో పేరున్న ప్రముఖులు ఏ మాత్రం వీలున్నా పాల్గొనాలనే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే క్రేజ్‌ ఇప్పుడు తొలి వివాదానికి బీజం వేసింది. ఈ షోలో పాల్గొనడానికి తమను పిలిచి అసభ్యకరమైన డిమాండ్లు పెడుతున్నారని నగరానికి చెందిన ఇద్దరు సెలబ్రిటీలు ఆరోపించడంతో పాటు ఏకంగా పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. సిటీలో  ప్రముఖ టీవీ యాంకర్, జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి తొలుత బిగ్‌ బాస్‌ నిర్వాహకులపై ఆరోపణలు సంధించారు. ‘షో’ కోసం తనను సంప్రదించిన నిర్వాహక సంస్థ ప్రతినిధులు ‘ఏ రకంగా  బాస్‌ని ఇంప్రెస్‌ చేస్తావో చెప్పమన్నారు’ అని ఆమె ఆరోపించారు. మరిన్ని అసభ్యకరమైన కామెంట్స్‌ చేశారంటూ ఆమె దీనిపై బంజారాహిల్స్‌ పోలీసులకు నలుగురు షో సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. అనంతరం నటి గాయత్రీ గుప్తా కూడా రాయదుర్గం పోలీస్‌ స్టేషన్లో బిగ్‌ బాస్‌ షో నిర్వాహకులపై దాదాపు ఇదే రకమైన ఫిర్యాదు చేశారు. తనను అడగరాని ప్రశ్నలు అడిగినట్టు ఆమె ఆరోపించారు. మొత్తం మీద ఇప్పటికే క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలతో టాలీవుడ్‌ ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, ఒక రియాలిటీ షో  అదే రకమైన ఆరోపణలకు గురికావడం మాత్రం ఇదే తొలిసారి. 

స్టార్‌ గ్రూప్‌.. నో కామెంట్‌..
ఒకరికి ఇద్దరు ఫిర్యాదులు చేయడంతో బిగ్‌ సీజన్‌– 3 ఫస్ట్‌ షోకి ముందే  హీటెక్కించింది. దీనిపై బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు ఎవరూ అధికారికంగా స్పందించడం లేదు. ప్రస్తుతం ఇది చట్ట పరిధిలో ఉందని, దీనిపై తమ లీగల్‌ టీమ్‌ రంగంలోకి దిగి సంబంధిత వ్యవహారాన్ని చూసుకుంటుందని వీరు అంటున్నారు. మరోవైపు స్టార్‌ గ్రూప్‌ వంటి పెద్ద సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ షోలో ఇలాంటివి చోటు చేసుకునే అవకాశమే లేదని ఆంతరంగిక సంభాషణల్లో వీరు స్పష్టం చేస్తున్నారు. ఈ షోకి సంబంధించి ప్రసారాలను నిలిపివేయొద్దంటూ బుధవారం బిగ్‌బాస్‌ నిర్వాహకులు సైతం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వెలువడే వరకూ ఈ షోపై సందిగ్ధత నెలకొనే అవకాశముంది.  

Advertisement
Advertisement