పెట్టుబడి సొమ్ము.. బ్యాంకర్లకే! | Banks That Are Borrowing Money That the Government Gives Farmers | Sakshi
Sakshi News home page

పెట్టుబడి సొమ్ము.. బ్యాంకర్లకే!

Jul 26 2019 11:24 AM | Updated on Jul 26 2019 11:26 AM

Banks That Are Borrowing Money That the Government Gives Farmers - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు వ్యవసాయం భారం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని గతేడాది ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తోంది. రైతులు శ్రమకోర్చి అప్పులు తెచ్చి మరీ వ్యవసాయం చేస్తున్నారు. ఏటా అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు పంటఉత్పత్తులకు ఆశించిన స్థాయిలో ధరలు పలకడం లేదు. ఫలితంగా పెట్టుబడులు కూడా రాని దయనీయ పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు.

ఇటువంటి దుర్భర స్థితిలో పెట్టుబడి సాయం వారికి ఆయువుగా మారింది. ప్రభుత్వం అంజేస్తున్న ఈ పెట్టుబడి సొమ్ము రైతు ఖాతాల్లో జమ అయ్యిందే పాపం.. ఆ సొమ్మును గత పంట రుణం లేదంటే దాని వడ్డీ కింద బ్యాంకర్లు తీసుకుంటున్నారు. కొండంత ఆశతో బ్యాంకుకు వెళ్లిన రైతులు ఉట్టి చేతులతో తిరుగుముఖం పడుతున్న దృశ్యాలు చాలాచోట్ల కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం అందజేస్తున్న సాయం.. రైతు దరికి  చేరడం లేదు. ఫలితంగా సర్కారు లక్ష్యంగా నీరుగారుతోంది.

 బ్యాంకుల కోత.. 
రైతుబంధు డబ్బులు ఇప్పుడిప్పుడే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. జిల్లాలో బ్యాంకు ఖాతా వివరాలు అందజేసిన 2.47 మంది రైతులకు రైతుబంధు సాయం అందాల్సి ఉంది. ఇప్పటిరకు సుమారు 1.50 లక్షల మంది ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమైంది. వాస్తవంగా రైతుబంధు డబ్బుల కోసం పథకం ఆరంభంలో కొందరు రైతులు ప్రత్యేకంగా ఖాతాలు తెరిచారు. వీటిని లోన్‌ ఖాతాలుగా పరిగణిస్తున్నారు. మరికొందరు రైతులు తమకు అప్పటికే ఉన్న పొదుపు ఖాతాల వివరాలను సమర్పించారు.

లోన్‌ ఖాతాల్లో జమ అయిన పెట్టుబడి సొమ్మను బ్యాంకర్లు నిర్దాక్షిణ్యంగా కోత పెడుతున్నారు. గతంలో తీసుకున్న పంట రుణం, వడ్డీ చెల్లింపు పేరిట ఈ సొమ్మును ఉంచుకుంటున్నారు. సేవింగ్‌ ఖాతాల్లో పడిన సాయంలో కోత పడటం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవంగా ఎటువంటి భేదం లేకుండా పెట్టుబడి సొమ్ము కచ్చితంగా రైతులకు అందాల్సిందే. ఈ విషయంలో ఇటు అధికారులు, బ్యాంకర్లు తీవ్రంగా విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి.

రుణ మాఫీ చేసిఉంటే..  
2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగు విడతలుగా పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రుణం మాఫీ అవుతుందన్న ఉద్దేశంతో రైతులు పంట రుణాలు, వడ్డీ చెల్లించడం లేదు. ఇటీవల తీసుకున్న పంట రుణాలను కూడా రెండోసారి అధికారిలోకి వచ్చిన ఆ పార్టీ... వెంటనే మాఫీ చేస్తుందని రైతులు కొండంత ఆశతో ఉన్నారు. ఇటువంటి వారంతా రుణ మాఫీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుండగా.. ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో గతేడాది తీసుకున్న రుణాల గడువు ముగియడంతో చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ కష్టానికోర్చి చెల్లిస్తే తమకు మాఫీ వర్తించదేమోన్న బెంగ రైతులను వెంటాడుతోంది. ఈ క్రమంలో ఖాతాల్లో జమ అయిన పెట్టుబడి సాయాన్ని బ్యాంకర్లు రైతులకు ఇవ్వడం లేదు. ఒకవేళ రుణమాఫీ అయి ఉంటే తమకు ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు.  

పెట్టుబడి సాయాన్ని బ్యాంకర్లు తీసుకోవద్దని గతంలో కలెక్టర్‌ లోకేష్‌ కుమార్‌ బ్యాంకర్లకు సూచించారు. అయినా, కలెక్టర్‌ ఆదేశాలు బ్యాంకర్లు బేఖాతరు చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రిజ్వాన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అటువంటిదేమీ లేదన్నారు. ఒకవేళ బ్యాంకర్లు పెట్టుబడి సొమ్ము ఇవ్వకుంటే.. సదరు రైతు ఖాతాను పరిశీలించాలని, అప్పుడే ఏ పద్దు కింద జమ కట్టుకున్నారో తెలుస్తుందని సమాధానమిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement