అప్పు తీర్చమంటే ఆహుతి చేశారు

Atrocity on dalit woman - Sakshi

కుమురం భీం జిల్లాలో దళిత మహిళపై దారుణం 

నిద్రిస్తుండగా కిరోసిన్‌ పోసి నిప్పు 

అర్ధరాత్రి ఇంటికి వెళ్లి అఘాయిత్యం 

చికిత్స పొందుతూ మహిళ మృతి  

ముగ్గురు నిందితుల్లో ఒకరు టీఆర్‌ఎస్‌ నాయకుడు 

సాక్షి, ఆసిఫాబాద్‌/బెజ్జూరు: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగినందుకు ఓ దళిత మహిళపై దారుణానికి ఒడిగట్టారు! ఇంట్లో నిద్రిస్తుండగా ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆ మహిళ మరణించింది. ఈ దారుణ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూర్‌ మండలం మర్తిడి గ్రామానికి చెందిన దుర్గం స్రవాంతబాయి(45) భర్త తిరుపతి ఆరేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు శంకర్, చిన్న కొడుకు శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. రెండో కొడుకు దాసుతో కలిసి మర్తిడిలో కూలి పనులు చేసుకుంటూ స్రవాంతబాయి జీవనం సాగిస్తోంది. నాలుగేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన కామెర దుర్గయ్య కుమార్తె వివాహం సందర్భంగా అతడికి రూ.47 వేలు అప్పుగా ఇచ్చింది. గత కొన్ని రోజులుగా డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా.. దుర్గయ్య జాప్యం చేస్తూ రావడంతో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. 

అర్ధరాత్రి ముగ్గురు వెళ్లి.. 
అప్పు తీర్చమన్నందుకు స్రవాంతబాయిపై దుర్గయ్య కక్ష పెంచుకున్నాడు. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, మండల కోఆప్షన్‌ సభ్యుడు బసరాత్‌ఖాన్, దుర్గయ్య భార్య చాలుబాయి, కొడుకు సాయి మంగళవారం అర్ధరాత్రి స్రవాంతబాయి ఇంటికి వెళ్లారు. నిద్రిస్తున్న ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. గట్టిగా కేకలు వేయడంతో గమనించిన కుటుంబీకులు 100కు ఫోన్‌ చేశారు. బెజ్జూరు ఎస్సై శివప్రసాద్‌ 108 ద్వారా బాధితురాలిని సిర్పూర్‌(టి)లోని సామాజిక ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో ఉన్న ఆమె నుంచి సిర్పూర్‌(టి) జూనియర్‌ సివిల్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ రామారావు సమక్షంలో పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. బసరాత్‌ఖాన్, చాలుబాయి, సాయి కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు మరణ వాంగ్మూలంలో ఆమె వెల్లడించింది. తర్వాత మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే చనిపోయింది. మృతురాలి కుమారుడు దాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 25న మృతురాలి ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. 

పిల్లలు అనాథలయ్యారు 
ఇన్నాళ్లు నా చెల్లె తన కొడుకులను తండ్రి లేకపోవడంతో ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇప్పుడు ఎవరూ లేని వారు అనాథలయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. 
– జుండే తుకారాం, మృతురాలి అన్న 

కాంగ్రెస్, దళిత నాయకుల ధర్నా 
స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, దళిత సంఘాలు, స్రవంతాబాయి బంధువులతో కలిసి మృతదేహంతో సిర్పూర్‌(టి) ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల మృతురాలి ఇల్లు దహనం చేసింది కూడా వారేనని ఆరోపించారు. స్రవాంతబాయి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. అధికార పార్టీ నాయకులు కావడంతో పట్టించుకోలేదని ఆరోపించారు. సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు. దీనిపై పోలీసులను వివరణ అడగ్గా.. అలాంటిదేమీ లేదన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top