Sakshi News home page

యువ శాస్త్రవేత్తలకు దారిచూపిన ఏఎస్ రావు

Published Sun, Sep 21 2014 1:33 AM

యువ శాస్త్రవేత్తలకు దారిచూపిన ఏఎస్ రావు

  • ఆయన ఘనత వల్లే ఈసీఐఎల్‌కు పేరు
  •   కొనియాడిన సాంకేతిక సలహా మండలి చైర్మన్ చిదంబరం
  •   ఈసీఐఎల్ ఆవరణలో అట్టహాసంగా సాగిన రావు శతజయంతి వేడుకలు
  • ఉప్పల్ : ఎలక్ట్రానిక్స్ రంగంలో నాయకుడిగా ముందుండి దేశాన్ని, యువ శాస్త్రవేత్తలను నడిపించిన డాక్టర్ ఏఎస్ రావు మానవతా వాది అని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారుడు, సాంకేతిక సలహా మండలి చైర్మన్, అణు ఇంధన శాఖ మాజీ చైర్మన్ డాక్టర్ ఆర్.చిదంబరం పేర్కొన్నారు. జగద్విఖ్యాత డాక్టర్ ఏఎస్ రావు శత జయంతి వేడుకల్లో భాగంగా ఈసీఐఎల్ కంపెనీ ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

    డాక్టర్ అయ్యగారి సాంబశివరావు జీవిత విశేషాలతో రూపొందించిన ‘ఈసీఐఎల్-న్యూస్’ మాసపత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం చిదంబరం మాట్లాడుతూ డాక్టర్ రావు మానస పుత్రిక ఈసీఐఎల్ సంస్థ పురోభివృద్ధికి ప్రతి ఉద్యోగి ముందుండాలని సూచించారు. రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో ఈసీఐఎల్ తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందని చెప్పారు.

    ఈవీఎం అంటేనే ఈసీఐఎల్ అనేవిధంగా ప్రసిద్ధిగాంచిందని అభినందించారు. డాక్టర్ రావు అప్పట్లోనే ఆధార్ కార్డు తరహాలో ‘మల్టీపర్పస్ పర్సనల్ కార్డు’ రూపకల్పనకు చేసిన కృషి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరుగున పడిందని గుర్తు చేశారు. అణు ఇంధన కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పి.రామారావు మాట్లాడుతూ ‘అప్సర’ నుంచి మొదలుకొని ‘టెస్ట్’ రియాక్టర్ వరకు అణు రియాక్టర్ల తయారీలో నేటికీ ఈసీఐఎల్‌దే పైచేయి కావడం గర్వకారణమన్నారు.
     
    ఈసీఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పి.సుధాకర్ మాట్లాడుతూ 60వ దశకంలోనే అణు రియాక్టర్‌కు కంట్రోల్ సిస్టమ్ రూపొందించి ప్రపంచ దేశాలకు దీటుగా భారత్‌ను నిలిపిన డాక్టర్ రావు చూపిన బాటలో ఈసీఐఎల్ ముందుకు సాగుతుందన్నారు. మాజీ సీఎండీలు ఎస్‌ఆర్ విజయకర్, వీఎస్ రాన్, జీపీ శ్రీవాస్తవ, వైఎస్ మయ్యా, ఎన్‌ఎఫ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఎన్.సాయిబాబా, అటామిక్ మినరల్స్ డెరైక్టర్ పీఎస్ పరిహార్, అమెరికా నుంచి వచ్చిన ఏఎస్ రావు కుటుంబ సభ్యులు వెంకటాచలం, డాక్టర్ రాంచందర్ రావు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు జి.యాదగిరి రావు, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

What’s your opinion

Advertisement