సుడిగాలి ... ప్రచారం 

All Parties Tornado Campaign In Lok Sabha Elections - Sakshi

తక్కువ గడువులో ఒక్కో రోజు రెండు సెగ్మెంట్లలో ఎంపీ అభ్యర్థుల ప్రచారం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అండగా మంత్రి, ఎమ్మెల్యేలు

కాంగ్రెస్‌ అభ్యర్థి ఒంటరి పోరాటం

కలిసికట్టుగా సీపీఎం శ్రేణులు

అన్ని పార్టీలకు దీటుగా బీజేపీ ప్రచార వ్యూహం   

సాక్షి, నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను కలిసేందుకు, వారిని ఆకట్టుకునేందుకు పోటీ పడి ప్రచారం చేస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకుంటూనే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతుంది. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, ఇక ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అంటూ కొత్త పల్లవి అందుకుంది.

టీఆర్‌ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో పోటీ చేస్తున్నాయని, టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని కాంగ్రెస్‌ తన ప్రచారంలో ప్రధాన అంశంగా చేర్చింది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో  జరిగే మేలు ఏమీ లేదని, ప్రజాగొంతుకను పార్లమెంట్‌లో వినిపించాలంటే తమనే గెలిపించాలని సీపీఎం ప్రచారం చేస్తుంది. మరో మారు మోదీ ప్రధాని కావాలని, ఆయన సారథ్యంలోనే దేశం సురక్షితంగా ఉంటుందని, అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ ప్రచారం చేస్తుంది. మొత్తంగా నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో వ్యూహాత్మక అంశాలను ఎంచుకుని ప్రచారం చేశాయి.  

కాంగ్రెస్‌..

కాంగ్రెస్‌ ప్రచారం ప్రధానంగా హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. కొంత నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఫర్వాలేదనిపించేలా సాగింది. నల్లగొండలో మాత్రం ఒక రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో పాల్గొనగా జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బైక్‌ర్యాలీ జరిపి, సభ నిర్వహించారు. ఒక విధంగా కాంగ్రెస్‌ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రచారంలో ఒంటరి పోరాటమే చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో  కేవలం హుజూర్‌నగర్‌లో మాత్రమే ఎమ్మెల్యే ఉన్నారు. ఆ ఎమ్మెల్యేనే పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి కావడంతో అన్నీ తానై ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోసం ఇతర నాయకులు ఎవరూ బయట నుంచి ప్రచారం చేయలేదు.

ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి వెళ్లారు. దేవరకొండలో జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్, నాగార్జునసాగర్‌లో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మిర్యాలగూడెంలో పార్టీ నాయకుడు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, కోదాడలో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి ప్రచారం చేస్తున్నారు. నల్లగొండలో అంతంత మాత్రంగానే ప్రచారం జరగగా, సూర్యాపేట సెగ్మెంటులో నామ మాత్రంగా కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి కోసం ప్రచారం జరగడంలేదు. ఈ ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ  కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌పై విమర్శలనే ఎక్కువగా నమ్ముకుని ప్రచారం చేసింది. చివరకు రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో కూడా ఈ రెండు పార్టీలనే టార్గెట్‌ చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీలు ఒకటేనన్న అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువ తీసుకుపోవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నించింది.

టీఆర్‌ఎస్‌..

ఈ ఎన్నికల ప్రచార పర్వంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎక్కువ దూకుడును ప్రదర్శిస్తుంది. ఆ పార్టీకి నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు చోట్ల పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థికి ప్రచారం చేసుకోవడం చాలా తేలికైంది. ఎన్ని కల ప్రచార బాధ్యతను జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డిపై పెట్టిన పార్టీ అధినేత , సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలనూ ఉరుకులు పెట్టిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కాకముందే  నియోజకవర్గ స్థాయిలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు నల్లగొండలో బహిరంగ సభలో పాల్గొని వెళ్లారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ జిల్లా మంత్రికే బాధ్యత అప్పజెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఓ మారు సీఎం కేసీఆర్‌ మిర్యాలగూడెంలో బహిరంగ సభలో పాల్గొని వెళ్లారు. ప్రతి రోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు అన్ని మండల కేంద్రాలను కవర్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి ప్రచారం చేస్తున్నారు.

గ్రామ ప్రచారాల జోలికి వెళ్లకుండా ఆయా మండలాల పరిధిలోని గ్రామాల నుంచి జనాన్ని సమీకరించి మండల కేంద్రంలో రోడ్‌ షో నిర్వహించడం, ప్రధాన కూడలిలో ప్రసంగాలతో ప్రచారం చేశారు. అభ్యర్థి వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి ఖచ్చితంగా ఉండగా, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోసం మంత్రితో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒ క నియోజకవర్గ ఇ న్‌చార్జి, రాష్ట్ర రైతు స మన్వయ సమితి చైర్మన్‌ గు త్తా సుఖేందర్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యా దవ్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మ న్‌ బండా నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు  విధిగా ఆయా సెగ్మెంట్లలో ప్రచారంలో పాల్గొం టున్నారు. సూర్యాపేట, నాగార్జునసాగర్, నల్లగొం డ వంటి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంతో పాటు ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను గు లాబీ గూటికిందకు తీ సుకువచ్చారు.

సీపీఎం..

జిల్లా పార్లమెంట్‌ ఎన్నికల చరిత్రలో రెండో సారి మహిళా అభ్యర్థిని పోటీకి పెట్టిన సీపీఎం తమ అభ్యర్థి కోసం అందుబాటులో ఉన్న తమ శ్రేణులను అన్నింటినీ రంగంలోకి దింపింది. సీపీఎం అనుబంధ సంఘాలన్నీ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారంలో పాల్గొంటున్నాయి. సీపీఎం అభ్యర్థి మల్లు లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నియోజకవర్గంలో పర్యటించి వెళ్లారు. సీపీఎం అభ్యర్థి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కూడా కావడంతో ఐద్వా జాతీయ నాయకత్వం కూడా ప్రచారంలో పాల్గొంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థి ప్రచారానికి వెళ్తుండగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారం సాగిస్తున్నారు. సీపీఎం అభ్యర్థి కోసం బృందకారత్, పుణ్యవతి వంటి మహిళా నేతలూ ప్రచారం చేశారు. సీపీఎం తన ప్రచారంలో తనకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటోంది.

బీజేపీ..

నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గంలో గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో రెండు సార్లు రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఈ సారి ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి ప్రచారం చేస్తోంది. రెండో సారి మోదీ ప్రధాని కావాలన్న అంశంపైనే ఎక్కువగా కేంద్రీకరించి ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తోంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థి ప్రచారం చేయగా, ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి విధిగా ఉంటున్నారు. నామినేషన్‌ దాఖలు రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ పాల్గొనగా ఇతర ముఖ్య నాయకులు ఎవరూ ప్రచారానికి రాలేకపోయారు. పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఒక రోజు జిల్లా కేంద్రంలో రోడ్‌ షోలో మాత్రం పాల్గొని వెళ్లారు.

ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించకున్నా, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో రోడ్‌ షోలు నిర్వహిస్తూనే, ప్రధాన కూడళ్లలో సభలు ఏర్పాటు చేసింది.  బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేంద్రకుమార్‌ స్వచ్ఛభారత్‌ రాష్ట్ర కన్వీనర్‌గా ఉండడంతోపాటు, గతంలో లైన్‌క్లబ్‌ ద్వారా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉంటేనే సాధ్యమవుతుందని ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ ప్రతీ మండలానికి ఒక ప్రచార రథాన్ని కేటాయించి వ్యూహాత్మకంగా గ్రామాల్లోనూ ప్రచారం చేసింది. మొత్తంగా నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలు తమదైన ఎజెండాతో ఓటర్లను ప్రసన్నం చేసుకుని ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు నానా తంటాలు పడుతున్నాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top