మొక్కలు పెంచేందుకు చట్టం | Act to Plants increase | Sakshi
Sakshi News home page

మొక్కలు పెంచేందుకు చట్టం

Jan 21 2016 3:27 AM | Updated on Aug 14 2018 10:54 AM

మొక్కలు పెంచేందుకు చట్టం - Sakshi

మొక్కలు పెంచేందుకు చట్టం

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని పెంచడం తప్పనిసరి చేసేలా చట్టం చేయాల్సిన అవసరం ఉందని

♦ పట్టింపులేని స్థానిక సంస్థలపై కఠిన చర్యలు
♦ ప్రతి ఒక్కరూ నాటితేనే పర్యావరణ సమతుల్యత
♦ బోసిపోయిన నేలను చూస్తే బాధ కలుగుతోంది
♦ హరితహారం సమీక్షలో సీఎం కేసీఆర్
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని పెంచడం తప్పనిసరి చేసేలా చట్టం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. స్థానిక సంస్థలు మొక్కలు పెంచే కార్యక్రమంలో మరింత భాగస్వామ్యం అయ్యేందుకు అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సి ఉందన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో తెలంగాణకు హరితహారం, ఫారెస్ట్ కాలేజీ ఏర్పాటు అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. సహజ వనాలు తక్కువైపోయిన నేపథ్యంలో విరివిగా మొక్కలు పెంచి పర్యావరణ సమతుల్యత కాపాడటమొక్కటే ప్రత్యామ్నాయ మార్గమని అన్నారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తాను హెలికాప్టర్‌లో వెళుతున్నప్పుడు కిందికి చూస్తే బాధ కలుగుతుందని, అటవీ భూముల్లో కూడా చెట్లు లేకుండా అంతా బోసిపోయినట్లు ఉందని చెప్పారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని, భూభాగంపై 30 శాతం వరకు చెట్లు ఉండేలా చూడాలన్నారు. అడవులు అంతరించిపోతున్న ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. అడవులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు పెంచాలని సూచించారు. మొక్కలు పెంచే కార్యక్రమంలో బాగా పని చేసిన వారికి వృక్షమిత్ర అవార్డులు కూడా ఇస్తామన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ద్వారా విసృ్తత ప్రచారం చేసి పర్యావరణాన్ని కాపాడుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాటాల్సిన మొక్కలను సరఫరా చేసేందుకు ఎక్కువ సంఖ్యలో నర్సరీలు నిర్వహించాలని సూచించారు.

 ఫారెస్ట్ కాలేజీలో క్లాసులు
 మెదక్ జిల్లా ములుగులో ఇటీవల శంకుస్థాపన జరిగిన ఫారెస్ట్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. కోయంబత్తూరు ఫారెస్ట్ కాలేజీలో చదువుకున్న 156 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులు అయ్యారని, తెలంగాణ, ఇతర ప్రాంత విద్యార్థులు ఈ కాలేజీలో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అమెరికాలోని అబర్న్ ఫారెస్ట్ కాలేజీ అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్నదని, ఆ కాలేజీతో పరస్పర అవగాహన కుదుర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఫారెస్ట్ కాలేజీ నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement