కొత్తగా 75 పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లు! | 75 Post Metric Hostels | Sakshi
Sakshi News home page

కొత్తగా 75 పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లు!

Jul 28 2018 2:40 AM | Updated on Jul 28 2018 2:40 AM

75 Post Metric Hostels - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని మూతబడిన ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లను పోస్టు మెట్రిక్‌ వసతి గృహాలు (కాలేజీ హాస్టళ్లు)గా మార్చాలని సంక్షేమ శాఖలు యోచిస్తున్నాయి. ప్రీ మెట్రిక్‌కు డిమాండ్‌ తగ్గడం.. పోస్టు మెట్రిక్‌కు భారీగా దరఖాస్తులు వస్తుండటంతో ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.

ఆయా శాఖల పరిధిలోని 75 ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. వీటిలో 18 హాస్టళ్లలో పది మంది లోపు విద్యార్థులుండటంతో వారిని సమీప హాస్టళ్లలో చేర్పించి సర్దుబాటు చేశారు. ఈ హాస్టళ్లను పోస్టు మెట్రిక్‌ కేటగిరీలోకి మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

డిమాండ్‌కు తగినట్లు: గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల సంఖ్య పెరగడంతో ఆ ప్రభావం ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లపై పడింది. వసతి గృహంలో ప్రవేశంకంటే గురుకులాల్లో అడ్మిషన్లకే విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 380 కాలేజీ హాస్టళ్లున్నాయి. ఒక్కో హాస్టల్‌లో సగటున 100 మందికి మించి సీట్లు లేవు. దీంతో సీట్ల సంఖ్య పెంచాలని ఒత్తిడి పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో విద్యార్థులు లేని ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లను పోస్టు మెట్రిక్‌ కేటగిరీలోకి మారిస్తే దాదాపు 10 వేల మందికి వసతి కల్పించవచ్చని, సిబ్బందిని కూడా డెప్యుటేషన్‌ చేయకుండా వారి సేవలు వినియోగించుకోవచ్చని సంక్షేమ శాఖ భావిస్తోంది. ఆ ప్రకారం 75 వసతి గృహాలను కాలేజీ హాస్టళ్లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని జిల్లా సంక్షేమాధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. వసతి గృహం మౌళిక వసతులు, నిర్వహణపై నివేదికివ్వాలని ఆదేశించారు. నివేదిక వచ్చాక హాస్టళ్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement
Advertisement