ఏడు అంతస్తులు... ప్రమిద ఆకారం

7 Storey Building For Telangana Martyrs - Sakshi

తెలంగాణ అమరవీరుల స్తూపం డిజైన్‌ ఖరారు

నమూనా ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్‌ ఆమోదం   

హుస్సేన్‌సాగర్‌ వద్ద రూ. 80 కోట్లతో త్వరలో నిర్మాణం

సాక్షి, హైదరాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను శాశ్వతంగా గుర్తుచేసుకునేందుకు ప్రమిద ఆకారంలో ఏడు అంతస్తులతో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఇందుకు సంబంధించిన నమూనా ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. మార్చి తొలి వారంలో టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ వద్ద ఈ స్తూపాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఇందులో సందర్శకుల కోసం అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం భారీ స్తూపాన్ని నిర్మించాలని నిర్ణయించడం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అత్యాధునిక హంగులతో అమరవీరుల స్తూపాన్ని నిర్మించడానికి రోడ్లు భవనాలశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

సందర్శకుల కోసం సకల సదుపాయాలు...
అమరవీరుల స్తూపాన్ని చూసేందుకు వచ్చే సందర్శకుల కోసం ఏడు అంతస్తుల ప్రాంగణంలో రెండు అంతస్తుల్లో పార్కింగ్, ఓ మ్యూజియం, అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించుకోవడానికి వీలుగా ఆధునిక హంగులతో కన్వెన్షన్‌ హాల్, ఆడియో విజువల్‌ హాల్, రెస్టారెంట్‌ తదితర సదుపాయాలను కల్పించనున్నారు. సుమారు రూ. 80 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు.

సెల్లార్లో రెండు అంతస్తులు పార్కింగ్‌ కోసం కేటాయిస్తారు. గ్రౌండ్‌ లెవెల్లో సర్వీస్‌ ఫ్లోర్‌ ఉంటుంది. మొదటిది అమరవీరుల అంతస్తు, రెండో అంతస్తును సంస్మరణ సభలు జరుపుకోవడానికి వీలుగా ఉండే కన్వెన్షన్‌ హాల్‌ కోసం వినియోగించనున్నారు. మూడో అంతస్తులో రెస్టారెంట్‌ ఏర్పాటు చేయనున్నారు. వెలుగుతున్న దీపం ఆకారంలో ఉండే ప్రమిదను గ్లోసైన్‌ విద్యుత్‌ దీపాలతో వెలిగించేందుకు వీలుగా ఫైబర్‌ మెటీరియల్‌ను వినియోగించనున్నారు.

సాగర్‌లోని బుద్ధుని విగ్రహం, ఆ వెనకవైపు ఒడ్డున ఎగురవేసిన అతిపెద్ద జాతీయ జెండా, అమరవీరుల స్తూపం ఒకే రేఖపై కనిపించేలా స్తూపం నిర్మాణం జరగనుంది. స్తూపం ప్రాంగణంలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పార్కు, వాటర్‌ ఫౌంటెయిన్‌ ఏర్పాటు చేయనున్నారు. పార్కు మధ్యలో మరో పిల్లర్‌ను ఏర్పాటు చేసి దానిపై తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా డిజైన్‌ను రూపొందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top