నల్లబోతోంది! | 6 thousand metric tonnes golmaal per month | Sakshi
Sakshi News home page

నల్లబోతోంది!

May 14 2015 11:36 PM | Updated on Oct 2 2018 8:49 PM

రేషన్ డీలర్లు పేదల పొట్టకొడుతున్నారు. బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ‘గిట్టుబాటు’ అయిన మేరకు సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రజా పంపిణీ అవస్థ
 
రేషన్ బియ్యం పక్కదారి
నెలకు 6 వేల మెట్రిక్ టన్నులు గోల్‌మాల్
బ్లాక్‌మార్కెట్‌కి తరలింపు..తిరిగి అదే బియ్యం రేషన్‌పాపులకి..
డీలర్లతో పాటు అధికారులకూ అక్రమాల్లో వాటా

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : రేషన్ డీలర్లు పేదల పొట్టకొడుతున్నారు. బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ‘గిట్టుబాటు’ అయిన మేరకు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో 7,54,714 తెల్లరేషన్ కార్డులు, 54,999 అంత్యోదయ కార్డులు కలిపి మొత్తం 8,09,713 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కరికి 6 కిలోల చొప్పున.. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికీ కిలో రూపాయికే పంపిణీ చేస్తున్నారు.

అంత్యోదయ కార్డుకు సభ్యులతో సంబంధం లేకుండా 35 కిలోల బియ్యం ఇస్తున్నారు. తెల్ల, అంత్యోదయ ఆహార భద్రత కార్డులకు కలిపి నెలనెలా 17,096.223 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల చేతిలో పెడుతోంది. ఈ బియ్యం ద్వారా 26.84 లక్షల మంది ప్రజలు రోజుకు కనీసం రెండు పూటలైనా భోజనం చేస్తారని సర్కారు భావిస్తోంది.

కానీ రేషన్ డీలర్లు ఇందులో సగం బియ్యాన్ని నొక్కేస్తున్నారు. అవే బియ్యాన్ని మళ్లీ రైస్ మిల్లుల ద్వారా ప్రభుత్వానికే అమ్ముతున్నారు. విద్యార్థి వసతి గృహాలకు, మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం పథకం అమల్లోకి వచ్చాక వీళ్ల ‘గోల్‌మాల్’ దందా మరింత సులువైంది.

 రేషన్ డీలర్లు నెలలో గరిష్టంగా పది రోజులైనా దుకాణాలు తెరవట్లేదు. ఒకవేళ తెరిచినా సమయ పాలన ఉండదు. తమ వీలు చూసుకుని నాలుగైదు గంటలు తెరుస్తున్నారు. ఇలా చేయటం కూడా పథకంలో భాగమే. దుకాణం చుట్టూ తిరిగి తిరిగి కార్డుదారులు సరుకులు తీసుకోకుండానే వెళ్లిపోతారు. కనీసం 2 శాతం మంది ఇలానే వెళ్లిపోతారని అంచనా. మరోవైపు ఆహార భద్రత కార్డు ఉన్నవారికి రేషన్ ఎక్కడ కేటాయించారో తెలియదు. దీంతో కనీసం 10 శాతం మంది కార్డుదారులు రేషన్ తీసుకోవట్లేదు.

ఇక గ్రామాల్లో కనీసం 20 శాతం మంది వలసలు, ఇతర కారణాల వల్ల రేషన్ షాపుల ముఖం చూడట్లేదు. మరో 3 శాతం మంది రేషన్ కార్డులు డీలర్ల వద్దే ఉన్నాయి. మొత్తానికి సగటున 35 శాతం మంది రేషన్‌కార్డుదారులు నెలనెలా బియ్యం పొందడం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులే లెక్క తేలుస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ 35 శాతం బియ్యాన్ని డీలర్లు తిరిగి  సివిల్ సఫ్లై శాఖకు అప్పగించాలి. నిజానికి ఆ శాఖ అధికారులు దగ్గరుండి మిగులు సరుకుల వివరాలు తీసుకొని వచ్చే నెల కోటాకు సర్దుబాటు చేయాలి. కానీ  ఇప్పటి వరకు  క్వింటాల్ బియ్యం కూడా సివిల్ సప్లై శాఖకు రికవరీ కాలేదు.

 35 శాతం.. అంటే దాదాపు 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతి నెలా పక్కదారి పడుతోంది. పౌర సరఫరాల శాఖకు బియ్యం అందిస్తున్న రైస్ మిల్లర్లు అవే బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా మళ్లీ బయట మార్కెట్‌లో కొంటూ రీసైక్లింగ్ చేస్తూ తిరిగి పౌర సరఫరాల శాఖకే పంపిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థపై నిఘా లేకపోవడంతో అక్రమార్కుల దందా దర్జాగా సాగిపోతోంది.

డీలర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి.. రైసు మిల్లుకు తరలించి.. మరపట్టి, తిరిగి దాన్ని సివిల్ సప్లై శాఖకు అప్పగించే వరకు చూసుకునేందుకు ఒక ‘వ్యవస్థ’ బలంగా పనిచేస్తోంది. ఒక్కో డీలర్ నెలకు సగటున 5 నుంచి 7 క్వింటాళ్ల బియ్యం పోగు చేస్తున్నారు. ఈ బియ్యాన్ని కిలో రూ.10 నుంచి రూ.15 చొప్పున నమ్మకస్తులైన మధ్యవర్తులకు అమ్ముకుంటున్నారు. మధ్యవర్తులు మరో రూ.2 మార్జిన్ చూసుకొని ప్రైవేటు ఏజన్సీకి చేరవేస్తున్నారు.

  ఏజెన్సీలు టోకున రైస్‌మిల్లులకు తరలిస్తున్నాయి. వీటిని మరపట్టి సన్నగా పాలిష్ చేసి రూ.26 రేటుకు మహారాష్ట్రకు అమ్ముకుంటున్నారు. మరికొంత బియ్యాన్ని నేరుగా మిల్లుల ద్వారా సివిల్ సఫ్లై శాఖకు ఇస్తున్నారు. మండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలను ఎంచుకొన్న అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తీసుకెళ్లే  ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మండల కేంద్రమైన చేగుంటలో అక్రమంగా తరలిస్తున్న రెండు బియ్యం లారీలను పట్టుకున్నారు. పౌర సరఫరాల శాఖ విచారణలో ఇవి రేషన్ బియ్యమని తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement