జల వరం!

 303 areas water connection in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలకు జలమండలి జల‘వరం’ ప్రకటించింది. డిసెంబరు నెలాఖరులోగా ఏకంగా 303 బస్తీవాసులకు ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఏర్పాటు చేయడం ద్వారా ట్యాంకర్‌ అవస్థల నుంచి విముక్తి కల్పించనుంది. ప్రధాన నగరంలోని 11 నిర్వహణ డివిజన్ల పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ పనులు చేపట్టనుంది. ఆయా బస్తీల్లో ఇప్పటికే 67 కి.మీ మార్గంలో పైపులైన్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరలో పనులు మొదలుపెట్టడంతోపాటు నూతనంగా 43,350 నల్లాకనెక్షన్లను జారీచేయనుంది. ఆ తర్వాత దశలవారీగా మహానగరం పరిధిలో మంచినీటి సరఫరావ్యవస్థ లేని కాలనీలు, బస్తీల్లో ఇదే తరహాలో ఇంటింటికీ నల్లాలను ఏర్పాటు చేస్తారు. 

రూ.7.27 కోట్లు ఆదా.. 
దశాబ్దాలుగా జలమండలి పరిధిలో ట్యాంకర్‌ నీళ్ల దందా అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. మరోవైపు బస్తీవాసులకు కన్నీళ్లనే మిగిలిస్తోంది. ఈనేపథ్యంలో ఈ అవస్థలకు చరమగీతం పలికేందుకు బోర్డు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం క్షేత్రస్థాయి మేనేజర్లు,డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు 303 బస్తీల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటికీ నల్లా ఏర్పాటుచేయాల్సిన వీధులను గుర్తించారు. వీటిల్లో ఏమేర పైపులైన్లు, జంక్షన్లు, వాల్వ్‌లు ఏర్పాటు చేయాలో గుర్తించారు. వీటి ఏర్పాటుకు రూ.11.13 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. దీంతో ఈ పనులకు మోక్షం లభించింది. ఇక ట్యాంకర్‌ నీళ్లకోసం ఏటా బోర్డు ఖర్చుపెడుతోన్న రూ.7.27 కోట్లు ఆదాకానున్నాయి. 

జలమండలికి రూ.8.72 కోట్ల ఆదాయం 
ఇక ట్యాంకర్‌ నీళ్లకు చేస్తున్న ఖర్చుతగ్గడమేకాక..ఆయా బస్తీల్లో నూతనంగా ఏర్పాటుచేయనున్న 43,350 నల్లా కనెక్షన్లతో జలమండలికి ఏటా రూ.8.72 కోట్ల ఆదాయం లభించనుంది.  

ట్యాంకర్‌ రహిత బస్తీలతో ఉపయోగాలివేబస్తీవాసులు ట్యాంకర్‌ నీళ్లకోసం రేయింబవళ్లు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూడాల్సిన దుస్థితి తప్పనుంది. 

బస్తీవాసులు ప్రధానంగా మహిళలు, చిన్నారులు ట్యాంకర్ల వద్ద గుమిగూడి తోపులాట, ఘర్షణ పడే అవస్థలు ఉండవు. 

నీటి వృథాను అరికట్టవచ్చు. 

దారితప్పే ట్యాంకర్ల ఆగడాలకు చెక్‌పడుతోంది. 

నిరుపేదల అవస్థలు తీర్చేందుకే... 
నిరుపేదల దాహార్తి తీర్చడం..వారి విలువైన సమయాన్ని ట్యాంకర్‌ నీళ్లకోసం ఎదురుచూస్తూ వృథా చేసుకుంటున్న దురవస్థను తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు గ్రేటర్‌లో ప్రస్తుతం ఉన్న 9.65 లక్షల నల్లాలకు అదనంగా పట్టణమిషన్‌ భగీరథ పథకం కింద నూతనంగా మరో లక్ష నల్లాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హడ్కో నిధులతో 11 శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో 52 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను డిసెంబరు నెలాఖరునాటికి సిద్ధంచేస్తున్నాం. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలో 1400 కి.మీ మార్గంలో నూతన పైపులైన్‌ వ్యవస్థను ఏర్పాటుచేయగా...నూతనంగా మరో 450 కి.మీ మార్గంలో పైపులైన్లు ఏర్పాటుచేసి తాగునీటి సరఫరావ్యవస్థ..ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నాం.     – ఎం.దానకిశోర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top