బీసీ గురుకుల పాఠశాల లకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నా యి. కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్ర ప్రభు త్వం గురుకుల పాఠశాలలను స్థాపిస్తోంది.
- 119 బీసీ గురుకులాలకు లభించని అద్దె భవనాలు
- మూతబడ్డ సంక్షేమ వసతి గృహాలను పరిశీలించాలని యోచన
సాక్షి, హైదరాబాద్: బీసీ గురుకుల పాఠశాల లకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నా యి. కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్ర ప్రభు త్వం గురుకుల పాఠశాలలను స్థాపిస్తోంది. ఈ పాఠశాలలను తొలుత అద్దె భవనాల్లో ఏర్పాటు చేసి తర్వాత దశలవారీగా శాశ్వత భవనాలు నిర్మించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కొత్త గురుకులాలకు అద్దె భవనాలు లభించ డంలేదు. వచ్చే ఏడాది ఏర్పాటు కానున్న 119 గురుకుల పాఠశాలలకు అద్దె భవనాలు అన్వే షించాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికా రులకు ఆదేశాలు జారీ చేసింది.
ఒక్కో గురు కులంలో 5, 6, 7 తరగతులు, ఒక్కో తరగతి లో 80 మంది, మొత్తంగా 240 మంది విద్యా ర్థులకు ప్రవేశాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించింది. ఒక్కో గురుకుల పాఠశాల ను 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనంలో ఏర్పాటు చేయాలనేది నిబంధన. 12 తరగతి గదులు, 12 డార్మెటరీలు, చాలినన్ని టాయిలెట్లు, స్నానపుగదులు, కిచెన్ రూమ్, డైనింగ్ హాల్, లైబ్రరీ, ప్రిన్సిపాల్ చాంబర్, కార్యాలయ గది, స్టాఫ్ రూమ్, ఆటస్థలం.... ఇలా అన్ని సౌకర్యాలున్న భవనాల్లోనే వీటిని ఏర్పాటు చేయాలని నిబంధనలు విధించింది.
అత్తెసరు అద్దెకు...
నిబంధనల్లో పేర్కొన్న భవనం దొరికితే విద్యార్థులకు సకల వసతులు సమకూరు తాయి. ఈ భవనానికి సబంధించి అద్దె చదరపు అడుగుకు రూ.3 చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. నిబంధనలకు తగినవిధంగా భవనాలు దొరకడంలేదని అధికారులు తలపట్టు కుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పక్కపక్కనున్న రెండు, మూడు భవనాలను అద్దెకు తీసుకుని పాఠశాలను కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. పట్టణాల్లో మాత్రం అద్దె భవనాల లభ్యత గగనంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 30 వరకు గురుకులాలు ఏర్పాటు చేస్తుండగా, భవనాల అద్దె చదరపు అడుగుకు రూ.20గా ఉంది. అద్దె భవనాలు లేకపోవడంతో మూతబడ్డ సంక్షేమ వసతిగృహాలవైపు అధికారులు దృష్టి సారిం చారు. ఈ మేరకు ఉన్నతాధికారులు జిల్లా సంక్షేమాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.