breaking news
-
బీఆర్ఎస్ నుంచి లోక్‌సభకు కొత్త వారే..
సాక్షి, హైదరాబాద్: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దాదాపుగా కొత్తవారే బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిద్దరు సిట్టింగ్‌లు మినహా మిగతా చోట్ల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొత్త నేతలు పోటీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడటం, మరికొందరు పోటీకి దూరంగా ఉండనుండటమే దీనికి కారణమని అంటున్నాయి. లోక్‌సభలో బీఆర్ఎస్కు తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉండగా.. అందులో ముగ్గురు పార్టీని వీడారు. దీంతోపాటు ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారైన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కారు గుర్తుపై పోటీచేసే విషయంలో పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఈక్రమంలో పక్షం రోజులుగా ఆయన బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యరి్థగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో.. రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరవచ్చని లేదా బీఆర్ఎస్లోనే కొనసాగుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. మిగతా నలుగురిపై చర్చ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి బీఆర్ఎస్ నుంచి మరికొందరు ఎంపీలు నిష్క్రమించవచ్చని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్ నేత (పెద్దపల్లి) కాంగ్రెస్‌లోకి.. పి.రాములు (నాగర్‌కర్నూల్), బీబీ పాటిల్ (జహీరాబాద్) బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ లోక్‌సభ అభ్యర్థులుగా బీబీ పాటిల్‌తోపాటు పి.రాములు కుమారుడు భరత్‌ను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది కూడా. బీఆర్ఎస్లోని మరో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రంజిత్‌రెడ్డి అంశంపై చర్చ జరుగుతోంది. దీంతో మొత్తంగా ఇప్పటికే ఐదుగురు సిట్టింగ్‌ల భవితవ్యంపై స్పష్టత వచ్చిట్లయింది. మిగతా నలుగురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు (ఖమ్మం), పసునూరు దయాకర్ (వరంగల్), మాలోత్ కవిత (మహబూబాబాద్), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్)ల అడుగులు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. సర్వేల ఫలితాలు, ఎన్నికల ఖర్చును దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు పలువురు నేతలు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. మరికొందరూ పోటీకి దూరం? ప్రస్తుతం తన కుమారుడి వివాహ వేడుకల ఏర్పాట్లలో ఉన్న నామా నాగేశ్వర్రావు మరోమారు బీఆర్ఎస్ నుంచి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. మిగతా ముగ్గురిలో పసునూరు దయాకర్, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలకు తిరిగి బీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో ప్రస్తుతానికి నామా నాగేశ్వర్రావు (ఖమ్మం) మినహా మిగతా వారంతా పార్టీకి దూరం కావడమో లేదా పోటీ నుంచి నిష్క్రమించడమో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీలు, కొత్తవారికి పోటీ చాన్స్! వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఈ కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా భేటీలు ముగిశాక వారం పది రోజుల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో అనుసరిస్తున్న వ్యూహాన్ని నిశితంగా గమనిస్తున్న కేసీఆర్.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీకి కొత్త రక్తం ఎక్కించే ఉద్దేశంతో కొంత యువ నాయకత్వానికి కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల వ్యయాన్ని భరించే శక్తి ఉన్న వారికోసం బీఆర్ఎస్ అన్వేషణ సాగిస్తున్నట్టు తెలిసింది. -
ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రయాణం
షాద్‌నగర్ (హైదరాబాద్)/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహ బూబ్‌నగర్‌లో నిర్వహించిన గౌడ సంఘం సమావేశానికి వెళ్లేందుకు.. ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వరకు బస్సులో ప్రయాణించారు. నారాయణపేట డిపో బస్సు ఎక్కిన మంత్రి మహిళా ప్రయా ణికులతో ముచ్చటించారు. డ్రైవర్ ఇయర్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న విషయాన్ని గమనించిన పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బస్సులోని మహిళా కండక్టర్‌ను ఈ విషయమై అడి గారు. డ్రైవర్ చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని తమాషా చేస్తున్నాడా?.. అలా మాట్లాడితే సస్పెండ్ అవు తాడు తెలుసా?.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదు కదా? అన్నారు. ‘కాంగ్రెస్ సర్కార్ ఆయా.. ఏ సబ్ కా సర్కార్ హై’.. అంటూ ఓ ముస్లిం ప్రయాణికురాలితో మంత్రి ముచ్చటించారు. పెన్షన్ వస్తుందా? అని ప్రశ్నించగా.. రావడం లేదని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నావా? అని అడిగారు. లేదని ఆమె చెప్పడంతో వెంటనే దరఖాస్తు చేసుకోమని మంత్రి పొన్నం సూచించారు. కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు రావాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని.. అదేవిధంగా కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
ఎన్డీఎస్ఏ చెప్పిందే వింటాం
సాక్షి, హైదరాబాద్: ‘మెడిగడ్డ బ్యారేజీలోని ఒక్క పిల్లర్ కుంగితేనే ఇంత రాద్దాంతమా?’అంటూ బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రం, రైతాంగ ప్రయోజనాలను పణంగా పెడుతూ మాట్లాడటం దురదృష్టకరమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎన్ఏ నిపుణుల కమిటీ సూచనలనే పాటిస్తుందని, బీఆర్ఎస్ నేతల మాటలకు విలువ లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలన కోసం ఈ నెల 6న నిపుణుల కమిటీ రానుందని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని ఎన్డీఎస్ఏ నిపుణులు పరిశీలించి నీటిని ఖాళీ చేయాలని సూచించారని, బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తూ మళ్లీ నీటితో నింపాలని డిమాండ్ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని ఉత్తమ్ విమర్శించారు. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ.. ఇలా అన్ని విషయాలల్లో గత ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కడంతో రూ. 94 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యల్లో చిక్కుకుందన్నారు. -
రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, ఆదిలాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: ప్రదానమంత్రి నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం సోమవారం రాష్ట్రానికి రానున్నారు. మొత్తం రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు (4న ఆదిలాబాద్‌లో రూ.6,697 కోట్లు, 5న సంగారెడ్డిలో రూ.9,021 కోట్లు) శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని సభలు పార్టీ యంత్రాగానికి మరింత ఊపు తెస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి ప్రధాని సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కేందానికి చేరుకుంటారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. కాగా మోదీ రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ రెండు వేదికలు ఏర్పాటు చేయగా, అందులో మొదటి వేదిక నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పాల్గొంటారు. అనంతరం రెండో వేదికపైకి వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందులో కిషన్‌రెడ్డితో పాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు బండి సంజయ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొననున్నారు. ఆదిలాబాద్‌లో మోదీ సుమారు రెండు గంటల పాటు ఉండనున్నారు. ఇక్కడినుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి నాందేడ్‌కు, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లనున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో సివిల్ ఏవియేషన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (సీఏఆర్ఓ)ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం సంగారెడ్డి పర్యటనలో పాల్గొంటారు. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటన పురస్కరించుకుని మొత్తం 2 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇలావుండగా సోమవారం ఆదిలాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై దాడి! రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ల విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు ఈ రెండు పార్టీలు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయంటూ తీవ్రస్థాయిలో ఎండగట్టడం ద్వారా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. పదేళ్లుగా తమ ప్రభుత్వం దేశాభివృద్ధికి పాటుపడుతుంటే...కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీలు వారసత్వ రాజకీయాలతో పాటు అవినీతి, నిరంకుశ రాజకీయాలు చేస్తున్నాయంటూ విరుచుకుపడనున్నట్టు సమాచారం. పలు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, దేశ సర్వతోముఖాభివృద్ధికి, ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టేందుకు తాము చేస్తున్న కృషిని వివరించనున్నారని సమాచారం -
కాంగ్రెస్‌పై వ్యతిరేకత: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సర్కారు ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. వాటి కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆదివారం తెలంగాణ భవన్‌కు విచ్చేసిన కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ పార్టీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఖరారు చేశారు. అయితే ఆదివారం అష్టమి కావడంతో అధికారికంగా ప్రకటించలేదు. సోమవారం మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు కరీంనగర్, పెద్దపల్లితో పాటు మరికొన్ని స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించనున్నారు. కాగా పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. రెగ్యులరైజేషన్ ఉచితంగా చేయాలి విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే మేలు జరుగుతుందనే చర్చ ప్రజానీకంలో మొదలైందని కేసీఆర్ చెప్పారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని, నేతలు, కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు. అంతా కలిసి పని చేయాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ విషయంలో గతంలో బీఆర్ఎస్ను కాంగ్రెస్ విమర్శించిందని, ప్రజల రక్తం పీలుస్తున్నారని వ్యాఖ్యానించిన వాళ్లు ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. పైగా అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ కింద ఉచితంగా ప్లాట్లు, లే అవుట్ల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఓ పన్ను పాడైందని పళ్లన్నీ పీకేయలేం కదా! ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజమని, మిడ్ మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకొని పరిష్కరించాలని, రాజకీయం చేస్తామంటే ప్రజలు గమనిస్తారని అన్నారు. ఒక పన్ను పాడైతే.. చికిత్స చేసుకుంటాం తప్ప.. మొత్తం పళ్లన్నీ పీకి వేసుకోలేం కదా? అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల వారీగా బస్సు యాత్రలు చేయాలని, మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని నేతలకు సూచించారు. బీఆర్ఎస్కు గెలుపోటములు కొత్త కాదన్న ఆయన.. ఓడితే కుంగి పోయేది లేదు.. గెలిస్తే పొంగి పోయేది లేదని అన్నారు. కాంగ్రెస్‌లో వాళ్ల కుంపటి వాళ్ళు సర్దుకోవడానికే టైం సరిపోతుందని విమర్శించారు. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం కచ్చితంగా యాదికొస్తామని, ధైర్యంగా ఉండాలని నాయకులకు భరోసా ఇచ్చారు. మెజారిటీ సీట్లు మనవే.. ముందుగా కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నాయకులతో మాట్లాడిన కేసీఆర్.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఈ నెల 12న భారీ బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించారు. సభను విజయవంతం చేసే బాధ్యతను గంగుల కమలాకర్‌కు అప్పగించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలువబోతున్నదని చెప్పారు. అలాగే మెజారిటీ స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి.. ఎవరీ 'మాధవి లత'?
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం మజ్లిస్ కంచు కోటగా ఉంది. 1984 నుంచి 2004 మధ్య సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఆరు సార్లు ఎంపీగా గెలిచిన రికార్డ్ సృష్టించారు. ఆ తరువాత 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా అసదుద్దీన్ గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అసదుద్దీన్‌ను ఓడించడానికి బీజేపీ గట్టి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే బీజేపీ ప్రకటించిన ఎంపీల తొలి జాబితాలో 'కొంపెల్ల మాధవి లత'ను (Kompella Madhavi Latha) హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకీ ఈమె ఎవరనేది ఈ కథనంలో చూసేద్దాం.. కొంపెల్ల మాధవి లత హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఒకటైన 'విరించి'కి చైర్మన్. అంతే కాకుండా బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకుని, నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ.. ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీ లత.. నిజాం కాలేజీలో బ్యాచలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఈమె NCC క్యాడెట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది, సుమారు వందకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న మాధవి లత అనేక ఇంటర్వ్యూలలో పద్ధతులు, సంప్రదాయాలు, పిల్లలను ఎలా పెంచాలి అనే చాలా విషయాలను వెల్లడిస్తూ.. ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా కరోనా సమయంలో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించి భాగ్యనగరంలో దాదాపు అందరికి సుపరిచమైంది. ఇకపొతే బీజేపీ, హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందటానికి నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించింది. ఈ అస్త్రం అయితే రాబోయే ఎన్నికల్లో ఎమ్ఐఎమ్, ఒవైసీల అధిపత్యానికి చెక్ పెట్టనుందా.. లేదా?, లేక మళ్ళీ ఒవైసీల పార్టీ గెలుపొందుతుందా.. అనేది సమాధానం లభించాల్సిన ప్రశ్నగా ఉంది. ఈ ప్రశ్నకు రాబోయే రోజుల్లో జవాబు దొరుకుతుంది. -
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతోందని.. ఈ నెల 12న కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి తెచ్చారన్న కేసీఆర్.. బీఆర్ఎస్తో మేలు జరుగుతుందనే చర్చ ప్రజల్లో మొదలైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ పట్టించుకోవద్దని.. నేతలంతా ఐక్యంగా పనిచేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలకు కొద్ది రోజుల్లోనే యాదికొస్తాం.. ఎల్ఆర్ఎస్ గతంలో మనం ప్రకటిస్తే ప్రజల రక్తం పీల్చుతున్నామంటూ కామెంట్ చేసినోళ్లు.. నేడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ల కుంపటి వాళ్లు సర్దుకోవడానికి టైం సరిపోతుంది. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం కచ్చితంగా యాదికొస్తాం. బీఆర్ఎస్కు గెలుపు, ఓటములు కొత్త కాదు. కుంగి పోయేది...పొంగి పోయేది ఏమీ లేదంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా! కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం.. మిడ్‌మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశాం. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి. ఒక్క పన్ను పాడైతే చికిత్స తీసుకుంటాం.. మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు -
ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. 12న కరీంనగర్ సభ ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికల సమర శంఖారావాన్ని బీఆర్ఎస్ పూరించనుంది. రోడ్ షోలు, బస్సు యాత్రలతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. రేపు(సోమవారం) నలుగురు లేదా ఐదుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్న బీఆర్ఎస్.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇదీ చదవండి: BJP జాబితా.. తెలంగాణ 9 మంది అభ్యర్థులు వీళ్లే -
పొలిటికల్ ట్విస్ట్.. సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం వెంకట్రావ్ తన కుటుంబసభ్యులతో వెళ్లి సీఎం రేవంత్‌ను కలిశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. దీంతో, ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎంను వెంకట్రావ్ కలవడం ఇది రెండోసారి. అనంతరం, వెంకట్రావ్ మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశాను. భద్రాచలం రామాలయం అభివృద్ధి. ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలి. భద్రాచలం పట్టణంలో డంపింగ్ యార్డు సైతం లేదు. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం రేవంత్‌ను కలిశాను అని అన్నారు. -
బీజేపీ లిస్ట్‌లో ‘నో’ ప్లేస్.. సోయం బాపురావు సంచలన కామెంట్స్
సాక్షి, ఆదిలాబాద్: తనకు లోక్‌సభ స్థానం నుంచి టికెట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారని బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన కామెంట్స్ చేశారు. నా బలం.. బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, బీజేపీ హైకమాండ్ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటు, తెలంగాణలో కూడా తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు తొలి లిస్టులో రాలేదు. ఆదిలాబాద్ గురించి హైకమాండ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక, తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో బాపురావు స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో బాపురావు ఆదివారం మీడియాతో మాట్లాడూతూ.. నాకు టికట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారు. ఆదివాసీ నేతకు టికెట్ రాకుండా పావులు కదిపారు. నేను ఎక్కడో గెలుస్తానో అనే భయం వాళ్లకు ఉంది. కొమ్మపై ఆధారపడే పక్షిని కాదు నేను.. రెక్కల మీద ఆధారపడిన పక్షిని.. నేను స్వతహాగా ఎగురగలను. టికెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటాను. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు నాదే.. గెలిచేది కూడా నేనే. పార్టీ ఏదనేది అధిష్ఠానం ఆలోచించుకోవాలి. 2019లో టికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం ఇప్పుడు పోటీపడుతున్నారు. ఏ బలంలేని సమయంలో నా సొంత బలంతో బీజేపీకి విజయం అందించాను. జడ్పీటీసీలను, ఎంపీపీలను, చివరికి నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించాను. నా బలం, బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది. రెండో లిస్ట్‌లో నాకు టికెట్ వస్తుందని భావిస్తున్నాను. ఎవరి మీద ఆధారపడే నేతను నేను కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
పాలమూరు ‘లోకల్’ పోరుకు నేడు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలోని ఓ ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. 2022 జనవరిలో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరేళ్ల పదవీ కాలం 2028 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే గత ఏడాది చివర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కసిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సుమారు నాలుగేళ్ల కాలానికి ఉప ఎన్నిక జరగనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఉండగా, మరో స్థానానికి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్దే ఆధిపత్యం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలో ఓటర్లుగా పరిగణించబడతారు. జిల్లాలో మొత్తం 1,450 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఉండగా, వీరిలో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. దీంతో తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు కొత్త ఆశావహులతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో జరుగుతున్న ఎన్నికను అధికార కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది. -
‘కోడ్’ పేరుతో గ్యారంటీలను అటకెక్కించనుంది
హుజూరాబాద్: ‘మరో 10 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాబోతోంది. ఆరు గ్యారంటీలు అటకెక్కబోతున్నాయి. మేం హామీలను అమలు చేయాలనుకున్నం.. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది.. ఎన్నికలైపోంగనే అమలు చేస్తమని కాంగ్రెస్ నేతలు కాకమ్మ కథలు చెప్పబోతున్నరు’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లో శనివారం ఆయన ప్రజాహిత యాత్ర కొనసాగింది. జమ్మికుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో సంజయ్ మాట్లాడారు. తమ పాలనలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌తో కుమ్మక్కై 6 గ్యారంటీలపై నోరు మెదపడటం లేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మెదీ మళ్లీ ప్రధాని కాబోతున్నారని గర్వంగా చెబుతున్నామని, మరి కాంగ్రెస్ గెలిస్తే ప్రధాని ఎవ రో ప్రకటించే దమ్ముందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్య లు తీసుకోవడం లేదని నిలదీశారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పుడు 80 రోజులు పూర్తయి నా అవి అమలు కాలేదని విమర్శించారు. ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని, గ్యాస్ కనెక్షన్ మహిళల పేరిట ఉంటేనే గ్యారంటీలు అంటూ ముడిపెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కాగా, సంజయ్‌ను ఎంపీ అభ్యరి్థగా బీజేపీ ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో సంబురాలు చేసుకున్నాయి. -
పాలమూరు నుంచే కాంగ్రెస్ శంఖారావం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల కంటే ముందే ఎన్నికల శంఖారా వాన్ని పూరించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత ఇలాకా అయిన పాలమూరు వేదికగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నా రు. ఈ మేరకు ఈ నెల 6న మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ‘పాలమూరు ప్రజాదీవెన’పేరిట భారీ బహిరంగ సభకు కసరత్తు చేపట్టారు. ఈ సభకు ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు సహచర మంత్రులు హాజరుకానున్నారు. గత అసెంబ్లీ ఎన్ని కల్లో ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 12 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల్లోనూ పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ఈ సభకు సుమారు లక్ష మంది జనసమీకరణకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘పాలమూరు’అస్త్రంగా.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటైనా గెలవాలని సీఎం రేవంత్ ఇటీవల సవాల్ విసిరిన విషయం విదితమే. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోని పలు పియర్లు కుంగిపోవడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్యనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలో మేడిగడ్డ పేరిట కాళేశ్వరం బాట పట్టగా అదే రోజు పోటీగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను పరిశీలించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో జాప్యం చేసి పాలమూరు ప్రజలను అన్యాయానికి గురిచేసిందని ఆరోపించారు. అలాగే పాలమూరు ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం రేవంత్‌కు నివేదిక అందజేశారు. దీన్నిబట్టి ఎన్నికల వేళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజె క్టునే ప్రధాన అస్త్రంగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో చేపట్టిన ‘పాలమూరు న్యాయయాత్ర’ఈ నెల 6న ముగియనున్న నేపథ్యంలో పాలమూరులో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకావాలని వంశీచంద్‌రెడ్డి శనివారం సీఎం రేవంత్‌ను కలసి ఆహ్వానించారు. -
బీజేపీ లోక్‌సభ ‘సై’రన్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అందరి కన్నా ముందుగా లోక్‌సభ ఎన్నికలకు ‘సై’రన్ మోగించింది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లకుగాను 9 స్థానాలకు అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. ఇందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్)లకు తిరిగి అవే స్థానాలు ఇచ్చారు. తాజాగా పార్టీలో చేరిన ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో బీబీ పాటిల్‌కు జహీరాబాద్, పి.రాములు కుమారుడు భరత్‌కు నాగర్‌కర్నూల్ సీటు దక్కాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌కు మల్కాజిగిరి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి చేవెళ్ల, బూర నర్సయ్యగౌడ్‌కు భువనగిరి, పార్టీ నేత మాధవీలతకు హైదరాబాద్ టికెట్లను ప్రకటించారు. ఏకాభిప్రాయం రాక.. పెండింగ్ తొలి జాబితాలో ప్రకటించిన 9 సీట్లలో 5 బీసీలకు కేటాయించారు. దీనితో మిగతా 8 సీట్లలో ఒకటి మాత్రమే బీసీలకిచ్చే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెండింగ్‌లో పెట్టిన సీట్లలో 4 జనరల్, 4 రిజర్వ్డ్ (రెండేసి చొప్పున ఎస్సీ,ఎస్టీ) స్థానాలు ఉన్నాయి. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ సీట్లలో అభ్యర్థులపై ఏకాభిప్రా యం కుదరకపోవడంతో పెండింగ్ లో పెట్టాలని జాతీయ నాయకత్వ ం నిర్ణయించింది. ఈ సీట్లలో ఒకరి కంటే ఎక్కువ మంది పోటీపడుతుండడం, రాష్ట్ర పార్టీ నేత లు వేర్వేరు వ్యక్తులకు మద్దతు తెలుపుతుండడంతో ఎటూ తేల్చ లేని పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. ఈ స్థానాలతోపాటు ఖమ్మం, నల్లగొండ, వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్ సీట్లకు సంబంధించి.. పార్టీలో ప్రస్తుతమున్న వారిలో కంటే బలమైన నేతలెవరైనా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి వస్తారా? అని వేచిచూస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎంపీతోపాటు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆయా స్థానాల్లో పార్టీపరంగా అంతగా బలం లేనందున.. అన్నీ కుదిరితే వీరిని చేర్చుకుని పార్టీ తరఫున బరిలో నిలపాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. మురళీధర్‌రావుకు దక్కని చాన్స్.. జాతీయ స్థాయిలో పలుకుబడి ఉండి పార్టీలో సీనియర్ నేతగా, మధ్యప్రదేశ్ రాష్ట్రపార్టీ ఇన్చార్జిగా ఉన్న పి.మురళీధర్‌రావుకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం కూడా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో సన్నాహాలు చేసుకోవాలని సూచించిందని, దీనితో ఏడాదిన్నరగా ఆయన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రచారం చేసుకున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ సీనియర్ నేత, బీసీల్లో పలుకుబడి ఉన్న ఈటల రాజేందర్ మల్కాజిగిరి నుంచి పోటీకి ఉత్సాహం చూపడంతోపాటు టికెట్ ఇస్తే గెలుస్తానని నాయకత్వాన్ని ఒప్పించినట్టు వివరిస్తున్నాయి. ఇక రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల్లో కొందరు అభ్యంతరాలు చెప్పడంతోపాటు పలు సీట్లలో కొత్త పేర్లను ప్రతిపాదించడంతో ఇతర స్థానాల్లో అభ్యర్థుల ఖరారు పెండింగ్‌లో పడినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పలు సీట్లపై పీటముడి ► ఆదిలాబాద్ సీటు కోసం సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుతోపాటు రమేశ్ రాథోడ్ పేరును, టికెట్ ఇస్తామంటే పార్టీ చేరేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చిన మాజీ ఎంపీ గోడం నగేశ్ పేరును బీజేపీ పెద్దలు పరిశీలించినట్టు తెలిసింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ సీటును పెండింగ్ పెట్టారని పార్టీ నాయకులు చెప్తున్నారు. ►మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు దాదాపు ఖరారైనా.. మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కూడా ఇక్కడ పోటీకి గట్టిగా ప్రయత్నిస్తుండటంతో పీటముడి పడినట్టు సమాచారం. ► మెదక్ నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు వైపు జాతీయ నాయకత్వం కొంత మొగ్గినా.. ఒకరిద్దరు రాష్ట్ర నేతలు అంజిరెడ్డి పేరును ముందుకు తెచ్చినట్టు తెలిసింది. ► పెద్దపల్లి, వరంగల్ ఎంపీ టికెట్లకు హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సిద్ధమైనట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ► ఇక నల్లగొండలో పోటీకోసం రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. మహబూబాబాద్ కోసం ఓ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ► పెండింగ్‌లో ఉన్న ఎనిమిది సీట్లకుగాను రెండో జాబితాలో మరో మూడు, నాలుగు పేర్లను ప్రకటిస్తారని.. మిగతా వాటికి చివర్లో ఖరారు చేయనున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. -
BJP జాబితా.. తెలంగాణ 9 మంది అభ్యర్థులు వీళ్లే
ఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. మొత్తం 195 స్థానాల్లో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీళ్లలో ముగ్గురు సిట్టింగ్‌లే ఉండగా.. ఓ సిట్టింగ్‌కు మొండిచేయి ఎదురైంది. సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్‌లే పోటీ చేస్తారని తెలిపింది. అలాగే.. చేవెళ్ల నుంచి కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్, నాగర్‌కర్నూల్ నుంచి పీ.భరత్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్‌కు అవకాశం ఇచ్చింది. ఇక హైదరాబాద్ నుంచి కొంపెల్ల మాధవీలతకు ఛాన్స్ ఇచ్చారు. హాట్ నియోజకవర్గం భావిస్తున్న మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇక.. ఇటీవలె బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములుకి మొండిచేయి ఎదురైంది. ఆ స్థానంలో పీ.భరత్‌కు అవకాశం ఇచ్చారు. ఇక తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ప్రకటనతో.. ఆదిలాబాదు, పెద్దపల్లి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థుల ప్రకటనను బీజేపీ పెండింగ్‌లో ఉంచినట్లయ్యింది. సంబంధిత వార్త: టార్గెట్ 370.. బీజేపీ హాట్ ఫస్ట్ లిస్ట్ -
తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తాం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన అభివృద్ధి భారతావనికి మోదీ గ్యారంటీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లకు పైగా గెలుస్తుందని తెలిపారు. విజయ సంకల్ప యాత్రతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నిండిందని చెప్పారు. మోదీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్పారు. ఈ ఎన్నికలకు ‘మరోసారి మోదీ సర్కారు‘ అనేది మా పార్టీ నినాదమని తెలిపారు. బీజేపీకి ప్రజలు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నామని అన్నారు. ప్రధాని మోదీ 4న అదిలాబాద్, 5న సంగారెడ్డిలో పర్యటిస్తారని తెలిపారు. ఆదిలాబాద్‌లో రూ. 6,697 కోట్లు, సంగారెడ్డిలో రూ. 9,021 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని చెప్పారు. -
యాదాద్రి కాదు ఇకపై యాదగిరి గుట్టనే: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి కాదు ఇకపై యాదగిరిగుట్టగా పిలువబుడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ విడుదల చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. ఆయన శనివారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడాడు. ‘ఎమ్మెల్యే కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్ చాటు కొడుకే. నేను ఉద్యమాలు చేసి వచ్చాను. మేం జీరో బిల్ ఇచ్చినట్టు.. కేటీఆర్‌కి జీరో నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వృథా. ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీలోకి పోతాడు. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదు?. ... కాళేశ్వరం పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజలే కేసీఆర్‌ను నామరూపాలు లేకుండా చేశారు. ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోంది. భువనగిరి నుండి పోటీ చేయమని రాహుల్ గాంధీని కోరాను. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో.. దక్షిణాదిలో టాప్ మెజార్టీ వస్తుంది. మోదీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. -
రేపు బీజేపీ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కా నుంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర పడడంతో మార్చి 3న తొ లి జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా విడుదల చే యనుంది. గురువారం రాత్రి 10:50 గంటలకు ప్రారంభమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సుమారు నాలుగు గంటల పాటు జరిగింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్ర నాయకత్వాలు తయారు చేసిన అభ్యర్థుల జాబితాలపై ఆయా రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో విడి విడిగా భేటీ అయి కూలంకషంగా చర్చించింది. అందులో భాగంగా తె లంగాణకు సంబంధించి ఆరు స్థానాలకు అభ్యర్థులపై సీఈసీ ఏక గ్రీ వంగా ఆమోదముద్ర వేసిందని సమాచారం. సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజా మాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్‌లు మరోసారి బరిలో దిగేందుకు గ్రీ న్ సిగ్నల్ ఇచ్చారు. ఇక భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి పోతుగంటి భరత్‌ల అభ్యర్థిత్వాలపై కూడా సీఈసీ ఆమోదముద్ర వేసిందని సమాచారం. ఆచితూచి నిర్ణయం బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నందున వివిధ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావ్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారని తెలిసింది. అయితే జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారం ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకోవడంతో.. ఆ స్థానంలో బీజేపీ ఎంపీగా ఆయనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక ఎక్కువ అభ్యర్థులు పోటీ పడుతున్న మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ సహా ఇతర స్థానాలపై మరోసారి చర్చించిన తర్వాతే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కారు దిగనున్న మరో ఎంపీ! ఖమ్మం నుంచి బరిలో దిగేందుకు మరో బీఆర్ఎస్ ఎంపీ కాషాయ కండువా కప్పుకొనే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధమౌతున్నారని సమాచారం. -
సరైన స్టడీస్ లేకుండానే మేడిగడ్డ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: ‘‘భూగర్భంలో రాతిపొరల నిర్మాణ క్రమాన్ని తెలిపే కీలకమైన ‘జియోలా జికల్’ ప్రొఫైల్ స్టడీ లేకుండానే మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. అందువల్లే జియోలాజికల్ ప్రొఫైల్‌తో కూడిన సెక్షనల్ డ్రాయింగ్స్‌ను ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి ఇవ్వలేకపోయాం. అంతేకాదు.. బ్యారేజీ నిర్మాణ సమయంలో థర్డ్ పార్టీ పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ నిర్వహణ జరగలేదు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీకి తనిఖీలు నిర్వహించలేదు. అందువల్ల ఈ వివరాలను కూడా ఎన్డీఎస్ ఏకు ఇవ్వలేకపోయాం..’’ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఎన్డీఎస్ఏకు కాంగ్రెస్ ప్రభుత్వం సమా చారం ఇవ్వలేదని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిందంటూ కాంట్రాక్టర్‌కు తప్పుడు మార్గంలో సర్టిఫికెట్లు జారీ చేశారని, వాటి వెనక ఏదో మతలబు ఉందని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. బ్యారేజీలోని ప్రతిబ్లాక్ నిర్మాణం పూర్తయినట్టు ధ్రువీకరించే సర్టిఫికెట్లను గత ప్రభుత్వం సిద్ధం చేయలేదని.. అందుకే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లను ఎన్డీఎస్ఏకు అందజేయలేదని వివరించారు. ఈ అంశాలన్నింటినీ ఎన్డీఎస్ఏకు రాతపూర్వకంగా కూడా తెలిపామన్నారు. ప్రాజెక్టులో అవకతవకలపై న్యాయ సలహా తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నామని చెప్పారు. అధికారులపైనా క్రిమినల్ కేసులు.. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించినట్టు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని, దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని ఉత్తమ్ తెలిపారు. బాధ్యులైన అధికారులను గుర్తించి, వారి పేర్లతో సహా నివేదిక ఇస్తామని విజిలెన్స్ చెప్పిందని.. ఆ తర్వాత వారిపై క్రిమినల్ కేసులు ఉంటాయని వెల్లడించారు. గత ఏడాది వరదల్లో నీట మునిగి దెబ్బతిన్న కన్నెపల్లి పంపుహౌజ్ పునరుద్ధరణ తమ ప్రభుత్వం వచ్చాక పూర్తయిందని చెప్పారు. ‘‘తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ తేల్చినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. కమీషన్ల కోసమే బ్యారేజీ నిర్మాణాన్ని మేడిగడ్డకు మార్చింది. ఇదే విషయాన్ని వెదిరె శ్రీరామ్ కూడా చెప్పారు. ప్రాజెక్టు వ్యయాన్ని ఎంత పెంచితే అంత కమీషన్లు వస్తాయని కుట్రపూరిత ఆలోచనతో గత సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నెల రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించనుందని.. ఆ తర్వాత మరమ్మతులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎన్డీఎస్ఏ ప్రక్రియను వేగిరం చేయాలని కోరేందుకు తాను ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ కారు స్క్రాప్‌కే.. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కోసం బీఆర్ఎస్ నేతలతో వెళ్తున్న బస్సు టైర్ పేలిన ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘బీఆర్ఎస్ కారు టైర్లు బరస్ట్ అయ్యాయి. ఇక తుక్కు కింద పోవాల్సిందే..’’ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. మేడిగడ్డ నష్టాన్ని చూశాకైనా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాళేశ్వరంలో కేంద్రం పాపం తక్కువేం కాదు.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం చేసిన పాపం తక్కువేమీ కాదని ఉత్తమ్ విమర్శించారు. ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ పెట్టుబడి అను మతులు ఇవ్వలేదని వెదిరె శ్రీరామ్ అంటు న్నారని.. మరి ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్ల రుణాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ, బ్యాంకులు ఎలా ఇచ్చా యని నిలదీశారు. దేవాదుల ప్రాజెక్టు డిజైన్లు సరిగ్గా లేవని వెదిరె శ్రీరామ్ అంటున్నారని.. మరి ఆ ప్రాజెక్టుకు కేంద్రం ఏఐబీపీ పథకం కింద రూ.2,500 కోట్లు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌కు మరమ్మతులు చేపడ తామని, ఇందుకు సీఆర్పీఎఫ్ బలగాలను తొల గించాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కులేదు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. కాళేశ్వరం అవినీతి విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును కాకుండా కేవలం మేడిగడ్డ బ్యారేజీని మాత్రమే పట్టుకుందన్నారు. బీఆర్ఎస్ను కాపాడుతోంది కాంగ్రెస్ మాత్రమేనని, లేకపోతే బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయేదన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఇతర నాయకులతో కలిసి కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్తో బీజేపీ కుమ్మక్కయిందని విమర్శలు చేస్తున్నారని, అయితే అందులో ఏమా త్రం వాస్తవం లేదన్నారు. కేసీఆర్ రూ.ఏడు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్తే, ప్రజలు ఇబ్బందులు పడకూ డదని కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీని 14, 15 ఎంపీ సీట్లలో గెలిపిస్తే 9 లక్షల కోట్లు కాదు, రూ.25 లక్షల కోట్లు తీసుకొస్తా మని చెప్పారు. తనకు ఇంకా చేవెళ్ల టికెట్ కేటాయింపుపై పార్టీ హామీ ఇవ్వలేదని, టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు. -
బీజేపీలో చేరిన బీబీ పాటిల్ కండువా కప్పి ఆహ్వానించిన ఛుగ్, లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌లు పాటిల్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా, జహీరాబాద్ లోక్‌సభ టికెట్‌పై పాటిల్‌కు నడ్డా హామీ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీలో చేరడానికి ముందే బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. జహీరాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, అయితే మరింత అభివృద్ధిని కాంక్షిస్తూ తాను బీజేపీలో చేరానని తెలిపారు. బీఆర్ఎస్ మునుగుతున్న నావ అని, త్వరలో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కె.లక్ష్మణ్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్ బీబీబీ.. అంటే బాప్, బేటా, బిటియా (తండ్రి, కుమారుడు, కూతురు) పార్టీగా మారిందని తరుణ్ ఛుగ్ ఎద్దేవా చేశారు. -
రాజకీయ భిక్ష పెట్టిన జిల్లాకే అన్యాయం
దేవరకద్ర/జడ్చర్ల/కొందుర్గు: పాలమూరు– రంగారెడ్డి పథకాన్ని ఎండబెట్టారని, మేడిగడ్డను బొందపెట్టారని ఏఐసీసీ నేత వంశీచంద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చలో పాలమూరు– రంగారెడ్డి రిజర్వాయర్ల సందర్శన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి భూత్పూర్ మండలం కర్వెన, జడ్చర్ల మండలం ఉద్ధండాపూర్ రిజర్వాయర్లను సందర్శించారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని కూడా ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వంశీచంద్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు వాస్తవ రూపం ప్రజలకు తెలియాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 2015 లో శిలాఫలకం వేసిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కూర్చొని మూడేళ్లలో పూర్తి చేస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్.. రెండుసార్లు అధికారంలోకి వచ్చి నా ఒక్క ఎకరాకు నీరివ్వలేదని వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. పాల మూరు జిల్లా ఎడారిగా మారుతున్నా పట్టించుకోలేదని, 2009లో ఎంపీగా గెలిపించి రాజకీయంగా భిక్ష పెట్టిన జిల్లాకే తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడానికి ఒక పంపును నామమాత్రంగా ప్రారంభించి పూర్తి చేశామని గొప్పలు చెప్పారని విమర్శించారు. కర్వెన రిజర్వాయర్ ఇప్పటికీ అసంపూర్తి పనులతో అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా అభివర్ణించిన కాళేశ్వరంను బొంద పెట్టారన్నారు. కమీషన్ల కక్కుర్తితో మేడిగడ్డ పగుళ్లతో కుంగిపోవడానికి కారణం అయ్యారని ఆరోపించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులకు పిచ్చి పట్టిందని.. ఎర్రగడ్డకు వెళ్లాల్సిన నాయకులు, మేడిగడ్డకు వెళ్లారని ఎద్దేవా చేశారు. బృందంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, పరి్ణకారెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. -
నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్..
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి కేటీ ఆర్ రాజీనామా చేసి నల్లగొండ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. తాను సైతం నల్ల గొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. నల్లగొండలో కేటీఆర్ ఓటమి ఖాయమని, ఇక కారు షెడ్డు మూసుకోక తప్పదన్నారు. కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని మూసివేస్తాం అని కేసీఆర్ ప్రకట న చేస్తారా? అని సవాల్ విసిరారు. తాను సిరిసి ల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన ని స్పష్టం చేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి శుక్రవారం సచివాల యంలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లా డారు. కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదని కానీ రూ. లక్షల కోట్లు ఉన్నాయని, తనకు క్యారెక్టర్ ఉందని కానీ డబ్బులు లేవన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో రూ.200 కోట్లు ఖర్చు చేసి 30 వేల ఓట్లతో గెలిచాడని, తానై తే అలా గెలిస్తే రాజీనామా చేసేవాడినన్నారు. మాకు ప్రత్యర్థి బీజేపీనే... లోక్‌సభ ఎన్నికల్లో మాకు ప్రత్యర్థి బీఆర్ఎస్ కాదని, బీజేపీనే అని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోటీలో లేదని, బీజేపీకి రెండు, మూడు సీట్లు వస్తాయో లేదో తెలియదన్నా రు. బీజేపీ ఎంపీ డి.అర్వింద్‌ను ప్రజలు ఎప్పు డో మరిచిపోయారని కోమటిరెడ్డి చెప్పారు. రాజకీ యాల వల్ల ఆస్తులు పోగొట్టుకున్నామని, తనతో పాటు ఉత్తమ్ ఆస్తులు తగ్గాయన్నారు. తన పేరు మీద ఆస్తులుంటే అర్వింద్‌కు ఇచ్చేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరిలలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని రాహుల్ గాంధీకి ప్రతిపాదించామని తెలిపారు. -
కాళేశ్వరంపై కుట్ర
అన్నారం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి/ సాక్షిప్రతినిధి, వరంగల్/ సాక్షి, హైదరాబాద్/ దామెర/ జనగామ: రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభు త్వం మేడిగడ్డలో తలెత్తిన లోపాన్ని సాకుగా చూపించి మొత్తం కాళేశ్వరాన్ని విధ్వంసం చేసే కుట్రకు పాల్పడుతోందనే అనుమానాలు కలుగుతున్నా యని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చేసిన ప్రకటన, గతంలో రేవంత్ బాంబులు పెట్టి ప్రగతిభవన్ పడగొడతానన్న మాటలు తమ అనుమానాన్ని బలపరుస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ట పన్నాగాన్ని బయటపెట్టేందుకే బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ వద్దకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలతో కూడిన రెండు వందల మంది బృందం మిగతా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించింది. ‘చలో మేడిగడ్డ’పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో.. మాజీ మంత్రి కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా.. కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీశ్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ రైతుల విషాదగాధలు తెలిసిన కేసీఆర్.. వృథాగా సముద్రంలో కలిసే గోదావరి జలాలను బీళ్లకు మళ్లించేందుకు కాళేశ్వరానికి శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం ద్వారా 98వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయని సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రోజుకో సంఖ్య చెప్తున్నారు. రేవంత్ సాంగత్యంతో ఉత్తమ్ కూడా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. ఉద్యమ ప్రయోజనాలను కాలరాసే కుట్ర తెలంగాణ ఉద్యమ ఫలితం కాళేశ్వరం ప్రాజెక్టు. ఉద్యమ ప్రయోజనాలను కాలరాసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలి. రేవంత్.. మీరు తెలంగాణ ఉద్యమ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేశారు. ఇప్పుడు సీఎంగానైనా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి. చరిత్రలో ద్రోహిగా మిగిలిపోకండి. మేడిగడ్డ బ్యారేజీని ధ్వంసం చేయకండి. కావాలంటే ఎన్ని కేసులైనా పెట్టుకోండి. మమ్మల్ని ఎంతైనా హింసించండి. కానీ ప్రాజెక్టును, రైతులను కాపాడండి. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సమస్యనో.. ఎన్నికలు, ఓట్ల సమస్యనో కాదు. ఇది లక్షలాది తెలంగాణ రైతుల కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్ల స్థాయిలో ఉన్న సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యం చేసి మిగతా పిల్లర్లకు విస్తరించేలా చేయకండి. అలాంటిదేమన్నా జరిగి మేడిగడ్డకు మరింత నష్టం వాటిల్లితే.. దానికి పూర్తి బాధ్యత రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారుదే. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం.. కాంగ్రెస్ నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలు సమస్యలను లేవనెత్తితే పరిష్కారం చూపకుండా.. పోటీసభలు, పర్యటనలతో దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించవద్దంటూ బీఆర్ఎస్ నల్లగొండ సభ పెడితే.. కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డకు వెళ్లి హడావుడి చేశారు. కుంగిన రెండు, మూడు పిల్లర్లను భూతద్దంలో చూపి కాళేశ్వరం పట్ల అపోహలు కల్పించే ప్రయత్నం చేశారు. నేడు కాళేశ్వరాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’కు పిలుపునిస్తే.. ప్రజలు, మీడియా దృష్టి మళ్లించేందుకు పాలమూరు–రంగారెడ్డి పర్యటనకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించడంలో నిమగ్నమైంది. ఇప్పటికైనా పనులు చేపట్టాలి.. 2022లో వచ్చిన భారీ వరదలతో కన్నెపల్లి, అన్నారం పంపుహౌజులు మునిగితే.. యుద్ధప్రాతిపాదికన ఏజెన్సీ ఖర్చులతో మరమ్మతులు చేయించి పునరుద్ధరించాం. ఆ విషయాన్ని ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడానికే ఇక్కడిదాకా వచ్చాం. అన్నారం బ్యారేజీకి ఎలాంటి ఢోకా లేదు. చిన్న సమస్యలుంటే వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయొచ్చు. దానిలోకి 34 స్ట్రీమ్లతోపాటు మానేరు నీళ్లు కూడా వస్తాయి. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేస్తూనే.. అన్నారం నుంచి కాళేశ్వరం ఆయకట్టుకు నీళ్లు అందించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ పనులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. మేడిగడ్డ ఒక కాంపోనెట్ మాత్రమే..: కడియం శ్రీహరి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీలు, పంపుసెట్లు, రిజర్వాయర్లలో (కాంపోనెట్ల)లో మేడిగడ్డ ఒకటి మాత్రమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. ‘‘మొత్తం 15 రిజర్వాయర్లు, 21 పంపుహౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల కాలువలు.. 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం.. 240 టీఎంసీల వినియోగం.. వీటన్నింటి సమగ్ర స్వరూపమే కాళేశ్వరం ప్రాజెక్టు. రాష్ట్రంలో ఎప్పుడూ ఏ ప్రాజెక్టు కూడా ప్రతిపాదిత అంచనాలతో పూర్తి కాలేదు. నాగార్జునసాగర్ 30 ఏళ్లు, ఎస్సారెస్పీ స్టేజ్ –1, స్టేజ్–2లు 40 ఏళ్లు దాటితే గానీ పూర్తి కాలేదు. వాటి అంచనా వ్యయం 10–20రెట్లు పెరిగింది. ఇప్పటివరకు కాళేశ్వరం నీటితో నేరుగా 98,570 ఎకరాలు, ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థల ద్వారా 39,146 ఎకరాలు కొత్త ఆయకట్టు సమకూరింది. ఎస్సారెస్పీ స్టేజ్ 1, 2, నిజాంసాగర్ల నీటితో నింపిన 2,143 ట్యాంకుల ద్వారా 1,67,050 ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చింది. 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టు, 17,08,230 ఎకరాల స్థిరీకరణ కలిపి మొత్తం 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందుతాయి. తుమ్మిడిహట్టి బ్యారేజీ కడితే చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు పరిధి ముంపునకు గురికావడం, మహారాష్ట్రలో 3,786 ఎకరాల భూమి ముంపు ఉండంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది..’’అని వివరించారు. ఉద్రిక్తంగా.. ఉద్విగ్నంగా.. బీఆర్ఎస్ చేపట్టిన ‘చలో మేడిగడ్డ’పర్యటన ఆద్యంతం ఉద్విగ్నంగా, ఉద్రిక్తంగా సాగింది. ప్రత్యేక బస్సుల్లో బయల్దేరిన నేతలకు పర్యటన పొడవునా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మధ్యలో కాన్వాయ్‌లో చేరుతూ ముందుకు సాగారు. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట సమీపంలో బీఆర్ఎస్ కాన్వాయ్‌ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. పోలీసులు వారిని నిలువరించారు. తర్వాత ఇదే జిల్లా దామెర మండలంలో ఆగిన కేటీఆర్.. స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు. ‘‘జై తెలంగాణ అంటే పోలీసులతో దాడులు చేయిస్తారా? ఇది దారుణం బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి..’’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు భూపాలపల్లిలోని కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసి.. మేడారం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కోసం కొందరినే అనుమతించడంతో.. బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా.. మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ బృందం కాన్వాయ్‌లోని ఓ బస్సు టైరు జనగామ పరిధి నెల్లుట్ల–యశ్వంతాపూర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో పేలింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపేయడం ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే ‘చలో మేడిగడ్డ’ ప్రభుత్వ బాధ్యత మరిచి ప్రాజెక్టులపై రాజకీయాలు చేస్తోంది: కేటీఆర్ పదేళ్లలో పచ్చబడ్డ తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చేలా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎండగట్టేందుకే ‘చలో మేడిగడ్డ’కార్యక్రమం చేపట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. శుక్రవారం పర్యటనకు బయలుదేరే ముందు తెలంగాణభవన్‌లో, తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద ఆయన మాట్లాడారు. ‘‘కాళేశ్వరంపై అసలు నిజాలను ప్రజలకు చెప్పే క్రమంలో ఈరోజు పర్యటన మొదటి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులోని ఇతర ప్రాజెక్టులు, రిజర్వాయర్లు సొరంగాలు, కాలువల వద్ద పర్యటిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమైన ఒక మేడిగడ్డ బ్యారేజీలోని మూడు పిల్లర్లలో వచ్చిన సమస్యను పట్టుకొని లక్ష కోట్ల రూపాయలు వృధా అన్న తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గ ప్రచారం చేస్తోంది. బ్యారేజీకి మరమ్మతు చేసి సాగునీరు ఇవ్వాలనే బాధ్యతను మరచి రాజకీయాలు చేస్తోంది. రాబోయే రోజుల్లో రైతన్నల పంటలు ఎండకుండా ఉండాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే దిక్కు..’’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులు కూలిపోవాలనే కుతంత్రం ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టులను పరిరక్షించడానికి బదులు అవి కూలిపోవాలని కాంగ్రెస్ కుతంత్రాలు పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘పంజాబ్‌నే తలదన్నే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న కాంగ్రెస్ నీచ సంస్కృతికి సమాధి కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మరమ్మతులు కూడా చేతకాని గుంపుమేస్త్రిని నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడే. దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తే భరించబోం. మేడిగడ్డకు మరణశాసనం రాయాలని చూస్తే తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌కు నూకలు చెల్లడం ఖాయం’’అని కేటీఆర్ హెచ్చరించారు. కాగా.. ప్రాజెక్టుల్లో సాంకేతిక లోపాలు తలెత్తితే సరిదిద్దుకోవాలే తప్ప రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. బీజేపీలోకి ఎంపీ బీబీ పాటిల్
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీలోకి చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో చేరారు. జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాటిల్ బరిలోకి దిగనున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్‌రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్‌నగర్- డీకే అరుణ, నాగర్‌కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది.